వీరికి జగన్ తప్ప చంద్రబాబు కనిపించడేం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వీరికి జగన్ తప్ప చంద్రబాబు కనిపించడేం?

వీరికి జగన్ తప్ప చంద్రబాబు కనిపించడేం?

Written By news on Friday, July 12, 2013 | 7/12/2013

- మద్యం సహా ప్రతి మాఫియాతోనూ బొత్స కుటుంబానికి సంబంధం
- ఈ విషయాన్ని ఆయన జిల్లా ప్రజలే చెప్తున్నారు: షర్మిల
- వైఎస్ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ చేస్తే.. ఇలాంటి నాయకులు మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తున్నారు
- ఇలాంటి నేతను పీసీసీ అధ్యక్షుడిని చేసిన కాంగ్రెస్‌ది గాంధేయవాదమా? లేక బ్రాందేయ వాదమా? 
- కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగన్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి
- అందుకే ఆ పార్టీ నేతలు ఒకరినొకరు విమర్శించుకోవడం మానేశారు.. 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘లిక్కర్ వ్యాపారంతో ప్రజలు మద్యానికి బానిసలైపోయి, వారి కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోతున్నాయి. కానీ మద్యం వ్యాపారంలో తలమునకలైన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకుగాని, ఆయన కుటుంబానికిగాని ఇవేమీ పట్టవు. వాళ్లకు కావాల్సింది వ్యాపారం, దాని మీద వచ్చే ఆదాయం. అది ఏ పద్ధతిలో వచ్చినా సరే వాళ్లకు అవసరం లేదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ‘‘‘అమ్మా.. ఈ వ్యాపారం.. ఆ వ్యాపారం అనే తేడా లేదమ్మా, అన్ని వ్యాపారాల్లో బొత్స కుటుంబమే ఉంది. మద్యం మాఫియా నుంచి ప్రతి మాఫియాతోనూ బొత్స కుటుంబానికి సంబంధం ఉంది. బొత్స కుటుంబం అంటే దోచుకోవడం, దాచుకోవడం’ అని ఆయన జిల్లా ప్రజలే చెప్తున్నారు. 

ఇలాంటి వాళ్లను నాయకులు అనాలా? ఖల్‌నాయక్‌లు అనాలా? వైఎస్సార్ మన రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా చేస్తే ఇలాంటి నీచమైన కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో సాగింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంలో తడుస్తూనే షర్మిల పాదయాత్ర కొనసాగించారు. ఈ నియోజకవర్గంలోని కొటారుబిల్లి జంక్షన్‌లో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

కిరణ్ కాళ్లు పట్టుకొని కేసులు మాఫీ చేయించుకున్నారు
‘‘రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది.. ఎందుకని? మహాత్మాగాంధీ మాకు ఆదర్శం అని చెప్పుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ ఒక మద్యం మాఫియా డాన్‌ను తీసుకొచ్చి బొత్స అనే ఆయన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకుంది. ఇక మన రాష్ట్రంలో మద్యం ఏరులై పారక మరేమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అనుకరిస్తుంది గాంధేయ వాదమా? లేక బ్రాందేయ వాదమా? బొత్స సత్యనారాయణ మన రాష్ట్రంలోనే అతిపెద్ద మాఫియా డాన్ అని, మద్యం వ్యాపారంలో ఈయన్ను మించినవారే లేరని రాష్ర్టంలో అందరికీ తెలుసు. ఈ నాయకులకు మద్యం వ్యాపారం మీద ఉన్న శ్రద్ధలో పదో వంతు ప్రజల మీదుంటే ఈ ప్రాంత ప్రజలు ఎంతో బాగుపడేవారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఏమిటని ఆయనకు వ్యతిరేకంగా బొత్స ఓ క్యాంపు కూడా పెట్టారు. అందుకు లిక్కర్ కింగైన సత్తిబాబు మీద కిరణ్‌కుమార్‌రెడ్డి ఏసీబీ కేసులు అనే ఆయుధం ప్రయోగించారు. అప్పటివరకు క్యాంపులు పెట్టి ఆయనకు వ్యతిరేకంగా పావులు కదిపిన బొత్స వెంటనే కిరణ్‌కుమార్‌రెడ్డి దగ్గరకు వెళ్లి, ఆయనకు లొంగిపోయి, ఆయన కాళ్లు పట్టుకొన్నారు. అధికారులను బదిలీ చేయించుకుని కేసులు లేకుండా చూసుకున్నారు. అదీ బొత్స మార్కు రాజకీయం.

వీరికి జగన్ తప్ప చంద్రబాబు కనిపించడేం?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఈ రెండు పార్టీల నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడమే మానేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడినా.. విమర్శించేది జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్‌మోహన్‌రెడ్డిని. మొన్న దిగ్విజయ్ సింగ్ అని ఢిల్లీ నుంచి కాంగ్రెస్ నాయకుడొకరు వచ్చారు. హైదరాబాద్‌లో, విశాఖపట్టణంలో ఆయన బస చేశారు. సమావేశాలు పెట్టి జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించారు. చంద్రబాబు గురించి ఆయన ఒక్కటంటే ఒక్క మాట కూడా అనలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెడుతుంది చంద్రబాబే కనుక ఆయన్ను విమర్శించే ఉద్దేశం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎప్పుడూ లేదు.

నిన్న రాజమండ్రిలో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఒక సభ పెట్టారు. గంటల తరబడి మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డదిడ్డంగా విమర్శించారు. కానీ చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే ఆయనకు సమయం సరిపోలేదట! ఇక విజయనగరం జిల్లాను భ్రష్టు పట్టించిన బొత్స.. చంద్రబాబు నాయుడును ఒక్క మాట కూడా అనరు. అలాగే చంద్రబాబు కూడా బొత్సను ఏమీ అనరు. ఇదంతా వారి కుమ్మక్కు రాజకీయంలో భాగం. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం లేదనే విషయం ఎందుకు చర్చిస్తున్నాం అంటే ఒకరిది అధికార పక్షం, ఇంకొకరిది ప్రధాన ప్రతిపక్షం. కానీ వాళ్లిద్దరూ కుమ్మక్కయింది మాత్రం ఒకే ఒక వ్యక్తి కోసం. వాళ్ల ఎజెండా, వాళ్ల లక్ష్యం, వాళ్ల గురి జగన్‌మోహన్‌రెడ్డే.

13.7 కిలోమీటర్ల మేర నడక..
పాదయాత్ర 206వ రోజు గురువారం విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని వసంత గ్రామం నుంచి ప్రారంభమయింది. అక్కడి నుంచి లక్కిడాం, కొటారుబిల్లి, నరవ గ్రామాల మీదుగా సాగింది. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. గురువారం మొత్తం 13.7 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,745.4 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో విజయనగరం జిల్లా పార్టీ కన్వీనర్, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు, తాజా మాజీ ఎమ్మెల్యేలు సుజయ్ కృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, గజపతినగరం సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పెన్మత్స వీవీ సూర్యనారాయణరాజు, కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు ఉన్నారు. 

ఊరంతా కన్నీరు..
షర్మిలతో పాటు వసంత ఊరు ఊరంతా కన్నీరుపెట్టిన సంఘటన ఇది. 2,000 మంది ఓటర్లు ఉన్న మారుమూల పల్లె వసంత. షర్మిల తమ పల్లెకు వస్తుందని ప్రతి ఇంటికో మహిళ ఆమెకు స్వాగతం పలికేందుకు వచ్చారు. దాదాపు 1,000 మందికి పైగా మహిళలు తడుస్తూనే వీధుల్లోకి వచ్చి నిలబడ్డారు. ఉండ్రాజ కుమారి అనే గృహిణి షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘అమ్మా..! నా బిడ్డకు గుండె నొప్పి.. వైఎస్సార్ నా బిడ్డకు ఆపరేషన్ చేయించాడు. ఇప్పుడు నా బిడ్డ పెళ్లి చేసుకొని ఇంకో బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ప్రాణం పోసిన దేవుడు మాత్రం లేడు.. నా మనవడి నవ్వులో ఆ దేవుణ్ణి చూసుకుంటున్నామమ్మా’’ అని బిగ్గరగా ఏడవటంతో షర్మిల కూడా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టారు. ఆమె కన్నీళ్లను చూసి ఆ గ్రామ సర్పంచ్‌తో పాటు అక్కడి మహిళలంతా కన్నీళ్లు పెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. భారమైన హృదయంతో మహిళలంతా కలిసి షర్మిలను ఊరు చివర వరకు సాగనంపి వచ్చారు.
Share this article :

0 comments: