వివిధ చానళ్లకు విజయమ్మ ఇంటర్వ్యూ... ముఖ్యాంశాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వివిధ చానళ్లకు విజయమ్మ ఇంటర్వ్యూ... ముఖ్యాంశాలు

వివిధ చానళ్లకు విజయమ్మ ఇంటర్వ్యూ... ముఖ్యాంశాలు

Written By news on Sunday, July 7, 2013 | 7/07/2013

వివిధ చానళ్లకు విజయమ్మ ఇంటర్వ్యూ... ముఖ్యాంశాలు

స్థానిక ఎన్నికలైనా... సాధారణ ఎన్నికలైనా... వైఎస్సార్ కాంగ్రెస్ ఘనవిజయం ఖాయం: విజయమ్మ

225 ఎమ్మెల్యే సీట్లు, 36 ఎంపీ సీట్లు గెలుచుకుంటాం
తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర సర్కారే
అన్ని ప్రాంతాల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా నిర్ణయించాలి
కోస్తా, సీమలే కాదు తెలంగాణలోనూ బలంగా ఉన్నాం
ఉప ఎన్నికలు జరిపే దమ్మూ, ధైర్యం కాంగ్రెస్‌కు లేదు
కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయింది టీడీపీ, చంద్రబాబే
ప్రభుత్వం పడిపోకుండా చంద్రబాబు కాపాడుతున్నారు
మాది ఎవరి డీఎన్‌ఏ కాదు... విలువలు, విశ్వసనీయతకు కట్టుబడటమే మా డీఎన్‌ఏ
జగన్ బయటకొస్తే తట్టుకోలేమని సీఎం ఢిల్లీకి చెప్పారు
జగన్ కేసులో సీబీఐ దర్యాప్తు అడ్డగోలుగా సాగుతోంది
వైఎస్, జగన్‌లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పనందుకే నిమ్మగడ్డ ప్రసాద్‌ను పద్నాలుగు నెలలుగా జైల్లో పెట్టింది
జగన్‌కో న్యాయం, చంద్రబాబుకు మరో న్యాయమా?
జగన్‌పై కేసులు ఎందుకు పెట్టారో ప్రజలకు తెలుసు
మాకు దేవుడిపై నమ్మకముంది.. జగన్ తప్పకుండా బయటకొస్తారు

రెండేళ్ల కిందట ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న తొలి పంచాయతీ ఎన్నికల్లో 80 నుంచి 90 శాతం పదవులను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ తెలిపారు. రాష్ట్రంలో తమకు ఏ పార్టీ నుంచీ పోటీ లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే కాదు సాధారణ ఎన్నికలైనా సరే ఎప్పుడు వచ్చినా తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 225 సీట్లు, పార్లమెంటు ఎన్నికల్లో 36 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని.. అన్ని ప్రాంతాల మనోభావాలనూ దృష్టిలో పెట్టుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నదే తమ పార్టీ వైఖరి అని పునరుద్ఘాటించారు. అయితే.. రాయల తెలంగాణ పేరుతో రాయలసీమ నాలుగు జిల్లాలను అటు రెండు, ఇటు రెండు జిల్లాలుగా చీల్చాలన్న ప్రతిపాదన జగన్‌ను దెబ్బతీసే ఉద్దేశంతోనేనన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ను దెబ్బతీయటానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు కుమ్మక్కయి నడుపుతున్న కుట్రలను ఎండగట్టారు. సీబీఐ దర్యాప్తు అంతా ఇష్టానుసారంగా సాగుతోందని ధ్వజమెత్తారు. తన కుమారుడు, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి పద్నాలుగు నెలలుగా జైలులో నిర్బంధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కేసుల విషయంలో.. జగన్‌కో న్యాయం, చంద్రబాబుకో న్యాయం, ములాయంసింగ్ యాదవ్‌కో న్యాయం, రాబర్ట్ వాద్రాకో న్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు. వైఎస్, కానీ జగన్ కానీ ఎలాంటి తప్పూ చేయలేదని.. జగన్‌పై కేసులు ఎందుకు బనాయించారో ప్రజలందరికీ తెలుసునని స్పష్టంచేశారు. దేవుడు అంతా చూస్తున్నాడని.. జగన్ త్వరలోనే బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. పంచాయతీ ఎన్నికలకు పార్టీ నేతలు, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయటానికి ఇటీవల విజయమ్మ 20 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. నాలుగు ప్రాంతీయ సదస్సులతో పాటు తొమ్మిది జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వివిధ చానళ్లకు విడివిడిగా ఆమె ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక ప్రశ్నలకు విజయమ్మ సూటిగా సమాధానం చెప్పారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివీ...

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంచాయతీ ఎన్నికల్లో మీ పార్టీ వ్యూహమేమిటి? మీ విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి?
వైఎస్సార్ కాంగ్రెస్ పుట్టి రెండేళ్లయింది. మాకు జనంలో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఎదుర్కొంటున్న పంచాయతీ ఎన్నికల్లో 80 నుంచి 90 శాతం పదవులను గెల్చుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నాం. ఈ క్రమంలో ప్రజలను కార్యోన్ముఖులను చేసి వారి మద్దతు పొందేందుకు నేను రాష్ట్రంలో విసృ్తతంగా పర్యటించాను. పార్టీ నిర్వహించిన ప్రాంతీయ సదస్సులు శ్రేణులను ఉత్సాహ పరిచాయి. పద్ధతి ప్రకారం అయితే తొలుత మున్సిపల్, ఆ తరువాత జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలి. కానీ ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో సర్పంచ్ ఎన్నికలను ముందుకు తెచ్చింది. స్థానిక ఎన్నికలు కాకుండా నేరుగా అసెంబ్లీ సాధారణ ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, అందువల్ల ప్రజలను గ్రూపులుగా విభజిస్తే ఒక్క శాతం అయినా ప్రజాదరణను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికలు ఏ విధంగా వచ్చినా ఎదుర్కోటానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కోటానికి మేం సిద్ధమే. నిజంగా వాటిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉంటే నిర్వహించి ఉండే వాళ్లు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని మరికొంత కాలం జైల్లోనే ఉంచితే బాగుంటుందని, ఆయన బయటకు వస్తే తట్టుకోలేమని, ఏ ఎన్నికలూ గెలవలేమని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో చెప్పివచ్చారని మాకు సమాచారం ఉంది. అందుకే జగన్ జైలులో ఉన్నా మా పార్టీకి గల జనాదరణతో సత్తా చాటాలని భావిస్తున్నాం.


ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో మీ పార్టీ బాగా వెనుకబడిపోయింది కదా! అలాంటపుడు ఇపుడెలా ఆధిక్యతను సాధిస్తారనుకుంటున్నారు?
సహకార ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయా? ప్రజాస్వామ్యానికి పాతరేసి ప్రభుత్వం ఇష్టానుసారం జరుపుకుంది. ఆ ఎన్నికల్లో పాల్గొన్నది 4.5 శాతం ఓటర్లు మాత్రమే. వైఎస్సార్ కాంగ్రెస్ ఎక్కడైతే గెలుస్తుందని భావించారో ఆ సొసైటీల్లో అంతా స్టేలు ఇచ్చి ఎన్నికలను నిలిపివేశారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క విధానం పాటించి అధికారపక్షం కుట్రలకు పాల్పడింది.

మీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని అంటున్నారు. ఇలాంటివి మీ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయవా?
జవాబు: మా పార్టీలో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు. కుటుంబ సమస్యలుగా వాటన్నింటినీ పరిష్కరించుకుంటాం. ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఎలాంటి సమస్యలుంటాయో అలాంటివే ఇవన్నీ. అయినా ఏ పార్టీలో విభేదాలు లేవో మీరు చెప్పండి? కాంగ్రెస్‌లో విభేధాలు లేవా? ముఖ్యమంత్రికీ, సహచర మంత్రులకూ విభేదాలు లేవా? ఇక టీడీపీలో బాలకృష్ణకు, హరికృష్ణకు విభేదాలు లేవా? హరికృష్ణకూ చంద్రబాబుకూ మధ్య గొడవలు లేవా? జూనియర్ ఎన్‌టీఆర్, చంద్రబాబుకు మధ్య ఇబ్బందులు లేవా? మాది కొత్తగా ఏర్పడిన పార్టీ కనుక.. ఇతర పార్టీల నుంచి మా పార్టీలోకి నాయకులు, కార్యకర్తలు వచ్చారు. వారందరినీ సర్దుబాటు చేయటానికి కొంత సమయం పడుతుంది. ప్రజలు మా వెంట ఉన్నారు. 

కోస్తా, రాయలసీమ ప్రాంతంలో మీ పార్టీ ఉన్నంత బలంగా తెలంగాణలో లేదంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
లేదు... అదెంత మాత్రం నిజం కాదు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని అభిమానించే వారు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎలా ఉన్నారో.. తెలంగాణలో కూడా అలాగే ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన పథకాల వల్ల లబ్ధిపొందిన వారూ ఉన్నారు. తెలంగాణ వాదాన్ని వైఎస్ ఎప్పుడూ గౌరవించే వారు. ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఉచిత విద్యుత్తు, రుణాల మాఫీ వంటి పథకాల్లో లబ్ధిపొందిన వారిలో 70 శాతం మంది తెలంగాణ వారే. సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్ హయాంలో ఖర్చు చేసిన 50 వేల కోట్ల రూపాయల్లో తెలంగాణకు 25 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. అంతకుముందున్న టీడీపీ కానీ, ఇతర ప్రభుత్వాలు కానీ తెలంగాణ ప్రాంతంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధిని విస్మరించాయి. కానీ వైఎస్ ఈ రెండింటినీ ప్రాధాన్యంగలవిగా గుర్తించి అభివృద్ధి చేశారు. తెలంగాణలో జగన్ ఓదార్పుయాత్ర జరుగలేదు కనుక, షర్మిల పాదయాత్ర కూడా పరిమితంగానే జరిగింది కనుక అక్కడ మా పార్టీకి బలం తక్కువగా ఉన్నట్లు అనిపించి ఉండొచ్చు. కానీ.. మా పార్టీ నేతలు జనంలోకి వెళ్లే కొద్దీ జనం మాకు దగ్గరగా వస్తున్నారు. తెలంగాణలో కూడా మాకు మంచి విజయావకాశాలున్నాయి.

మీరు ఎక్కువగా టీడీపీపైనే విమర్శలు చేస్తున్నారని, కాంగ్రెస్‌ను ఏమీ అనటం లేదనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్‌తో అవగాహన ఉన్నందుకే అంతగా విమర్శించటం లేదని కూడా టీడీపీ వారి నుంచి విమర్శలు ఉన్నాయి...

అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. రికార్డులు చూడండి... నేను మాట్లాడిన ప్రసంగాలను పరిశీలించమనండి. చంద్రబాబును ఏ విధంగా అయితే విమర్శిస్తున్నానో అదే స్థాయిలో కాంగ్రెస్‌నూ తూర్పారబడుతున్నాను. తొమ్మిదేళ్ల చంద్రబాబు పరిపాలనలో ఏ విధంగా అయితే ప్రజలపై పన్నులు వేసి వేధించారో బాధించారో.. ఇపుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అలాగే చేస్తున్నారని విమర్శించాను. నేను మాట్లాడిన ప్రతి సభలోనూ ఈ ఇద్దరి పరిపాలన గురించి చెప్తున్నాను. కాంగ్రెస్‌తో మా పార్టీకి ఎలాంటి అవగాహన లేదు. కుమ్మక్కు లేదు. అలా కుమ్మక్కయింది చంద్రబాబే. అందుకే ఆయన కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు. ప్రభుత్వం పడిపోదని తెలిసి బాబు తొలిసారి అవిశ్వాసం పెట్టారు. రెండోసారి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం వచ్చినపుడు విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడారు. చంద్రబాబు ఎలా చెప్తే ప్రభుత్వం అలా చేస్తోంది. మంత్రులను తొలగించాలంటే తొలగిస్తారు. ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయాలంటే చేస్తున్నారు. స్థానిక సంస్థల నుంచి మండలికి జరిగే ఎన్నికల మొదలు, సమాచార హక్కు కమిషనర్ల నియామకం వరకూ టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. మేం కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయితే జగన్ పద్నాలుగు నెలలుగా జైల్లో ఎందుకు ఉండాల్సి వస్తుంది?

రాష్ట్ర విభజనపై ఇపుడు చర్చలు జరుగుతున్నాయి కదా... మీ పార్టీ వైఖరి ఏమిటి?
మా పార్టీ వైఖరి ఏమిటనేది ప్లీనరీలోనే స్పష్టంగా చెప్పాం. అఖిలపక్ష సమావేశంలో కూడా వెల్లడించాం. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పాం. ఈ విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. అన్ని ప్రాంతాల ప్రజలకూ ఆమోదయోగ్యంగా పరిష్కరించాలని కోరాం. అసలు ఈ నిర్ణయం తీసుకుంటారా అని అనుమానంగా ఉంది. తెలంగాణ ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ ఎన్నికలకు పోవటానికే ఈ ఎత్తుగడ వేసిందని నేను భావిస్తున్నాను. విభజన గురించి రకరకాలుగా చెప్తున్నారు. రాయల తెలంగాణ అంటున్నారు. రెండు జిల్లాలు అక్కడ, రెండు జిల్లాలు ఇక్కడ అంటున్నారు. ఒకవేళ అలా అనుకున్నా రాయలసీమను రెండుగా విభజించటం తప్పు. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయటానికే ఇపుడీ అంశాన్ని తెరమీదకు తెచ్చినట్లుగా కనిపిస్తోంది. కోస్తా, రాయలసీమలో మా పార్టీకి ప్రజాదరణ బాగుందని, తెలంగాణలో బాగా లేదని వారు భావించి విభజనకు సిద్ధమవుతున్నారని చెప్తున్నారు. ఒకవేళ అనివార్యంగా విభజన జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు చోట్లా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. రెండు చోట్లా ఉంటుంది. 

జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చి అప్రూవర్‌గా మారితే మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావును జైలు నుంచి బయటకు తెస్తామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెప్పినట్లుగా ఆయన సోదరుడు చేసిన ప్రకటనపై మీరేమంటారు?
ఆ విషయం అలా ఉంచండి... కేసులో జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందుకే కదా మ్యాట్రిక్ ప్రసాద్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. నిమ్మగడ్డ ప్రసాద్‌పై ఈ కేసుల్లో జగన్ పేరు, వైఎస్ పేరు చెప్పాలని సీబీఐ చాలా ఒత్తిడి చేసింది. ఆయన చెప్పనందుకే పద్నాలుగు నెలలుగా జైల్లో పెట్టింది. మోపిదేవిని కూడా ఈ విషయంలో బలిపశువును చేశారు. నువ్వు లోపలికి పో.. వారం రోజుల్లో బయటకి తెస్తాం.. అని ఆయన చుట్టూ చేరిన ఒక గ్యాంగ్ ప్రభావితం చేసింది.

సీబీఐ దర్యాప్తు చాలా అడ్డగోలుగా సాగుతోంది. చంద్రబాబు కుంభకోణాలపై దర్యాప్తు చేయటానికి వారి వద్ద సిబ్బంది లేదని చెప్తుంది. అదే జగన్‌పై కోర్టు ఆదేశాలిచ్చిన 24 గంటల్లోనే రంగంలోకి దిగి హడావుడిగా దాడులు జరిపి నివేదికలు ఇచ్చింది. అందుకే నేనంటున్నాను.. కేసుల విషయంలో మోపిదేవికి ఓ న్యాయం.. సబితా ఇంద్రారెడ్డికి, ధర్మానకు మరో న్యాయమా? చిరంజీవికి ఓ న్యాయం, జగన్‌కు ఓ న్యాయమా? పిటిషన్‌లో 52వ ముద్దాయిగా ఉన్న జగన్‌ను తీసుకు వచ్చి 1వ ముద్దాయిగా సీబీఐ చేర్చుతుందా? ఎలా చేర్చుతుంది? ఆయన ఏరోజైనా ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఏమైనా ఉన్నారా? ఎప్పుడైనా సచివాలయం వైపు వెళ్లారా? ఇలాంటి కేసుల విషయంలో ములాయంసింగ్‌పై ఒక రకంగా, రాబర్ట్ వాద్రా విషయంలో మరో విధంగా వ్యవహరిస్తుంది. జగన్‌పై పెట్టినవి అలాంటి కేసులే కదా?

జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ ఏర్పాటులో మీ పాత్ర ఏమిటి? ఎన్నికల తరువాత ఎలాంటి వైఖరి అవలంబిస్తారు?
దానికి ఇపుడు తొందరేమొచ్చింది? ఎన్నికల తరువాత ఏర్పడే పరిస్థితులను బట్టి మా వైఖరి ఏమిటనేది జగన్ నిర్ణయిస్తారు. దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఆయన ఏ నిర్ణయమైనా తీసుకుంటారు.

జగన్‌పై సీబీఐ విచారణ, తాజాగా వస్తున్న మరిన్ని ఆరోపణల నేపథ్యంలో మీ పార్టీకి ప్రజాదరణ తగ్గిందనే ప్రచారం ఉంది?
వైఎస్ కానీ, జగన్ కానీ ఏ నేరాలు చేయలేదు. వారిపై నేరాలు సృష్టించబడ్డాయి. సీబీఐ ఇష్టానుసారం దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు నివేదికలే మార్చే పరిస్థితికి సీబీఐ వెళ్లింది. కావాల్సిన వాళ్లను కావాల్సిన రీతిలో కాపాడుతున్నారు. ఉదాహరణకు రైల్వే మాజీ మంత్రి బన్సల్ కేసులోనే చూడండి. కేసులో ఆయన పేరుంది. కానీ చార్జిషీటు నుంచి ఆయనను తొలగించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. పార్టీకి ప్రజాదరణ తగ్గిందనటంలో వాస్తవం లేదు. జగన్‌పై కేసులు ఎందుకు పెట్టారో ప్రజలకు బాగా తెలుసు.

జగన్‌కు బెయిల్ రాకపోతే పార్టీ గెలిస్తే మీరే ముఖ్యమంత్రి అవుతారా?
జగన్‌కు తప్పకుండా బెయిల్ వస్తుంది. ఎందుకురాదు? ఆయన బయటకు వస్తారు. తప్పకుండా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. ఎంతకాలమని ఆయన్ను అకారణంగా, అన్యాయంగా జైల్లో పెడతారు? రాజ్యాంగం ప్రకారం 90 రోజుల్లోపల బెయిల్ రావాలి. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. సుప్రీంకోర్టు గడువు విధించిన విధంగా సెప్టెంబర్‌లో బెయిల్ వస్తుందని విశ్వసిస్తున్నాం. తొలుత ఆరు నెలల లోపు దర్యాప్తు ముగించమన్నారు. మళ్లీ బెయిల్ కోసం వెళితే మరో నాలుగు నెలలు అన్నారు. అది పూర్తికాగానే బెయిలివ్వాలి. అంతకుముందే దర్యాప్తు పూర్తి చేస్తే ఇంకా ముందుగా వస్తుంది. మాకు దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంది. తప్పకుండా జగన్ జైలు నుంచి బయటకు వస్తారు.

సాధారణ ఎన్నికల్లో మీ పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయి? మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి?
జవాబు: సాధారణ ఎన్నికల్లో మా పార్టీకి 225 అసెంబ్లీ సీట్లు వస్తాయి. 36 లోక్‌సభ సీట్లు వస్తాయి. ఇవే కాదు.. మునిసిపల్, జెడ్పీ, మండల ఎన్నికలన్నింటిలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది.
Share this article :

0 comments: