త్వరలోనే రాజన్న రాజ్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » త్వరలోనే రాజన్న రాజ్యం

త్వరలోనే రాజన్న రాజ్యం

Written By news on Thursday, July 18, 2013 | 7/18/2013

పాదయాత్రలో ప్రజలకు షర్మిల భరోసా
రోజంతా కష్టం చేసినా రూ.వంద రావడం లేదన్న నేత కార్మికులు
నీలం తుఫాను పరిహారం ఇంకా అందలేదంటూ రైతన్నల ఫిర్యాదు
మూగ జీవాలకు రోగం వస్తే వైద్యం దిక్కే లేదంటూ
గొర్రెల పెంపకందారుల ఆవేదన
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ బుధవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 212, కిలోమీటర్లు: 2,835.6

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి:‘‘మరికొన్ని రోజులు ఓపిక పట్టండి.. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది.. ఈ ప్రభుత్వం పోతుంది.. మీ కష్టాలన్నీ తీరిపోతాయి.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలకు జగనన్న మళ్లీ జీవం పోస్తారు. నాటి సువర్ణయుగాన్ని తిరిగితెస్తారు.. అంతవరకు ఓపిక పట్టండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో ప్రజాస్వామ్య విరుద్ధంగా కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆమె చేపట్టిన యాత్ర.. బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. బొబ్బిలి ప్రజలు మహానేత తనయకు బ్రహ్మరథం పట్టారు. రాజన్న బిడ్డతో కలిసి కిలోమీటర్ల కొద్దీ నడిచారు. ఆమెతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. యాత్రలో పలు వర్గాల ప్రజలు ఆమెను కలిసి.. తమ కష్టాలు చెప్పుకొన్నారు. ఈ సమయంలో షర్మిల వారికి ధైర్యం చెబుతూ పై వ్యాఖ్యలు చేశారు.

రోజంతా కష్టం చేసినా వంద రావడం లేదు..

మంగళవారం దత్తిరాజేరు మండలం కోమటిపల్లిలో బస చేసిన షర్మిల బుధవారం ఉదయం వందలాది మంది అభిమానులతో కలసి పాదయాత్ర ప్రారంభించారు. మరడాం చేరుకున్న షర్మిలను చేనేత కార్మికులు కలిసి ‘‘అమ్మా.. మా బతుకు కష్టమైపోయిందమ్మా.. రోజంతా కష్టం చేసినా వంద రూపాయలు రావడం లేదమ్మా. దానికితోడు విద్యుత్ కోతలతో మరింత నష్టం వస్తోందమ్మా.. దీంతో చాలా కుటుంబాలు ఈ వృత్తిని వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్లి కూలిపనులు చేసుకుంటున్నాయి.. మీరే ఆదుకోవాలమ్మా’’ అని మొరపెట్టుకున్నారు. దీనికి ఆమె ‘‘కొన్నాళ్లు ఓపిక పట్టండి, మీరంతా జగనన్నను ఆశీర్వదించండి.. మన ప్రభుత్వం వస్తే మీకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటాం’’ అని ధైర్యం చెప్పారు. పాచికవలస గ్రామస్తులు వచ్చి తమకు మౌలిక సదుపాయాలు లేవని వివరించగా.. ‘‘త్వరలోనే మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి’’ అని హామీ ఇచ్చారు. మరడాంలో తన కోసం ఎదురుచూస్తున్న నర్సమ్మ అనే వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించి మన ప్రభుత్వం వస్తే పెన్షన్ పెంచుతామని భరోసా ఇచ్చారు.

గిట్టుబాటు ధర రావడం లేదు..

ఆరికతోట వద్ద ఆదినారాయణ అనే కూరగాయల రైతు షర్మిలను కలిసి ‘‘అమ్మా మాకు గిట్టుబాటు ధర రావడం లేదమ్మా! మా దగ్గర దళారులు అతి తక్కువ ధరకు కొనేసి బయట అధిక ధరలకు అమ్ముకుని లాభాలు తీసుకుంటున్నారు. మాకు మాత్రం ఏమీ మిగలడం లేదు. కరెంటు కూడా మూడు గంటలు మాత్రమే ఇస్తున్నారు. నీలం తుపాను కారణంగా పంటలన్నీ కొట్టుకుపోయాయి. అయినా పరిహారం అందలేదమ్మా’’ అంటూ విన్నవించుకోగా ‘‘మీరేం కంగారు పడకండి.. మన రాజన్న రాజ్యం వచ్చాక గిట్టుబాటు ధర కల్పిస్తాం. సబ్సిడీలు అందిస్తాం.. ఉచిత విద్యుత్ సైతం పక్కాగా అమలు చేస్తాం.. మీరేం భయపడకండి’’ అని వారికి భవిష్యత్‌పై విశ్వాసం కలిగించారు.

పశువులకు సంచార వైద్యశాల..

బూశాయివలస జంక్షన్ వద్ద పలువురు గొర్రెల కాపరులు షర్మిలను కలిసి ‘‘రోగాలతో మూగజీవాలు కన్నుమూస్తున్నాయి. దీంతో ఎండనక వాననకా కష్టిస్తున్నా నష్టాలే మిగులుతున్నాయి. వైద్యం కూడా అందడం లేదు. మీరే ఏదో చేయాలమ్మా’’ అంటూ ఆవేదన చెందారు. దీనికి ‘‘మీ కష్టాలు త్వరలోనే సమసిపోతాయి. మన ప్రభుత్వం వచ్చాక 108 మాదిరిగా సంచార ఆస్పత్రులు ఏర్పాటు చేస్తాం.. మీకు అండగా నిలుస్తాం..’’ అని ఆమె ధైర్యం చెప్పారు. రామభద్రపురం వద్ద ఆరోగ్యమిత్రలు షర్మిలను కలిసి ఆరేళ్లుగా సేవలందిస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేకుండాపోయిందని పేర్కొంటూ వినతిపత్రం అందించారు. దీనికి ఆమె మన ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపుతామని చెప్పారు. 

16.2 కిలోమీటర్ల యాత్ర

షర్మిల 212వ రోజు పాదయాత్ర బుధవారం ఉదయం కోమటిపల్లి నుంచి ప్రారంభమైంది. మరడాం, బూర్జవలస, ఆరికపేట, బూశాయవలస, రామభద్రపురం మీదుగా సాగింది. పారాది వంతెన సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి ఆమె రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. బుధవారం ఆమె మొత్తం 16.2 కిలోమీటర్ల దూరం నడిచారు. షర్మిల వెంట నడిచిన వారిలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు, పార్టీ జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, సమన్వయకర్తలు కడుబండి శ్రీనివాసరావు, గద్దె బాబూరావు, పార్టీ నేతలు బేబీ నాయన, రమాదేవి, ముగడ గంగమ్మ, కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: