ఓటే మీ ఆయుధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓటే మీ ఆయుధం

ఓటే మీ ఆయుధం

Written By news on Tuesday, July 23, 2013 | 7/23/2013

వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రజల దీవెన ఉందని మీరు నిరూపించాల్సిన సమయమిది
పార్టీ మద్దతుదారులను గెలిపించి జగనన్నను ఆశీర్వదించండి
మీరు వేసే ప్రతి ఓటూ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని తీర్పు చెబుతుంది
వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నిటికీ జగనన్న వచ్చాక జీవం పోస్తారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 217, కిలోమీటర్లు: 2913

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దేవుని దయ, మీ(ప్రజల) దీవెన ఉందని మీరు నిరూపించాల్సిన సమయం ఇది. ఓటు అనే ఆయుధంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను మీరు గెలిపించిన రోజున జగన్‌మోహన్‌రెడ్డిని మీరు ఆశీర్వదించినట్లు అవుతుంది. మీరు వేసే ప్రతి ఓటూ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని తీర్పు చెబుతుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో సాగింది. ఈ జిల్లాలో రెండోరోజు కూడా షర్మిల పూర్తిగా వర్షంలో తడుస్తూనే పాదయాత్ర కొన సాగించారు. ప్రజలు కూడా తడుస్తూనే ఆమె కోసం ఎదురుచూశారు. పలు చోట్ల షర్మిల వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘అమ్మా... ఇంత వర్షంలో తడుస్తూ నా కోసం ఎదురు చూస్తున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. నాన్న గారి మీద, జగనన్న మీద ఇంత అభిమానం, ఆప్యాయత, అనురాగం చూపిస్తున్న మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా’’ అని షర్మిల వారికి కృతజ్ఞతలు తెలిపారు. 

సీల్డు కవర్ నాయకులకు.. ప్రజల బాధలు అర్థంకావు

యాత్ర మార్గంలో దారి పొడవునా పలువురు వృద్ధులు, వికలాంగులు, మహిళలు, విద్యార్థులు షర్మిలను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. షర్మిల వారితో మాట్లాడుతూ.. ‘‘అమ్మా..! ఇప్పుడున్న ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం. ఈ పాలకులు ప్రజల నుంచి వచ్చిన వాళ్లు కాదు. ఢిల్లీ నుంచి సీల్డు కవర్‌లో వచ్చిన వాళ్లు. వీళ్లకు ప్రజా సమస్యలంటే ఏమిటో అర్థం కావు. ఇవాళ రైతులకు తగిన మద్దతు ధర దక్కడంలేదు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు సరిగా అందటం లేదు. మహిళలకు వడ్డీ లేని రుణాలు లేవు.. ఇవాళ ఏ పల్లెకు వెళ్లి ఏ మహిళను పలకరించినా ‘అమ్మా.. పూట గడవని పిరిస్థితుల్లో మా పిల్లలను బడి మాన్పించి పనులకు పంపిస్తున్నామమ్మా’ అని బాధపడుతూ చెప్తున్నారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారు’’ అని నిప్పులు చెరిగారు. 

‘‘త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన విద్యార్థుల కోసం మళ్లీ ఫీజు రీయింబర్స్‌మెంటు, పేదల కోసం ఆరోగ్యశ్రీ నిలబెడతారు. వృద్ధులకు, వితంతువులకు పింఛను రూ.700 అవుతుంది. వికలాంగులకైతే రూ.1,000 అవుతుంది. పిల్లలను చదివించేటట్లు తల్లిదండ్రులను ప్రోత్సహించడం కోసం పదో తరగతి వరకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున ఏడాదికి రూ. 6 వేలు అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్ చదివితే రూ.8,400, డిగ్రీ చదివితే రూ.12,000 అమ్మ అకౌంట్లోనే పడతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఉండనే ఉంది. రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా జగనన్న ప్రతి నిరుపేదకూ పక్కా ఇల్లు కట్టిస్తారు. వైఎస్సార్ హామీ ఇచ్చినట్టు ప్రతి పేద కుటుంబానికి నెలకు 30 కిలోల బియ్యం ఇస్తారు’’ అని హామీ ఇచ్చారు.

పింఛను పెంచమంటే.. ఉన్నదీ తీసేస్తున్నారు

దారిపొడవునా పలువురు వికలాంగులు షర్మిలను కలిశారు. ‘పింఛన్ పెంచమని మేం అడుగుతుంటే ఉన్న పింఛన్‌ను తీసేశారక్కా..’ అని చెప్పి బాధపడ్డారు. వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డే సీఎం కావాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. వారి మాటలకు షర్మిల స్పందిస్తూ ‘‘వైఎస్సార్ మానసిక వికలాంగులకు కూడా పింఛన్ ఇచ్చారు. అదీ ఆయనకున్న గొప్ప మనసు. వికలాంగుల పట్ల ఇంకొంచెం ప్రేమ, ఆప్యాయతతో మెలగాలని, అలాచేయకపోతే మనకు, రాక్షసులకు పెద్దగా తేడా ఉండదని వైఎస్సార్ అనుకునేవారు. ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సింది పోయి, వైఎస్సార్ పథకాలను తుంగలో తొక్కుతోంది. వృద్ధులను, వికలాంగులను గాలికి వదిలేసింది. పింఛన్ డబ్బు సరిపోవడం లేదు పెంచండి మహాప్రభో అని వాళ్లు మొరపెట్టుకుంటుంటే ఉన్న పింఛన్లు ఊడపీకేస్తున్న ఈ ప్రభుత్వం ఉంటే ఎంత.. లేకుంటే ఎంత’’ అని మండిపడ్డారు. ‘‘మీరు అధైర్యపడవద్దు.. త్వరలోనే మీరు కోరుకున్నట్టుగానే జగనన్న వస్తాడు. వైఎస్సార్ ఏ విధంగానైతే మీకు సహాయపడ్డారో.. జగనన్న కూడా అదే విధంగా మిమ్మల్ని ఆదరిస్తారు. మీ అందరినీ జగనన్న సంతోషంగా ఉంచుతారు. అవ్వా తాతలు ఈ వయసులో పనికి పోవాల్సిన అవసరమే రాకుండా జగనన్న చూసుకుంటారు. చదువు లేని వికలాంగులు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలిచ్చి మీ కాళ్ల మీద మీరు నిలబడే విధంగా ప్రోత్సహిస్తారు’’ అని భరోసా ఇచ్చారు.

14.2 కిలోమీటర్ల మేర యాత్ర..

సోమవారం 217వ రోజు ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని నడకూరు గ్రామం నుంచి ప్రారంభమయింది. అక్కడి నుంచి వీరఘట్టం, రేగులపాడు జంక్షన్, బొడ్లపాడు జంక్షన్, వండువ జంక్షన్ మీదుగా నవగాం గ్రామం మీదుగా సాగింది. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల సాయంత్రం 6.30 గంటలకు చేరుకున్నారు. సోమవారం మొత్తం 14.2 కిలోమీటర్లు ఆమె నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,913 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు, జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, పాలకొండ సమన్వయకర్తలు విశ్వాసరాయి కళావతి, పాలవలస విక్రాంత్, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు పీఎంజీ బాబు, దువ్వాడ శ్రీనివాసు, వరుదు కళ్యాణి, కేంద్ర పాలక మండలి సభ్యులు పాలవలస రాజశేఖరం, స్థానిక నాయకులు కొత్తపల్లి గీత, బొడ్డేపల్లి పద్మజ, పాదయాత్రలో ప్రతిరోజూ పాల్గొంటున్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, దవళ వెంకట గిరిబాబు తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: