బొత్స ఇలాకాలో బతుకులు బుగ్గి ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బొత్స ఇలాకాలో బతుకులు బుగ్గి !

బొత్స ఇలాకాలో బతుకులు బుగ్గి !

Written By news on Thursday, July 11, 2013 | 7/11/2013

- పాదయాత్రలో షర్మిలకు మొరపెట్టుకున్న స్థానికులు
- మంత్రి బొత్స కుటుంబ దౌర్జన్యంపై అడుగడుగునా ఫిర్యాదులు
- జన సభలో వాళ్లు చెప్పేది వినాలిగానీ.. మేం మాట్లాడకూడదంట
- ఇదేమని అడిగితే.. పోలీసులతో కొట్టిస్తున్నారు
- పంటతో మార్కెట్‌కు పోతే ఏజెంటు అడ్డగోలు ధర కడుతున్నాడు
- త్వరలోనే మంచిరోజులొస్తాయని ధైర్యం చెప్పిన షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: 
- రైతు పంట తీసుకొని మార్కెట్‌కు పోతే కమిషన్ ఏజెంటు పంటకు అడ్డగోలు ధర కట్టిస్తాడు. అయినా ఒక్క రైతూ నోరు మెదపకూడదు. ఒక వేళ ‘ఇదేం న్యాయం’ అని ఏ రైతైనా గొంతెత్తబోతే, గొంతులోని మాట బయటికి వచ్చే లోపు పోలీసు లాఠీలు రైతుల వీపు మీద ఉంటాయి.
- ఏడాదికోసారి సర్కారు జన సభలు పెడుతోంది. మంత్రి వస్తారు. ప్రజలు హాజరవుతారు. మహిళలను ముందు వరుసలో కూర్చోబెడతారు. కానీ ‘ఉప్పు, పప్పు, నూనె, కారం ధరలన్నీ పెంచేశారు, ఇదేం పాలన?’ అని ఏ ఒక్క గొంతు లేచినా మంత్రి అనుచరులు చుట్టుముడతారు.
- సహకార చక్కెర మిల్లుల్లో రాష్ట్రం అంతటా చెరకుకు రూ.2,100 గిట్టుబాటు ధర కట్టిస్తుంటే ఇక్కడి భీమసింగి చక్కెర పరిశ్రమలో రూ.2,000 కట్టిస్తున్నారు. ‘ఇదేం దోపిడీ’ అని ఒక్కరు అడిగినా వాళ్ల ఒళ్లు వాతలు తేలుతుంది.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ ఇలాకాలో సాగుతున్న అరాచకమిది. ఇక్కడ ఏం జరిగినా ఈ కుటుంబం కనుసన్నల్లో జరగాల్సిందే. లిక్కరు దుకాణాల్లోనే కాదు రైతుల కష్టంలో, కూలీల చెమట చుక్కల్లో ఆ కుటుంబానికి వాటా ఇవ్వాల్సిందే. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్న ఈ సమాంతర పాలనను రైతులు, మహిళలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు చెప్పుకొని కన్నీళ్లు పెట్టారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా స్థానికులు చెప్పిన కష్టాలివీ..

కంటిసూపుతోనే బెదిరిస్తారు..
‘‘అమ్మా ఇక్కడ జామి మండలంలోని భీమసింగి సహకార చక్కెర మిల్లు ఉంది. 20 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్న ఈ మిల్లును మూయించేసి వేలం వేయడానికి 2003లో చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశారు. దీంతో చక్కెర పరిశ్రమ మీద ఆధారపడి ఉన్న 5 నియోజకవర్గాల రైతులు, కార్మికులు ఉద్యమాలు చేశారు. నాడు పాదయాత్రలో భాగంగా భీమసింగి వచ్చిన వైఎస్సార్‌ను 100 గ్రామాల ప్రజలు వచ్చి కలిసి తమ సమస్య వివరించారు. ‘మన ప్రభుత్వం రాగానే మిల్లులను రక్షించుకుందాం’.. అని వైఎస్ మాటిచ్చారు. హామీ ఇచ్చినట్లుగానే వైఎస్సార్ ప్రభుత్వం రాగానే మిల్లుకు రూ.36 కోట్లు ఇచ్చారు. మెల్లగా మిల్లు ఊపిరి పోసుకుంది’’ అని బండారు పెదబాబు అనే రైతు షర్మిలకు తెలిపారు. ‘‘ఇప్పుడు అదే మిల్లు మీద మంత్రి బంధువులు వచ్చివాలారు. డెరైక్టర్లు, చైర్మన్ వాళ్ల కనుసన్నల్లో నడిచే వాళ్లే. రాష్ట్ర వ్యాప్తంగా టన్ను చెరక్కు రూ.2,100 రైతుకు గిట్టుబాటు ధర కట్టివ్వాలని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. రాష్ట్రం అంతట అన్ని మిల్లుల్లో కూడా అదే ధర కట్టిస్తున్నారు. కానీ భీమసింగి షుగర్స్‌లో మాత్రం రూ.2,000 మాత్రమే ఇస్తున్నారు. ఇందులో మరో రూ. 50 మిల్లు ఆధునీకరణ కోసం అని తీసుకుంటున్నారు. మొత్తం మీద క్వింటాల్ చెరకుకు మాకు చెల్లిస్తున్నది రూ.1,950 మాత్రమే. ఈ డబ్బంతా ఎవరికి చేరుతోంది. నాలుగేళ్ల నుంచి ఆడిట్ లేదు, అడిగితే మంత్రి కంటిసూపుతోనే బెదిరిస్తారు. మొండికేసి నిలదీస్తే పోలీసులు వచ్చి నోరు మూపిస్తారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

నోరెత్తితే చిందులు తొక్కుతారు..
‘‘అమ్మా..! జన సభలు అని పెడతారు. మమ్ములను తీసుకొని పోతారు. మంత్రి గారు, అధికారులు చెప్పిందే మేం వినాలి. రోడ్డు బాగాలేదనో, ఉప్పు, పప్పు, కారం ధరలు పెరిగాయనో నిలదీస్తే పోలీసులొచ్చి మంత్రి గారితో గొడవ పడుతవా? ఇక చాలు గాని కూర్చో అని నోరు మూపిస్తారు. ఏమైనా అడిగితే మంత్రి గారు మా మీద చిందులు తొక్కుతారు’’ అని వీఆర్‌పాలెంకు చెందిన మహిళ సిరిపురం సత్యవతి షర్మిల వద్ద తమ గోడు చెప్పుకొన్నారు. ‘‘షుగర్ ఫ్యాక్టరీలో సభ్యులుగా ఉన్న రైతులు ఆడపిల్లకు పెళ్లి చేస్తే రూ.10 వేల ఆర్థిక సహాయం చేస్తామని మంత్రి సత్తిబాబు నిండు సభలో మాటిచ్చాడు. ఆయన మాటిచ్చి నాలుగేళ్లు గడచిపోయాయి, కానీ ఒక్కరికన్నా సహాయం చేయలేదు. 

ఇదేంటి సారూ అని అడిగితే చెప్పిన వన్నీ చేయడం కుదరద్దా.! పో.. పోవయ్యా అంటారు’’ అని జాగరం, జామి గ్రామాల రైతులు అల్లు సింహాద్రి, బొడ్డెకాయల మహేశ్వర్‌రావు, సూరెడ్డి కృష్ణ తదితరులు తెలిపారు. ‘‘అమ్మా! రాష్ట్రంలో రైతులు తమకు గిట్టుబాటు ధర రావట్లేదు అని కనీసం బయటికి చెప్పుకుంటున్నారు. కానీ మాకు ఆ హక్కు కూడా లేకుండా చేశారమ్మా. అడిగితే పోలీసులతో దెబ్బలు తిన్నట్టే. మంత్రి గారితో పంచాయితీ పెడతవా? అంటారు. రైతులం కష్టాన్నే నమ్ముకొని బతికేవాళ్లం, మా కష్టం మాకు ఇవ్వండయ్యా అని అడిగితే మంత్రి గారితో పంచాయితీ పెట్టుకున్నట్టా. ఇదెక్కడి న్యాయం’’ అని రైతులు చెంచునాయుడు, అల్లు సత్యారావు, కృష్ణంరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరి సమస్యలు విన్న అనంతరం షర్మిల స్పందిస్తూ ‘‘అన్నా ధైర్యంగా ఉండండి.. త్వరలోనే మంచి రోజులొస్తాయి. మీ కష్టాలన్నీ తీరుతాయి’’ అంటూ భరోసా ఇచ్చారు.

భారీ వర్షంలోనూ ఆగని పాదయాత్ర..
పాదయాత్ర 205వ రోజు బుధవారం విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని ఆలమండ నుంచి ప్రారంభమైంది. లొట్టపాలెం, ఏటపాలెం, కొత్తభీమసింగి, భీమసింగి మీదుగా షర్మిల యాత్ర చేశారు. అక్కడి నుంచి సోమయాజులపాలెం వెళుతుండగా చుక్కచుక్కగా మొదలైన వాన.. భారీ వర్షంగా మారింది. ఆ వర్షంలో తడుస్తూనే షర్మిల రెండు కిలోమీటర్లు నడిచి సోమయాజులపాలెం చేరుకున్నారు. అప్పటికీ వర్షం జోరు ఇంకా తగ్గలేదు. అక్కడ రైతులు, మహిళలు వర్షంలో తడుస్తూనే షర్మిల కోసం నిలబడ్డారు. ఆమెకు ఘనంగా స్వాగతం పలికి తోడు నడిచారు. కిలో మీటర్ దూరం వెళ్లగానే జన్నివలస గ్రామానికి చెందిన కొందరు మహిళలు అక్కడ హారతి పళ్లెం పట్టుకొని నిలబడ్డారు. నిమ్మకాయలు షర్మిల చుట్టూ తిప్పి దిష్టి తీశారు. వీఆర్ పాలెంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ భార్య సిరిపురం సత్యమ్మ వచ్చి ‘మా ఊరు మీ నాయనకు రుణపడి ఉందమ్మా’ అంటూ కురుస్తున్న వానలోనే షర్మిలకు హారతి పట్టారు. తడిసిన బట్టలతోనే షర్మిల ఏడు కిలోమీటర్లు నడిచారు. బురదలో నడచుకుంటూ తనను చూడటానికి వస్తున్న వృద్ధులను చూసి ‘అవ్వా...! రావొద్దు నేను వస్తున్నా’ అంటూ తనే బురదలో నడచుకుంటూ వెళ్లి వారిని పలకరించారు. వసంత గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి ఆమె రాత్రి 6.45 గంటలకు చేరుకున్నారు. బుధవారం మొత్తం 14 కిలోమీటర్లు నడిచారు. 

షర్మిల వెంట నడచిన వారిలో విజయనగరం జిల్లా పార్టీ కన్వీనర్, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు, తాజా మాజీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎస్. కోట నియోజకవ ర్గ సమన్వయకర్తలు వేచలపు రామునాయుడు, బోకం శ్రీనివాసరావు, డాక్టర్ గేదెల తిరుపతి, గజపతినగరం సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు ఉన్నారు. రోజూ షర్మిల వెంట పాదయాత్రలో పాల్గొంటున్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: