వచ్చేది రాజన్న రాజ్యమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వచ్చేది రాజన్న రాజ్యమే

వచ్చేది రాజన్న రాజ్యమే

Written By news on Monday, July 29, 2013 | 7/29/2013

మరో ప్రజాప్రస్థానంలో ప్రజలకు షర్మిల భరోసా
సువర్ణయుగం వస్తుంది.. ప్రజల కష్టాలు తీరుతాయి
వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ.700 పింఛన్ అందుతుంది
పిల్లలను చదివిస్తే అమ్మ ఖాతాలోకే డబ్బులు చేరతాయి

మరో ప్రజాప్రస్థానం నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘త్వరలో జగనన్న వస్తాడు. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది. మీ కష్టాలు తీరుతాయి. మత్స్యకారులకు నెలకు 35 కిలోల బియ్యం ఇస్తారు. మీ పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పిస్తారు. పక్కా ఇళ్లు కట్టిస్తారు. మీ అవసరాలను జగనన్న ఎప్పుడో గుర్తించారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ‘‘చేపల వేటకు వె ళ్లడానికి వలలు లేవు. ఉండడానికి ఇళ్లు నేవు. ఈ పెభుత్వం మాపై చిన్నచూపు సూత్తాంది. పింఛన్లు కూడా అందడం లేదు. మా బాధలు మీరైనా తీర్చాలమ్మా..’’ అంటూ శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన మత్స్యకారులు షర్మిలతో గోడు వెళ్లబోసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, రాజన్న రాజ్యంలో సమస్యలు తీరుతాయని షర్మిల వారికి భరోసానిచ్చారు. 

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం నరసన్నపేట నియోజకవర్గంలో సాగింది. దారి వెంట వృద్ధులు, వికలాంగులు తమ కష్టాలను షర్మిలతో చెప్పుకున్నారు. ‘‘రాబోయే సువర్ణ యుగంలో వృద్ధులకు, వితంతువులకు నెలనెలా రూ.700 పింఛను అందుతుంది. వికలాంగుల పింఛన్ రూ.1000 అవుతుంది. అక్కాచెల్లెళ్లు వాళ్ల పిల్లలను చదివించేటట్లు ప్రోత్సహించడం కోసం ఇద్దరు పిల్లలకు పదో తరగతి వరకు ఒక్కొక్కరికి నెలకు రూ.500 చొప్పున అమ్మ ఖాతాలోనే డబ్బులు పడతాయి. ఇంటర్మీడియట్ చదివితే నెలకు రూ.700, డిగ్రీ అయితే రూ.వెయ్యి చొప్పున అమ్మ అకౌంట్లోనే పడతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఉండనే ఉంది. 

జగనన్న సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా నిరుపేదలందరికీ పక్కా ఇల్లు కట్టిస్తారు. పేదవాళ్లు మళ్లీ ఎప్పటిలాగే ధీమాగా వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే రోజులు వస్తాయి...’’ అని చెప్పారు. సారవకోట మండలం వడ్డినవలసలో రైతులను షర్మిల పలకరించారు. ఎత్తిపోతల పథకం ద్వారా తమ ప్రాంతానికి సాగునీరు రాకపోవడంపై ఆవేదన వెళ్లగక్కారు. అప్పట్లో వైఎస్ పుణ్యమా అని ఈ పథకం కింద తమ గ్రామం వరకు సాగునీరు వచ్చిందని, ఆయన తరువాత ఈ పాలకులు మిగతా పనులు పట్టించుకోకపోవడంతో శివారు ప్రాంతాల్లోని తమ పొలాలకు నీళ్లందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘జగనన్న రైతును రాజుగా చూస్తారు. మీకు కచ్చితంగా న్యాయం చేస్తారు’’ అని షర్మిల వారికి హామీ ఇచ్చారు.

14.1 కిలోమీటర్ల నడక..: ఆదివారం 223వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గ కేంద్రం అంగూరు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి అద్దనవలస, వెంకటా పురం, వడ్డినవలస, అలుదు, సారవకోట, బురుజువాడ, కురుడింగి, చిన్నకిట్టాలపాడు, బొంతు వరకు పాదయాత్ర సాగింది. బొంతు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.00 గంటలకు చేరుకున్నారు. ఆదివారం మొత్తం 14.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,996.5 కి.మీ. యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు, జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, తాజా మాజీ ఎమ్మెల్యే పిరియ సాయిరాజు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు వరుదు కళ్యాణి, కిల్లి రామ్మోహన్‌రావు, విశ్వాసరాయి కళావతి, కల్మట వెంకటరమణ, స్థానిక నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి,సత్తిరామకృష్ణారెడ్డి, బొడ్డేపల్లి పద్మజ, దుప్పల రవీంద్ర, దవళ వెంకటగిరిబాబు తదితరులు ఉన్నారు.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
ఆదివారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 223 : కిలోమీటర్లు: 2,996.5
Share this article :

0 comments: