‘మేజర్’ల మెజార్టీ వైఎస్సార్సీపీదే... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘మేజర్’ల మెజార్టీ వైఎస్సార్సీపీదే...

‘మేజర్’ల మెజార్టీ వైఎస్సార్సీపీదే...

Written By news on Thursday, July 25, 2013 | 7/25/2013

పెద్ద పంచాయతీల్లో మహానేత అభిమానుల పాగా 
నల్లగొండ జిల్లా మోత్కూరులో ‘ఆల్‌పార్టీస్’ అభ్యర్థిపై విజయకేతనం
కృష్ణాలో మూడొంతుల పంచాయతీలు కైవసం 
అనంతపురంలో ‘సైకిల్-కాంగ్రెస్’ అభ్యర్థులపై భారీ విజయం

రాష్ట్రంలో తొలివిడత జరిగిన స్థానికసమరంలో మేజర్ పంచాయతీ సర్పంచ్‌లను అత్యధికశాతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది. అసెంబ్లీ నియోజకవర్గకేంద్రాల్లోనూ, పదివేల ఓటర్లకుపైగా ఉన్న మేజర్ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ బలపరచిన అభ్యర్ధులే విజయబావుటా ఎగురవేశారు.
- సాక్షి నెట్‌వర్క్

కర్నూలు జిల్లాలో బేతంచెర్ల మేజర్ పంచాయతీని వైఎస్సార్సీపీ అభ్యర్ధి బొద్దుల రోజెమ్మ సమీప టీడీపీ అభ్యర్ధి జల్లు మద్దిలేటిపై 2433 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గపరిధిలోని ఈ పంచాయతీపై టీడీపీశ్రేణులు ప్రత్యేకదృష్టిసారించినా వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. 

వెలుగోడు పంచాయతీని వైఎస్సార్సీపీ అభ్యర్ధి ఎం.ఏ. కలాం టీడీపీ అభ్యర్ధి సూర్యనారాయణపై 3000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా వింజమూరు పంచాయతీ సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ మద్ధతుదారుడైన గణపం బాలకృష్ణారెడ్డి 514ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి వెలుగోటి వీరరాఘవులునాయుడుపై విజయం సాధించారు. ఇదే జిల్లాలోని అల్లూరు పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారురాలు కరేటి చంద్రలీలమ్మ తన సమీప ప్రత్యర్థి టీడీపీ బలపర్చిన రమాదేవిపై 1100 ఓట్ల మెజారీటీతో విజయం సాధించారు.

గుంటూరు జిల్లా నిజాంపట్నం మేజరు పంచాయతీ నుంచి మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ సోదరుడు హరనాధ్ బాబు సతీమణి మోపిదేవి విజయనిర్మల, టీడీపీ అభ్యర్ధి మోపిదేవి వెంకట శివమణిలు పోటీ చేయగా, వైఎస్సార్ సీపీ అభ్యర్ధికి 3,860 ఓట్ల ఆధిక్యత లభించింది. కాంగ్రెస్ పార్టీ టీడీపీని బలపరిచినప్పటికీ విజయనిర్మల ఘన విజయం సాధించారు.

విశాఖ జిల్లా అరకు నియోజక వర్గంలోని పెదలబుడు మేజర్ పంచాయతీ ఎన్నికలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు ఎస్.గులాబికి సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి డి.భవానిపై 55 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పంచాయతీలో వైఎస్సార్సీపీ బలపరచిన అభ్యర్ధి మారిశెట్టి జగదీశ్వరరావు టీడీపీ తరఫు అభ్యర్ధి తిరుమాల రామారావుపై ని 1525ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శనివారపుపేట పంచాయతీని వైఎస్సార్ సీపీ 1816 మెజార్టీతో గెలుపొందింది. వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్ధి కూరపాటి లూర్దమ్మకు 3,254 ఓట్లు రాగా, సమీప స్వతంత్ర అభ్యర్ధి మట్టా సుబ్బారావుకు 1474 ఓట్లు వచ్చాయి. గణపవరం పంచాయతీని వైఎస్సార్ సీపీ మెజార్టీ 1004 మెజార్టీతో గెలుపొందింది. అభ్యర్ధి కూనిరెడ్డి సోమేశ్వరరావుకు 4,354 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనుకు 3, 350ఓట్లు వచ్చాయి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి లక్కారం విజయలక్ష్మి కాంగ్రెస్ అభ్యర్ధి జులేకాబేగంపై 598ఓట్ల మెజార్టీతో విజయఢంకా మోగించారు.
వైఎస్సార్ జిల్లా చెన్నూరు మేజర్ పంచాయతీ ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి పి.రాజేశ్వరి 1682 ఓట్ల ఆధిక్యతతో టీడీపీ అభ్యర్ధి సుబ్బారెడ్డిపై విజయం సాధించారు.

టీడీపీ కోటకు బీటలు
‘గన్నవరం’ వైఎస్సార్‌సీపీ పరం

కృష్ణాజిల్లాలోని మేజర్ పంచాయతీల్లో మూడొంతుల చోట్ల వైఎస్సార్‌సీపీనే పాగా వేసింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటి గన్నవరం పంచాయతీలో వైఎస్సార్‌సీపీ బలపర్చిన సర్పంచి అభ్యర్ధి నీలం ప్రవీణ్‌కుమార్ 435 ఓట్ల అధిక్యంతో టీడీపీ తరఫు అభ్యర్ధి తిరివీధి రంగారావుపై విజయం సాధించారు. నియోజకవర్గ రాజకీయాలను శాసించే టీడీపీ ప్రముఖుడు దాసరి జైరమేష్, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, ఈ ప్రాంతంపై ఎంతోపట్టుందని చెప్పుకునే టీడీపీ యువనేత వల్లభనేని వంశీ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లకు షాక్‌నిస్తూ ఇక్కడి ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. ఇక కేసరపల్లిలో వైఎస్సార్‌సీపీ బలపర్చిన కాలగడ్డ శివనాగరాజకుమారి 1,218 ఓట్ల అధిక్యంతో టీడీపీ అభ్యర్ధి ఎన్.ఆనందకుమారిపై గెలుపొందారు. బాపులపాడు పంచాయతీలో వైఎస్సార్‌సీపీ బలపర్చిన కాకని అరుణ తన సమీప ప్రత్యర్థి వేగుండ ఉషామణి(టీడీపీ)పై 577 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

టీడీపీ ఎమ్మెల్యేలకు భంగపాటు 
పరిటాల ఇలాకాలో 
రెపరెలాడిన వైఎస్సార్సీపీ జెండా


అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంటలో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారుడు రవీంద్రారెడ్డి 194 ఓట్ల మెజార్టీతో టీడీపీ మద్దతుదారుడు మహమ్మద్ యూసుఫ్‌పై విజయం సాధించారు. కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికొంట వెంకటప్రసాద్ ఇక్కడి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా వైఎస్సార్సీపీ ఘన విజయంతో భంగపడ్డారు. తలుపులలో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారుడు ఫయాజ్ అహ్మద్ 644 ఓట్ల మెజార్టీతో టీడీపీ మద్దతుదారుడు అజంతుల్లాపై గెలుపొందారు. నల్లచెరువులో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారుడు రవికుమార్ రెడ్డి 462 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి మౌలాలిపై విజయం సాధించారు. 

తనకల్లులో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు లక్ష్మమ్మ 915 ఓట్ల మెజార్టీతో టీడీపీ మద్దతుదారురాలు లక్ష్మీదేవిపై విజయం సాధించారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మేజర్ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసిన మాణిక్యంబాబా 1711 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ మద్దతుదారుడు జయప్రకాష్‌పై విజయం సాధించారు. ఇక దివంగత పరిటాల రవి ఒకప్పటి ఇలాకా, ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పార్ధసారధి ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మేజర్ పంచాయతీని వైఎస్సార్‌సీపీ మద్దతుదారురాలు వీఎస్ మంజుల 379 ఓట్ల మెజార్టీతో టీడీపీ మద్దతుదారురాలు నిర్మలమ్మపై గెలుపొందారు. ఇది టీడీపీకి చెందిన హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప నివాసం ఉంటోన్న పంచాయతీ కావడం గమనార్హం. ఈ పంచాయతీ నుంచి టీడీపీ మద్దతుతో ఎంపీ తన సోదరుడి భార్య అయిన నిమ్మల నిర్మలమ్మను బరిలోకి దించి.. డబ్బు, మద్యాన్ని ఏరులై పారించినా విజయం సాధించలేకపోయారు. హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారురాలు శ్రీకళ 111 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ మద్దతుదారురాలు వెంకటలక్ష్మమ్మపై విజయం సాధించారు. కాగా, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు పోటీ ఫలితంతో అతిస్వల్ప ఓట్ల తేడాతో వైఎస్సార్సీపీకి చేజారిన పంచాయతీలూ ఎక్కువే ఉన్నాయి.

శ్రీధర్‌బాబుకు మంథనిలో షాక్

మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగురవేసింది. మంగళవారం జరిగిన మేజర్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి చంద్రుపట్ల శ్రీనివాసరెడ్డిపై వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసిన పుట్ట శైలజ భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటై వైఎస్సార్సీపీ అభ్యర్థే లక్ష్యంగా పంచాయతీ ఎన్నికల్లో కుట్ర రాజకీయాలకు పాల్పడ్డా వారి పాచిక పారలేదు. మంత్రి శ్రీధర్‌బాబు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందివచ్చిన అన్ని అస్త్రాలను ఉపయోగించినా పరాభవమే చవిచూశారు. 11,530 ఓట్లకు 8,278ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థికి 4,863 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతుదారుకు 2,503మాత్రమే ఓట్లు వచ్చాయి. 2,360 మెజార్టీతో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన పుట్ట శైలజ గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

మహాకూటమిని ఢీ కొట్టి..

నల్లగొండ జిల్లా మోత్కూరులో టీడీపీ, సీపీఐ, సీపీఎం మద్దతుతో టీఆర్‌ఎస్ బలపరిచిన బొల్లెపల్లి వెంకటయ్యపై వైఎస్సార్ సీపీ మద్దతుదారు బయ్యని పిచ్చయ్య భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశాడు. పిచ్చయ్య 3,960 ఓట్లు రాగా, అన్ని పార్టీల మద్దతున్న ఉమ్మడి అభ్యర్థికి 2,600 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

‘బొజ్జల’ గెలవలె..

చిత్తూరు జిల్లా రేణిగుంట పంచాయతీలో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి పాక్యముత్తు, సమీప ప్రత్యర్థి దేవికపై 1,464 ఓట్ల మెజారిటీతో గెలుపొంది టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి షాక్ ఇచ్చారు. బొజ్జల ఈ పంచాయతీపై ప్రత్యేక దృష్టిసారించినా వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకోలేకపోయారు.
Share this article :

0 comments: