అభిమానముంటే వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అభిమానముంటే వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించండి

అభిమానముంటే వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించండి

Written By news on Monday, July 8, 2013 | 7/08/2013

సీఎం, మంత్రులు, కాంగ్రెస్ పార్టీని కోరిన జూపూడి
వైఎస్ పథకాలకు సర్కారు తూట్లు పొడుస్తోందని ధ్వజం

సాక్షి, హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై రాష్ర్ట ముఖ్యమంత్రికి, మంత్రులకు, అధికారపార్టీకి ఏ మాత్రం అభిమానమున్నా ఆయన జయంతిని ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు డిమాండ్ చేశారు. ఏదో మొక్కుబడిగా నిర్వహించాలనుకోవడం తగదని సూచించారు. ఆయన ఆదివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ గురించి మాట్లాడితే జగన్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందని ప్రభుత్వంలో ఉన్నవారు భయపడుతున్నారని, అందుకే వైఎస్ జయంతికి అంత ప్రాధాన్యమివ్వట్లేదని అభిప్రాయపడ్డారు. వైఎస్ సీఎంగా పనిచేసిన ఐదేళ్ల మూడు నెలల సమయం స్వర్ణయుగంలా ఉండేదని, 30 ఏళ్లపాటు ప్రజలతో మమేకమై వచ్చిన నాయకుడు కనుక సామాన్య జనాల కష్టాలు తీర్చేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. 2004కు ముందున్న చంద్రబాబు ప్రభుత్వంగానీ, వైఎస్ మరణం తరువాత వచ్చిన పాలకులుగానీ ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు.

ప్రజలపై పన్నులేసి పీడించడమే పనిగా వైఎస్‌కు ముందు, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు పెట్టుకున్నాయన్నారు. వైఎస్ ఏ స్ఫూర్తితో పథకాలు ప్రవేశపెట్టారో వాటికి ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని జూపూడి ధ్వజమెత్తారు. వైఎస్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చినవారు ప్రజల పట్ల ఇలా వ్యవహరించడం తగదని హితవు పలికారు. ప్రజల మనసుల్లోనుంచి వైఎస్‌ను తుడిచివేయాలని కుతంత్రాలు పన్నుతున్నారని, వైఎస్ వల్లనే ఇవాళ పదవుల్లో ఉన్నామనేది పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. ఇపుడు రాష్ట్రంలో చంద్రబాబు విధానాలే కొనసాగుతున్నాయన్నారు. వైఎస్ జీవించి ఉండగా పరిస్థితులెలా ఉన్నాయో... ఆయన మరణించిన గత నాలుగేళ్లలో ఎంతటి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయో ప్రజలకు గుర్తు చేస్తూ వైఎస్సార్‌సీపీ తరఫున ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చామని జూపూడి తెలిపారు. వాడవాడలా వైఎస్ జయంతిని నిర్వహించి ఆయన రాష్ట్ర ప్రజలకు చేసిన సేవల్ని గుర్తుచేసేందుకు పార్టీ కార్యకర్తలు పూనుకోవాలని కోరారు.

నేడు రక్తదాన శిబిరం: వైఎస్ జయంతిని పురస్కరించుకుని సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో పెద్ద ఎత్తున యువత, పార్టీ శ్రేణులు పాల్గొని రక్తదానం చేస్తారని నిర్వాహకులు తెలిపారు.
Share this article :

0 comments: