ఏకగ్రీవ సర్పంచులను తన్నుకుపోయేందుకు టీడీపీ, కాంగ్రెస్ కుయుక్తులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏకగ్రీవ సర్పంచులను తన్నుకుపోయేందుకు టీడీపీ, కాంగ్రెస్ కుయుక్తులు

ఏకగ్రీవ సర్పంచులను తన్నుకుపోయేందుకు టీడీపీ, కాంగ్రెస్ కుయుక్తులు

Written By news on Friday, July 19, 2013 | 7/19/2013

- ఏకగ్రీవ సర్పంచులను తన్నుకుపోయేందుకు టీడీపీ, కాంగ్రెస్ కుయుక్తులు
- ‘పై చేయి’ కోసం టీడీపీ, కాంగ్రెస్ పడరాని పాట్లు 
- సర్పంచుల సంఖ్య పెంచుకోవడానికి పన్నాగాలు 
- భారీ నజరానాలు చూపుతూ గాలం వేస్తున్న వైనం
- వైఎస్సార్‌సీపీ సహా ఇతర పార్టీల వారినీ లాక్కునే యత్నం
- నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల మకాం
- ఎలాగైనా మనవైపునకు తిప్పుకోండి: నేతలకు బాబు హుకుం 

సాక్షి, హైదరాబాద్: ఇప్పటిదాకా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో కలిసిమెలిసి రాజకీయాలు చేస్తున్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం.. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో తామే పైచేయి సాధించామని చెప్పకునేందుకు నానా కుయుక్తులకు తెర తీస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన క్షణం నుంచే పరస్పర సహకార ధోరణిలో వెళ్లేలా అవి వ్యూహాన్ని రూపొందించుకోవడం తెలిసిందే. ఆ మేరకు ముందే ఒప్పందానికి వచ్చి మరీ పంచాయతీలవారీగా ఉమ్మడి అభ్యర్థిని నిలబె ట్టడం, పోటీ తప్పదనుకునే చోట్ల ఓట్లు చీలకుండా డమ్మీ అభ్యర్థులను బరిలో నిలపడం వంటి ప్రయత్నాలు చేశాయి. కానీ ఏం చేసినా ఏకగ్రీవ పంచాయతీల్లో వారికి అనుకున్న ఫలితం దక్కలేదు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని చెప్పే కుట్రలో భాగంగా ఏకగ్రీవమైన వారిని తమ ఖాతాలో వేసుకోబోయి ఇరు పార్టీలూ భంగపడ్డాయి. ఏం చేసినా ఏకగ్రీవాల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగడంతో ఇప్పుడవి మలి విడత కుట్రలకు తెరతీశాయి. ఏకగ్రీవంగా గెలిచిన స్వతంత్రులందరినీ తమవైపు తిప్పుకోవడానికి శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తున్నాయి. ఇందుకు పెద్దఎత్తున కసరత్తు చేసినట్టు ఆయా పార్టీల నేతలే చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకవైపు, టీడీపీ నేతలు మరోవైపు ఇందుకోసం ఇప్పటికే జిల్లాల్లో మకాం వేశారు.

స్వతంత్రులకు గాలం వేసే పనిలో పడ్డారు. భారీగా ముట్టజెప్పి వారిని తమ పార్టీ ఖాతాలో వేసుకునే పనులకు జోరు పెంచారు. అభ్యర్థులకు ఫోన్లు చేసి మరీ తమ పార్టీకి మద్దతుగా నిలవాలని, భారీ నజరానాలిస్తామని బుజ్జగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో స్వయంగా ముఖ్యమంత్రి కిరణే ఎమ్మెల్యేలను, మంత్రులను ఇందుకు పురమాయించినట్టు తెలిసింది. అందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా వారికి సూచిస్తున్నట్టు సమాచారం. ఏం చేసైనా ఏకగ్రీవం లెక్కలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండేలా వాటిని భారీగా మార్చాల్సిందేనని వారికి కిరణ్ లక్ష్యం నిర్దేశించారట. అందుకోసం ఒక్కో ప్రాంత సర్పంచుకు ఒక్కో రేటును కూడా అధికార పార్టీ నిర్ధారించినట్టు చెబుతున్నారు. స్వతంత్రులకే గాక, వైఎస్సార్‌సీపీతో పాటు ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన వారికి కూడా కాంగ్రెస్, టీడీపీ గాలమేస్తున్నాయి. ఏకగ్రీవాల్లో దెబ్బ తినడంతో ఎన్నికలు జరిగే పంచాయతీల్లోనైనా ‘పై చేయి’ సాధించేలా కుమ్మక్కుకు మళ్లీ తెర తీశాయి.

బాబు ఫోను పురమాయింపులు: మొత్తం వ్యవహారాన్ని బాబు తన కనుసన్నల్లో నడిపిస్తున్నారు. ఒకే నామినేషన్ పడ్డ గ్రామాల వివరాలను తెప్పించుకుని, వాటిల్లో సింహభాగం టీడీపీవేనంటూ ఆయన జోరుగా లీకులిచ్చారు. 599 సర్పంచ్ స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుందంటూ పత్రికలకు ఈ-మెయిళ్లు పంపి హడావుడి చేశారు. కానీ వాస్తవాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉండటంతో కంగుతిన్న బాబు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాల్లో మంచి ఫలితాలు సాధించామనే సంకేతాలను ప్రజల్లోకి పంపకపోతే టీడీపీ భవితవ్యంపై నీలినీడలు ఖాయమని భావించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన స్వతంత్రుల వివరాలను తెప్పించుకున్నారు. బుధ, గురువారాల్లో పార్టీ నేతల తో సుదీర్ఘంగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఎంత ఖర్చు చేసైనా సరే వారిని టీడీపీకేసి తిప్పుకోవాల్సిందిగా పురమాయించారు. ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతల్లో ఉన్న టీడీపీ నేతలంతా అదే పనిలో ఉన్నారు. అయితే స్వతంత్ర సర్పంచ్‌లు తమ ఎన్నికల ఖర్చు కంటే ఎక్కువగా ముట్టజెప్పాలని డిమాండ్ చేస్తున్నట్టు పలువురు టీడీపీ నేతలు బాబుకు వివరించడంతో, ‘‘మన కోటరీ ముఖ్యుల ‘ఆర్థిక’ సాయంతో ప్రతి అసెంబ్లీ స్థానం పరిధిలోనూ ఎక్కువ మంది సర్పంచులు టీడీపీ ఖాతాలోనే ఉండేలా చూడండి’’ అంటూ ఆదేశించినట్టు సమాచారం!

ఎన్నికలు జరిగే చోటా...: ఎన్నికలు అనివార్యమైన పంచాయతీల్లో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కొనసాగుతోంది. గెలిచే అవకాశమున్న బయటి అభ్యర్థులను ఎలాగోలా తమవైపు ఆకర్షించే పనుల్లో అవి తలమునకలయ్యాయి. మంత్రులు జిల్లాల్లోనే మకాం వేసి మంతనాల్లో మునిగి తేలుతున్నారు. 

రుజువులివిగో...
నవ్విపోదురు గాక...: మహబూబ్‌నగర్ నియోజకవర్గం హన్వాడ మండల కిష్టంపల్లి పంచాయతీ సర్పంచ్‌గా సరోజ, ఉప సర్పంచ్‌గా వెంకటయ్య వైఎస్సార్‌సీపీ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెస్ మద్దతుతోనే గెలిచారంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పారు. కానీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాత్రం వాటిని ఖండించారు. తాము వైఎస్సార్‌సీపీ మద్దతుతోనే గెలిచామని పార్టీ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు.
నానా ప్రలోభాలు...: తూర్పుగోదావరి జిల్లాలో పశుసంవర్ధక మంత్రి పినిపే విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం నియోజకవర్గం నడిపూడి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికైన బి.ఆదినారాయణను కాంగ్రెస్ వైపు తిప్పుకున్నారు. ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, అల్లవరం మొగళ్లమూరు సర్పంచ్‌లనూ ఇలాగే ఒత్తిడి చేస్తున్నారు. ఖమ్మం జిల్లా దమ్మాయిగూడెం పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవమైన వైఎస్సార్‌సీపీ నేత దేవళ్ల జ్యోతిని కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఒత్తిడి చేస్తున్నారు.

నాది వైఎస్సార్‌సీపీయే: తాను వైఎస్సార్‌సీపీ నేతనని, ఆ పార్టీ మద్దతుతోనే ఏకగ్రీవంగా గెలిచానని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొత్తపూసలమర్రు సర్పంచ్ బస్వాని చంద్రరావు వివరించారు. కానీ టీడీపీ, కాంగ్రెస్ నేతలు తమ పార్టీ తరఫున గెలిచినట్టుగా చెప్పాలంటూ ప్రలోభపెడుతున్నారని తెలిపారు. ఉణుదుర్రు సర్పంచ్ దాట్ల పర్వత వర్ధనమ్మ కూడా తాను వైఎస్సార్‌సీపీ మద్దతుతో ఎన్నికైతే, టీడీపీ నుంచి గెలిచినట్టు చెప్పాలని ఎమ్మెల్యే వెంకటశివరామరాజు ప్రలోభపెడుతున్నారన్నారు. 

వైఎస్సార్‌సీపీ సర్పంచ్ హైజాక్! : గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కొండకావూరు పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవమైన వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి నలమాల కిశోర్‌కుమార్‌ను కాంగ్రెస్ నేతలు ఏకంగా ఎత్తుకెళ్లారు. ఆయన సర్పంచ్‌గా ఏకగ్రీవమైనట్లు బుధవారం అధికారికంగా ప్రకటించగానే మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అనుచరులు వచ్చి, కాంగ్రెస్ కండువా వేసుకోవాలంటూ బెదిరించారు. తాను వైఎస్సార్‌సీపీ అభ్యర్థినని బహిరంగంగా చెబుతున్నా బలవంతంగా కారెక్కించి కాసు ఇంటికి తీసుకెళ్లారు. ప్రలోభపెట్టి, కాంగ్రెస్ కండువా వేసి మంత్రితో కలిపి ఫొటోలు తీయించారు. 

మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం నర్మెట మండలం నర్సాపూర్‌లో ఏకగ్రీవంగా ఎన్నికై దేవరాజుల మురళి అనే టీఆర్‌ఎస్ మద్దతుదారును ప్రలోభపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు.

‘అనంత’లో బెదిరింపుల పర్వం: అనంతపురంలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో, స్వతంత్రంగా బరిలో ఉన్న అభ్యర్థులను టీడీపీ, కాంగ్రెస్ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కళ్యాణదుర్గంలో కొందరు నమ్మకమైన పోలీసు అధికారులను నియమించుకున్న మంత్రి రఘువీరారెడ్డి వారి ద్వారా వైఎస్సార్‌సీపీ తదితర నేతలను బెదిరిస్తున్నారు. ప్రచారంలో పాల్గొనొద్దని, పోలింగ్ నాడు గ్రామంలో ఉంటే అంతుచూస్తామని బెదిరిస్తున్నారు. శింగనమలలోనూ పోలీసులను, తన ఫ్యాక్షనిస్టు అనుచరులను మంత్రి శైలజానాథ్ ఉసిగొల్పుతున్నారు. చిత్తూరు జిల్లాలో పోలీసులే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ఆరోపించారు.
Share this article :

0 comments: