సాగుపై సర్కారు చిన్నచూపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాగుపై సర్కారు చిన్నచూపు

సాగుపై సర్కారు చిన్నచూపు

Written By news on Wednesday, July 24, 2013 | 7/24/2013

ఐదేళ్లలో వైఎస్సార్ 12 ప్రాజెక్టులు పూర్తి చేసి
21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు
మరో 21 ప్రాజెక్టుల నిర్మాణ పనులు చివరి దశలో నిలిచిపోయాయి
రూ.850 కోట్లు ఖర్చుచేస్తే వీటిలో 16 ప్రాజెక్టులు పూర్తయిపోతాయి
వాటిని పూర్తి చేయడానికి ఈ కాంగ్రెస్ సర్కారు కదలదు, మెదలదు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 218, కిలోమీటర్లు: 2925.2

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి
‘‘వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో 12 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి 21 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారు. మరో 21 ప్రాజెక్టుల నిర్మాణ పనులు చివరి దశలో నిలిచిపోయాయి. వైఎస్సార్ బతికే ఉంటే ఈ ప్రాజెక్టులు కూడా ఎప్పుడో పూర్తైఈపాటికి రైతన్న పంట పొలాల్లో నీళ్లు పారేవి. కేవలం రూ.850 కోట్లు ఖర్చు చేస్తే ఇందులో దాదాపు 16 ప్రాజెక్టులు పూర్తైయి 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. కానీ ఈ కాంగ్రెస్ సర్కారు కదలదు, మెదలదు. ఎందుకంటే వీళ్లకు వ్యవసాయం అంటేనే చిన్నచూపు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో సాగింది. నియోజకవర్గ కేంద్రంలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

‘‘ఇక్కడ నాగావళి నదిపై తోటపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి వదిలేశారు. వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తి చేయడానికి రూ.450 కోట్లు కేటాయించారు. 80 శాతం నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. కాల్వల తవ్వకాలు కూడా అయిపోయాయి. ఇక మిగిలింది 20 శాతం పనులు మాత్రమే. ఈ ప్రాజెక్టు పూర్తై విజయనగరం జిల్లాలో 1.21 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వడంతో పాటు, 13 మండలాలకు, శ్రీకాకుళం జిల్లాలో ఏడు మండలాలలో 65 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అయితే వైఎస్సార్ మరణం తరువాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ ఒక్క ప్రాజెక్టు కాదు, ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఇదే పరిస్థితి. రాష్ట్రంలో ఏ రైతును పలకరించినా..‘అమ్మా మద్దతు ధర లేదు, తాగు నీరు లేదు, ఏడు గంటల ఉచిత విద్యుత్తూ లేదు, వేసిన ప్రతి పంటలోనూ నష్టమొచ్చి అప్పుల పాలైపోయాం తల్లీ’ అని చెప్తున్నాడు. ‘ఉప్పు, పప్పు ఏదీ కొనేటట్టు లేదు తల్లీ, రెండు పూటలా కూడా గడవటం లేదు తల్లీ’ అని రాష్ట్రంలో ప్రతి మహిళా బాధపడుతోంది.

మూడు గంటల కరెంటైనా ఇవ్వడం లేదు..

ఈ కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి లాభంలేదు, మహిళలకు ఆసరా లేదు, విద్యార్థులకు చదువు లేదు, పరిశ్రమలకు కరెంటు లేదు, కార్మికులకు పని లేదు, రాష్ట్రానికి అభివృద్ధి లేదు, రాష్ట్ర ప్రజలకు మనశ్శాంతి లేదు. ఇదీ మన పరిస్థితి. వైఎస్సార్ బతికే ఉంటే ఈ రోజు వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు అందించేవారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 9 గంటల ఉచిత విద్యుత్తు కాదు కదా...! వైఎస్సార్ ఇచ్చి చూపించిన 7 గంటల ఉచిత కరెంటు కాదు కదా..! కనీసం మూడు గంటలు కూడా ఇవ్వలేకపోతోంది. గ్రామల్లోనైతే కరెంటు లేకుండానే వండుకోవాలి, కరెంటు లేకుండానే పండుకోవాలి. సమాధానం చెప్పండి ముఖ్యమంత్రీ అంటే..! ‘కిటికీలు , తలుపులు తెరుచుకొని పడుకోండి, కరెంటు ఎందుకూ’ అంటారాయన. మన ఖర్మకొద్దీ ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రై కూర్చున్నాడు. లేని కరెంటుకు మూడింతల బిల్లులు మాత్రం ఇస్తున్నారు.

ప్రజల రక్తం పిండుతున్నారు..

ఒక్క కరెంటే కాదు, వైఎస్ హయాంలో రూ.305 ఉన్న గ్యాస్ ధర ఈరోజు రూ.440 అయి కూర్చుంది. అది కూడా సబ్సిడీ ఉంటేనే, సబ్సిడీ లేకుంటే ఒక్క గ్యాస్ సిలిండర్‌కు రూ.1,000 చెల్లించి కొనుక్కోవాలి. ఆర్టీసీ ధరలు ఇప్పటికే మూడు సార్లు పెరిగాయి, ఎరువుల ధరలు 300 శాతం నుంచి 800 శాతం వరకు పెరిగాయి. రిజిస్ట్రేషన్, వ్యాట్ ట్యాక్సులు పెరిగాయి. కరెంటు చార్జీలైతే ఏకంగా 30 వేల కోట్ల భారాన్ని మోపి, ప్రజల రక్తం పిండి వసూలు చేస్తున్నారు. ఈ దుర్మార్గపు పాలనకు నిరసనగా, ఈ చార్జీల మోతను వ్యతిరేకిస్తూ అన్ని ప్రతిపక్ష పార్టీలూ కలిసి అవిశ్వాసం పెడితే మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబేమో.. ప్రజల పక్షాన నిలబడకుండా, విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు. ఈయనే అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో ఇంటికిపోయి ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఈ చార్జీల మోత, కరెంటు బాదుడు ప్రజల నెత్తిన పడకుండా తప్పిపోయేది.’’

12.2 కిలోమీటర్ల యాత్ర..

మంగళవారం 218వ రోజు ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని తలవరం గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి అట్టలి, తుమరాడ, తంపటాపల్లి మీదుగా పాలకొండ నియోజకవర్గ కేంద్రం చేరారు. ఇక్కడ భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఆమదాలవలస నియోజకవర్గం డొంకలపర్త గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.00 గంటలకు చేరుకున్నారు. మొత్తం 12.2 కిలోమీటర్లు నడిచారు. షర్మిల వెంట నడిచిన వారిలో జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, కేంద్ర పాలక మండలి సభ్యులు పాలవలస రాజశేఖరం, మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, పాలకొండ సమన్వయకర్తలు విశ్వాస రాయి కళావతి, పాలవలస విక్రాంత్ తదితరులు ఉన్నారు.

గిరిజనులకు 20.60 లక్షల ఎకరాలు పంచిన గొప్ప సీఎం వైఎస్సార్

‘‘గిరిజనులు అంటే వైఎస్సార్‌కు చాలా ప్రేమ. అందుకే 20.60 లక్షల ఎకరాలను రాజశేఖరరెడ్డి.. గిరిజనులకు పంపిణీ చేశారు. ఇందులో 3.30 లక్షల ఎకరాలను ఒకే రోజు పంపిణీ చేసిన గొప్ప ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోయారు. దీనితో పాటు మరో 9 లక్షల ఎకరాల అటవీ భూమి మీద గిరిజనులకు హక్కు కల్పించిన ఘనత కూడా వైఎస్సార్‌దే. కేవలం భూములు ఇచ్చి వైఎస్సార్ చేతులు దులుపుకోలేదు. పంపిణీ చేసి పట్టాలిచ్చిన భూములను సాగులోకి తీసుకొని వచ్చి, పంటలకుయోగ్యంగా మలచటం కోసం చేసే పనులను ఉపాధి హామీ పథకం పరిధిలోకి తీసుకొని వచ్చారు. అంటే ఆ భూముల్లో పని చేసిన వారికి ఉపాధి హామీ కింద మళ్లీ రూ.100 వరకు చెల్లించే వారు. ఈ భూముల్లో పని దినాలను 100 రోజుల నుంచి రూ.150 రోజులకు పెంచిన ముఖ్యమంత్రి వైఎస్సార్.’’
- షర్మిల

మంగళవారం శ్రీకాకుళం జిల్లా అట్టలి జంక్షన్ సమీపంలో ఓ రైతు యథావిధిగా పొలం పనులు చేసుకుంటున్నాడు. ఇంతలో అశేష జనవాహిని మధ్య షర్మిల పాదయాత్రగా అటు రావడం చూశాడు. అంతే.. చేస్తున్న పని ఎక్కడిదక్కడ వదిలేసి, బురదలోనే పరుగులాంటి నడకతో షర్మిల వద్దకు చేరుకున్నాడు. తమ రాజన్న తనయను చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. షర్మిల కూడా ఆ అన్నదాతను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. యోగక్షేమాలు విచారించడంతోపాటు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న సీఎం కాగానే అందరి సమస్యలూ తీరుస్తారని భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: