వైఎస్ బతికున్నంత కాలం మా అన్నకు జగన్‌తో పరిచయమే లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ బతికున్నంత కాలం మా అన్నకు జగన్‌తో పరిచయమే లేదు

వైఎస్ బతికున్నంత కాలం మా అన్నకు జగన్‌తో పరిచయమే లేదు

Written By news on Saturday, July 6, 2013 | 7/06/2013

జగన్ చెబితేనే జీవోలిచ్చామని చెబితే బెయిలిప్పిస్తామని పనబాక లక్ష్మి చెప్పారు
- అసలు వైఎస్ బతికున్నంత కాలం మా అన్నకు జగన్‌తో పరిచయమే లేదు
- జగన్‌ను రాజకీయంగా అణగదొక్కడంలో భాగంగా మా అన్నను పావుగా వాడుకున్నారు.. 
- బడుగు వర్గాలకు చెందినవాడు, రాజకీయంగా అండలేనందునే బలి చేశారు
- మా అన్నకు న్యాయ సహాయం చేయకపోగా, ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా పట్టించుకోవడంలేదు 

సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అప్రూవర్‌గా మారి జగన్‌కు వ్యతిరేకంగా చెబితే బెయిలిప్పిస్తామన్నారని ఆయన సోదరుడు మోపిదేవి హరినాథ్‌బాబు చెప్పారు. జగన్ చెబితేనే జీవోలు విడుదల చేశామని మోపిదేవి చెప్పాలని, అప్పుడే బెయిల్‌పై బయటకు తీసుకొస్తామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తమతో చెప్పారన్నారు. అసలు వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం తమ అన్నతో జగన్‌కు పరిచయమే లేదని, వారిద్దరూ మాట్లాడుకున్న సందర్భమే లేదని తెలిపారు. ఏ తప్పూ చేయని జగన్, మోపిదేవిలపై కేంద్ర మంత్రి లక్ష్మి ఆ విధంగా మాట్లాడేసరికి జీర్ణించుకోలేకపోయామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాల కారణంగానే ఆ పార్టీని వదిలేశామన్నారు. మాటకు కట్టుబడి ఉండే వైఎస్ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవడానికి, రాజశేఖరరెడ్డి ఆశయసాధనకు తమ వంతు ప్రయత్నం చేసేందుకు వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు చెప్పారు. 

తమ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎన్ని వేధింపులకు గురిచేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మోపిదేవి కుటుంబం శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం హరినాథ్‌బాబు విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత తాము కాంగ్రెస్‌ను వీడటానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణాలను వివరిస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు. 26 జీవోలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా అణగదొక్కడంలో భాగంగానే మోపిదేవి వెంకటరమణను బలిపశువును చేశారని దుయ్యబట్టారు.

తన అన్న ఎంతో వెనుకబడిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఏకైక మంత్రి అని చెప్పారు. బడుగువర్గాలకు చెందిన వాడు, బలమైన రాజకీయ నేపథ్యం, వెనుక నుంచి మద్దతు లేనందునే తన అన్నను కాంగ్రెస్ చెప్పుచేతల్లో పనిచేసే సీబీఐకి బలిచేశారని చెప్పారు. కేబినెట్ నియమ నిబంధనలకు అనుగుణంగానే వాన్‌పిక్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటే సీబీఐ తప్పుపట్టడమేమిటని ప్రశ్నించారు. తన సోదరుడికి ఇప్పటివరకు ఎలాంటి న్యాయ సహాయం చేయకపోగా, ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా పట్టించుకోవడంలేదన్నారు. ఇటీవల ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులలో సరైన వైద్యం అందించకుండానే జైలుకు తరలించారని చెప్పారు. సరైన వైద్యం అందించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాళ్లు మెక్కినా కనికరించలేదని, వైద్య శాఖ మంత్రి కొండ్రు మురళీమోహన్‌కు ఫోన్ చేసినా కూడా మాట్లాడలేదంటూ క న్నీళ్ల పర్యంతమయ్యారు. సీఎం కిరణ్‌కు మానవత్వంలేదని మండిపడ్డారు.

హరినాథ్‌బాబు లేఖ సారాంశమిదీ.. 
25 ఏళ్ల రాజకీయ జీవితం, అయిదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం మా అన్నకు ఉంది. ఆయనతోపాటు మా కుటుంబ మంతా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎంతో కష్టపడింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదరాభిమానాలతో మా అన్న మంత్రిగా ఎదిగారు. ఎంతో వెనుకబడిన మత్స్యకారుల సామాజిక వర్గం నుంచి రాజకీయంగా ఎదుగుతున్న వ్యక్తిపై కాంగ్రెస్ సారథ్యంలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ద్వారా తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేసింది. 

మా అన్న పట్ల సీబీఐ వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. వాన్‌పిక్ ప్రాజెక్టుకంటే ముందే కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, కాకినాడ పోర్టులతో సహా అనేక ప్రాజెక్టులపై చంద్రబాబు ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నారు. వాన్‌పిక్‌పై కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ఏ తప్పూ జరగలేదు. అయినప్పటికీ, జగన్‌ను రాజకీయం గా అణగదొక్కాలనే ఏకైక లక్ష్యంతో మా అన్నను పావుగా వాడుకోవడం ఈ రోజుకీ జీర్ణించుకోలేని బాధాకరమైన విషయం. వాన్‌పిక్‌పై మా అన్న స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం ఏ ఒక్కటీ లేదు. సీబీఐ తప్పుపట్టిన ప్రతి జీవో రాష్ట్ర కేబినెట్‌లో చర్చించిన తర్వాతే వెలువడ్డాయి. అలాంటప్పుడు ఒక్కరినే దోషిగా ఎలా చిత్రీకరిస్తారు? ఇప్పటివరకు జరిగిన పరిణామాలలో మా అన్న ఒక్కరినే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా బలిచేశాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 

ఎమ్మార్, ఐఎంజీ భారత కేసులలో విచారణ ఎదుర్కొనకుండా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వస్తున్న చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి జగన్‌ను అణగదొక్కడానికి, రాజకీయంగా మూడో వ్యక్తి, మూడో పార్టీ లేకుండా చేయడం కోసం మా అన్నను బలిచేయడం ఎంతవరకు సమంజసం? ఈ కేసులో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తున్నారు. మా అన్న విషయంలో ఒకలా, మిగిలిన మంత్రుల విషయంలో మరోలా, జగన్ విషయంలో వేరే విధంగా వ్యవహరిస్తూ వ్యవస్థలను దిగజారుస్తూ రాజకీయాలు చేయడం చాలా బాధగా ఉంది. మా అన్నను అరెస్టు చేసి 14 నెలలు గడుస్తున్నాయి. ఏ సందర్భంలోనైనా న్యాయం జరుగుతుందని, పార్టీ, ప్రభుత్వం ఆదుకుంటాయని ఇప్పటి దాకా మా కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజలు ఎదురు చూశారు. కానీ ప్రభుత్వ చర్యలు చూస్తే చంద్రబాబును రక్షించడానికి చూపే శ్రద్ధ సంవత్సర కాలంగా జైలులో ఉన్న మా అన్న విషయంలో చూపకపోవడం చాలా బాధగా ఉంది. మాకు దేవునిపైన, న్యాయస్థానాలపైన బలమైన నమ్మకముంది. 

ఏరోజైనా న్యాయం జరుగుతుందని బలమైన నమ్మకంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాము. విశ్వసనీయత లేని, మనుషులను వాడుకొని వదిలేసే మనస్తత్వం, గిట్టని వారిని దెబ్బకొట్టడం కోసం దగ్గరి వారిని సైతం బలిపెట్టడానికి సిద్ధపడే ఇలాంటి నేతలు, పార్టీ పట్ల నమ్మకం కోల్పోయాం. ప్రజలకు ఇచ్చిన మాట కోసం, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడిన జగన్‌ను, ఆయన నాయకత్వాన్ని చూసి, కష్టాలలో ఉన్న ఆయనకు తోడుగా నిలబడితే దేవుడు, నియోజకవర్గ ప్రజలు హర్షిస్తారని ఈ నిర్ణయం తీసుకున్నాం.
Share this article :

0 comments: