రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్!

రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్!

Written By news on Tuesday, July 2, 2013 | 7/02/2013

 రిజర్వేషన్ల జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం 
- రెండుమూడు రోజుల్లో షెడ్యూల్ ప్రకటిస్తామన్న ఎన్నికల కమిషనర్
- ఐదో తేదీన జిల్లాల్లో నోటిఫికేషన్ల జారీ
- 19 నుంచి మూడు విడతలుగా ఎన్నికలు
- బుధవారం నుంచే కోడ్ అమలు

సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. బుధవారం ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్‌ను ప్రకటించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పంచాయతీల రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించడంతో ఎన్నికల నిర్వహణ ఖరారయ్యింది. బుధవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను వెలువరిస్తే.. శుక్రవారం జిల్లాల ఎన్నికల అధికారులు (కలెక్టర్లు) ఆయా జిల్లాల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేసిన రోజునుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం ప్రారంభం అవుతుంది. షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (నియమావళి) అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లను పరిశీలిస్తున్నామని ఎన్నికల షెడ్యూల్‌ను రెండుమూడు రోజుల్లో ప్రకటిస్తామని రమాకాంత్‌రెడ్డి సోమవారం తనను కలిసిన విలేకరులకు చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసే ముందు రోజువరకు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు.

ఎన్నికల్లో అభ్యర్థుల ధరావత్తు సొమ్మును, ఎన్నికల ప్రచార వ్యయాన్ని పెంచే ప్రతిపాదనపై రాజకీయ పార్టీల నాయకులతో చర్చించామని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రమాకాంత్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ముగియడానికి 29 రోజులు సమయం కావాల్సి ఉంటుందన్నారు. ఇలావుండగా మూడు విడతలుగా జరిగే పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు నిర్వహిస్తారు. ఆరోజు కుదరని పక్షంలో.. మరుసటి రోజు సెలవు దినమైనప్పటికీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

‘మద్యం’పై ముమ్మర నిఘా
పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మద్యాన్ని అరికట్టడానికి చెక్‌పోస్టుల్లో పోలీసులతోపాటు, ఎక్సైజ్ పోలీసుల పహారా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. పంచాయతీ, రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్ని జిల్లాల కలెక్టర్లను కోరారు.

శాంతిభద్రతలపై దృష్టి పెట్టండి: డీజీపీ
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో గ్రామ స్థాయిలో శాంతిభద్రతలపై దృష్టి సారించాలని డీజీపీ వి.దినేష్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలు, ఫ్యాక్షన్, నక్సల్ ప్రభావిత గ్రామాల పరిస్థితిపై నివేదికలు రూపొందించాలని సూచించారు.
Share this article :

0 comments: