మరో ప్రజాప్రస్థానం.. ఓ చరిత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో ప్రజాప్రస్థానం.. ఓ చరిత్ర

మరో ప్రజాప్రస్థానం.. ఓ చరిత్ర

Written By news on Monday, July 29, 2013 | 7/29/2013

నేటితో 3,000 కిలోమీటర్లకు చేరనున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం
అడుగడుగునా అపూర్వంగా ఆదరించి అక్కున చేర్చుకుంటున్న ప్రజానీకం





అల్లారుముద్దుగా పెరిగిన ఓ అమ్మాయి...
తన పిల్లల్ని అంతే అపురూపంగా చూసుకోవాల్సిన తల్లి...
కుటుంబానికి దూరంగా..అనేక కష్టనష్టాలకు ఓరుస్తూ...వానల్లో నిలువెల్లా
తడుస్తూ...

రోళ్లు పగిలే ఎండకు ఎండుతూ..
వణికించే చలికి 
తట్టుకుంటూ.. 
ప్రత్యర్థుల కుట్రలు,
కుతంత్రాలను దాటుకుంటూ..
లక్షల అడుగులను.. కోటి గొంతుకలను కలుపుకుని...

‘అన్న’మాటపై నిలిచి,‘తండ్రి’బాటలో..ఏకంగా 3,000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తిచేయనుండటం...చరిత్ర చూడని ఓ అపూర్వ సందర్భం

2012 అక్టోబర్ 18న ఇడుపులపాయలో వేసిన తొలి అడుగు... కురుస్తున్న వానల్లో నిలువెల్లా తడుస్తూ... రోళ్లు పగిలే ఎండకు ఎండుతూ.. గజగజ వణికించే చలిని, ప్రత్యర్థుల కుట్రలు, కుతంత్రాలను దాటుకుంటూ... తేళ్లు, పాములతో సహవాసం చేస్తూ... లక్షల అడుగులను .. కోటి గొంతుకలను కలుపుకుని... మహా ప్రజాప్రస్థానం అయింది. అవాంతరాలు ఎన్ని ఎదురొచ్చినా యాత్రను షర్మిల ఒక యజ్ఞంలా భావించారు. ఒక దీక్షగా కొనసాగిస్తున్నారు.

వైఎస్సార్ ‘ప్రజాప్రస్థానం’:హిట్లర్‌ను మించిన నియంతృత్వంతో సాగిన చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో సాగు వట్టిపోయింది. రైతాంగం తల్లడిల్లింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తలకిందులైంది. ముఖ్యమంత్రిగా ఆదుకోవాల్సిన చంద్రబాబు ఆర్థిక సంస్కరణల మోజులో పడి రైతుల వెన్ను విరిచారు. పన్నుల భారం మోపారు. అన్నదాతలపై కేసులు పెట్టారు. జైలుకు పంపారు. అవమానం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగానికి ‘నేనున్నానని’ వైఎస్సార్ పాదయాత్ర భరోసా ఇచ్చింది. పిడికెడు మెతుకుల కోసం పొట్టచేతబట్టి వలస బాట పట్టిన కూలీలకు ‘తోడుంటానని’ నమ్మకమిచ్చింది.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’: మాటను నిర్బంధించాలన్న కుట్రను, పేదోడి గుండె చప్పుడు నిలువరించాలనే కుతంత్రాన్ని ఎండగడుతూ... అప్పులు, అవమానాలు తట్టుకోలేక ఉరితాళ్లకు వేలాడుతున్న అన్నదాతల కన్నీళ్లు తుడిచి వెన్ను తడుతూ... చెట్టంత ఎదిగిన బిడ్డలు ఫీజుల ఉచ్చుకు చిక్కి ‘కళ్ల ముందే కూలిపోయి గర్భశోకం అనుభవిస్తున్న తల్లిదండ్రులను ఓదారుస్తూ... పేద విద్యార్థులకు ధైర్యాన్నిస్తూ... పండుటాకులకు ఊతకర్రై... ఎండిన బతుకులకు నీటి చెలిమై సాగిన నిరుపమాన యాత్ర.

‘అన్న’మాటే ఆలంబనగా.. ‘నాన్న’బాటలో నడక...

రాష్ట్రానికి ఇటు కొసన ఇడుపులపాయ, అటు కొసన ఇచ్ఛాపురం. వైఎస్సార్ ఆశీర్వాదంతో ‘నేను మీ రాజన్న కూతుర్ని... 
జగనన్న వదిలిన బాణాన్ని.. నా పేరు షర్మిల’ అంటూ అక్టోబర్ 18న ఇడుపులపాయలో వేసిన తొలి అడుగు... కురుస్తున్న వానల్లో నిలువెల్లా తడుస్తూ... రోళ్లు పగిలే ఎండకు ఎండుతూ.. గజగజ వణికించే చలిని , ప్రత్యర్థుల కుట్రలు, కుతంత్రాలను దాటుకుంటూ.. తేళ్లు, పాములతో సహవాసం చేస్తూ.... లక్షల అడుగులను.. కోటి గొంతుకలను కలుపుకుని... మహా ప్రజాప్రస్థానం అయింది. ఇప్పుడా మహాయాత్ర విజయపు వాకిట నిలబడింది. జనం గోడు వింటూ... జగనన్నే తోడంటూ... చేనేత, గీత, కుమ్మరి, కమ్మరి, మాల, మాదిగ, మేదరి, చాకలి... సకల జనాలకు ధైర్యం పోస్తూ... పండుటాకుల నుంచి పసి మొగ్గల వరకు ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ... ‘జగనన్న వస్తాడు, మనందరినీ రాజన్న రాజ్యం వైపుకు నడిపిస్తాడంటూ’ అభయమిస్తూ సాగుతున్న షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు 3,000 కిలోమీటర్ల మైలురాయిని దాటేయనుంది. సిక్కోలు జిల్లా మారుమూల పల్లె దనుపురం ఈ మహత్తర సందర్భానికి వేదికవుతోంది. ఆ గ్రామంలో అడుగు పెట్టడం ద్వారా చరిత్ర పుటల మీద షర్మిల చెరగని సంతకం చేయనున్నారు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ మహిళా సాధించని, ఇప్పట్లో సాధించలేని అరుదైన చరిత్రను సృష్టించబోతున్నారు.

కొందరు ‘నాయకుల’ మాదిరిగా పాదయాత్ర చేస్తున్నందుకు షర్మిల ఏనాడూ బాధపడలేదు. యాత్ర వల్ల తనకు కలుగుతున్న వ్యక్తిగత కష్టనష్టాలను, శారీరక ఇబ్బందులను పంచరంగుల్లో ప్రచారం చేసుకోలేదు. పైగా ‘ఇంతమంది ప్రజలను నేరుగా కలిసేందుకు అవకాశం వచ్చింది. వారి కష్టాలూ, కన్నీళ్లూ స్వయంగా చూసేందుకు, ముందున్నదంతా మంచి కాలమేనంటూ ఓదార్చేందుకు అవకాశం దక్కింది’ అని చెప్పారు. ఇక్కడో ముఖ్య విషయం చెప్పాలి. ‘వస్తున్నా మీకోసం...’ అంటూ చంద్రబాబు తన పాదయాత్రలో ఒక్కో అడుగూ ముందుకు నడుస్తుంటే... ఆయన తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక్కో అడుగూ వెనక్కు పోయింది. 2009 ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి 92 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. 

చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టడానికి ముందు రోజు టీడీపీకి 83 మంది ఎమ్మెల్యేలున్నారు. యాత్ర మొదలు పెట్టి, విశాఖపట్టణంలో యాత్ర ముగించేనాటికి ఆ పార్టీకి మిగిలింది 75 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. దీనికి కారణం ఒక్కటే. పాదయాత్రలో చంద్రబాబు నాయుడు పల్లెల్లో తిరిగారు. ప్రజల కష్టాలను చూశారు. ఈ దర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి ఎంత మాత్రం వీలు లేదంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ తీరా సమయం వచ్చినప్పుడు అసలు రంగు బయట పెట్టుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వకుండా దాన్ని కంటికి రెప్పలా కాపాడారు. బాబు తీరును ప్రజలు గమనించారు. 

ఆయన మారిన మనిషి కాదు, మారని మనిషేనని గ్రహించారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో పలువురు ప్రజా ఒత్తిడికి తట్టుకోలేక పార్టీని వదులుకుని వారి పక్షం నిలబడ్డారు. పాదయాత్రలో చంద్రబాబు చేసిన వాగ్దానాలు అన్నీ ఇన్నీ కావు. బీసీలకు 100 అసెంబ్లీ సీట్లు ఇస్తామన్నారు. బెల్టు షాపులు రద్దు చేస్తామన్నారు. గిరిజనులకు పింఛను ఇస్తానన్నారు. వారి పిల్లలను పీజీ దాకా ఉచితంగా చదివిస్తానన్నారు. ఇలా పాదయాత్రలో చంద్రబాబు అక్షరాలా 72 వాగ్దానాలు చేశారు. వాటిని ప్రజలు ఎంతవరకు విశ్వసించారో తెలియాలంటే, ‘నానొప్పుకోను బాబో...ఆ బాబును నమ్ముకుంటే సావు రాసి పెట్టుకున్నత్తే’ అని శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీకి చెందిన గిరిజన వృద్ధురాలు, అడవి తప్ప మరో ప్రపంచం తెలియని కోనాడి సీతమ్మ చెప్పిన మాటలను చూస్తే చాలు. చంద్రబాబు మీద ప్రజలకున్న విశ్వసనీయత ఇదీ! కర్నూలు, గద్వాల, విజయవాడ, విశాఖపట్నం వేదికల మీద నుంచి చంద్రబాబుకు షర్మిల ఓ సవాలు విసిరారు. ‘మేం అధికారంలోకి వస్తే అచ్చంగా వైఎస్సార్ పాలననే కొనసాగిస్తాం. వైఎస్సార్ పథకాలకే జగనన్న జీవం పోస్తారని ధైర్యంగా చెప్తున్నాం. మీరు అధికారంలోకి వస్తే మీ తొమ్మిదేళ్ల పాలననే తిరిగి తెస్తానని చెప్పుకోగలరా? అలా చెప్పుకునే ధైర్యం మీకుందా?’ అని! ఆ సవాలుకు బాబు నుంచి ఇంకా సమాధానం రావాల్సే ఉంది!

కరిగి కురిసిన చినుకు 

అది తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం. షర్మిల పాదయాత్ర తోకాడ గ్రామ శివారుకు చేరింది. ఆకాశం మేఘావృతమై గాలితో కూడిన జల్లు పడుతోంది. దాదాపు చీకటి పడింది. ఆ చీకట్లోనే ఒక చేతి చంకలో చంటిపాపను, మరో చేత్తో హారతి పళ్లెం పట్టుకుని ఓ మహిళ రోడ్డు మీద నిలబడి ఎదురుచూస్తోంది. జోరుగాలిలో కురుస్తున్న వాన జల్లు ఆమెను, చంటిబిడ్డను తడిపేస్తోంది. హారతి ఆరిపోకుండా, బిడ్డ తడవకుండా చీర కొంగులో ఓ సగం పసిపాప మీద కప్పేసిందామె. షర్మిల వచ్చేదాకా హారతి ఆరనివ్వలేదు. ఎట్టకేలకు షర్మిలకు హారతి పట్టి, ఆశీర్వదించిన తరువాతే వెనుదిరిగింది. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోనూ అంతే. నాతవరం మండలం ఎర్రవరం కూడలి మీదుగా పాదయాత్ర సాగిపోతోంది. కిలోమీటర్ దూరంలో పంట పొలంలో ఉన్న కూలీలు షర్మిలను చూసి చేస్తున్న పని ఆపి ఆమెకేసి పరుగుపరుగున వచ్చారు. మోకాటి లోతు బురదలో శక్తిని కూడదీసుకుంటూ పరుగెత్తుకు వస్తుండటం చూసి వారికోసం షర్మిల ఆగారు. నూకాలమ్మ, నారాయణమ్మ అనే కూలీల చీరకొంగు ముళ్లపొదలకు తట్టుకుని పూర్తిగా చిరిగిపోయింది. అయినా సరే.. ఆమెను చేరుకునే దాకా వాళ్ల పరుగు ఆగలేదు. ఇలాంటి అభిమానం సాయుధ పోరాట కాలంలో కమ్యూనిస్టు నాయకులకు దక్కిందని చదివాను. ఖమ్మం జిల్లా బూడిదంపాడు మండలంలో జమునాబాయి అనే గిరిజన వృద్ధురాలు తన చీరకొంగులో దాచుకున్న రూ.100 నోటు తీసి ‘కొబ్బరి బొండాలు కొనుక్కో బిడ్డా..’ అని షర్మిల చేతికి ఇచ్చింది.

కమ్యూనిస్టు యోధులు భీమిరెడ్డి నర్సింహారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలు వారి వారి స్థోమతను బట్టి డబ్బు గానీ, ధాన్యం గానీ తమ వంతు చందాగా ఇచ్చి ఓట్లు వేసేవాళ్లు. ఎందుకంటే వాళ్లు ప్రజల ఆకాంక్ష, సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన నాయకులు. ఎంచుకున్న మార్గం, నడిచిన దారి వేరు గానీ వైఎస్సార్ కూడా కమ్యూనిస్టు ఎజెండానే అమలు చేశారు. జలయజ్ఞం, ఉచిత కరెంటు, భూ పంపిణీ పథకాలతో రైతాంగానికి దగ్గరయ్యారు. నక్సలైట్లు 40 ఏళ్లుగా పోరాడుతున్న జల్, జంగిల్, జమీన్‌లను వైఎస్సార్ ఐదేళ్ల కాలంలో సాధించారు. గిరిజనులకు 20.6 లక్షల ఎకరాల భూ పంపిణీ చేసి పట్టాలిచ్చారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న 9 లక్షల ఎకరాల అటవీ భూమిపై వారికే హక్కులు కల్పించారు. వెనకబడిన తరగతుల వారికి నాలుగు విడతల్లో 6 లక్షల ఎకరాలు పంపిణీ చేశారు. రక్షిత నీటితో పాటు ప్రజా వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 2 రూపాయలకు కిలో బియ్యం పథకం తెచ్చి పేదింటి కి దేవుడయ్యారు. తమ కోసం పాటుపడ్డ వాళ్లను ప్రజలెప్పుడూ గుండెల్లోనే పెట్టుకుంటారు. జనం మధ్య నుంచి వెళ్లిపోయిన వైఎస్సార్ ప్రజల గుండె లోతుల్లో ఒదిగిపోయారు. ఆయన మీదున్న అభిమానాన్నేజనం ఇప్పుడు జగన్ మీద, షర్మిల మీద చూపిస్తున్నారు. హారతులు పట్టి ఆశీర్వదిస్తున్నారు.

రైతులు పచ్చగా ఉండాలంటే...

పశ్చిమ గోదావరి నుంచి షర్మిల తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెడుతున్నారు. గోదారి పశ్చిమ తీరం కొవ్వూరు రేవు ఒడ్డున షర్మిల మధ్యాహ్న భోజన విరామం తీసుకున్నారు. అప్పటికే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకి 10 రోజులవుతోంది. అయినా వాన చినుకుల జాడ లేదు. తొలకరి కోసం జనం ఆకాశం వంక చూస్తున్నారు తీర గ్రామాల ప్రజలు షర్మిల వద్దకు వచ్చారు. ‘అమ్మా..! పాదయాత్రలో నాన్నగారు పాదం మోపిన వేళ కరువు తీరా వర్షం కురిసింది. ఆ వర్షం కూడా ఆయనతోనే వెళ్లిపోయింది. నీ చేతితో ఆ గోదారమ్మ తల్లికి పసుపు కుంకుమలు పెడితే కరుణిస్తుంది’ అని చెప్పడంతో షర్మిల కొవ్వూరు రేవులోకి వెళ్లారు. గోదారికి దండం పెట్టి పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. రెండు చేతులెత్తి దండం పెట్టారు. రాజమండ్రి వైపు అడుగులు వేస్తుండగానే ఆకాశమంతా మేఘావృతమైంది. షర్మిల కొవ్వూరు బ్రిడ్జి మీదకు చేరారు. ఆశ్చర్యం! ఆ దేవుడే స్వాగతం చెప్పినట్టుగా, నాన్నే ఆశీర్వదించినట్టుగా జోరున వర్షం కురిసింది. వర్షంలో తడిసి ముద్దవుతూనే షర్మిల ముందుకు కదిలారు.

ఆదరణనూ అడ్డుకునేందుకు పాలకుల కుట్ర...

150 ఏళ్ల కిందట కాటన్ ధవళేశ్వరం, విజ్జేశ్వరం ఆనకట్టలు కట్టించాడు. పంట కాల్వలు తవ్వించి, వరద నీటిని డెల్టాకు పారించాడు. ఉభయ గోదావరి జిల్లాలకు దేవుడయ్యాడు. అక్కడ ప్రతి పల్లెలోనూ కాటన్ విగ్రహం కొలువుంటుంది. తరువాత గోదావరి డెల్టా కాల్వలు పూడిపోయి మళ్లీ వరదలు పంటలను ముంచెత్తుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. రాష్ట్రానికి అన్నం పెట్టి ‘అన్నపూర్ణ’గా పేరొందిన డెల్టా వరదల తాకిడికి అతలాకుతలం అవుతున్న వేళ వైఎస్సార్ ఆదుకున్నారు. పూడిక తీయించి కాల్వల ఆధునీకరణకు రూ.1,464 కోట్లు కేటాయించారు. ఆయన హయాంలో పనులు శరవేగంగా సాగాయి. తీరవాసులు వైఎస్సార్‌ను గుండెల్లో పెట్టుకున్నారు. కాటన్ దొర విగ్రహం పక్కనే వైఎస్సార్ విగ్రహం పెట్టుకున్నారు. ఈ అభిమానాన్ని చూసి పాలకులు ఓర్వలేకపోయారు. పనులు పూర్తయితే తీరప్రాంతమంతా వైఎస్సార్‌పై ఇంకా అభిమానం పెంచుకుంటుందని, అది జగన్‌కు అనుకూలంగా మారుతుందని భయపడి, నానా సాకులతో డెల్టా ఆధునీకరణ పనులను నిలిపేసే కుట్రలు చేస్తున్నారని రైతులు ఉప్పు నాగేశ్వరరావు, రవీందర్‌రెడ్డి షర్మిలకు చెప్పినప్పుడు ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇంత దుర్మార్గపు రాజకీయాలు చేస్తారా అంటూ బాధపడ్డారు. 

‘ఈ సుదీర్ఘ పాదయాత్రలో ఎంతోమంది బాధలను ప్రత్యక్షంగా చూశారు. వాళ్ల కన్నీళ్లను తుడిచారు. ఇందులో మిమ్ములను కదిలించిన, కలచివేసిన సంఘటనలు, సందర్భాలు ఏమైనా ఉన్నాయా?’ అని సీనియర్ జర్నలిస్టు సుధాకర్‌రెడ్డి ప్రశ్నించినప్పుడు షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సందర్భాలున్నాయన్నారు. ‘‘మీ నాన్న ఇస్తున్న పింఛనుతోనే నిలబడ్డానని ఒక వృద్ధురాలు, మీనాన్న గారి వల్లే నేను ట్రిపుల్ ఐటీ చేయగలిగానని ఒక విద్యార్థి, మీ నాన్న గారి వల్లే నా భర్తకు ఆపరేషన్ అయిందని ఒక ఇల్లాలు తన భర్తను చూపిస్తూ చెప్పినప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క అనుభవం. ఇప్పుడు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. మమ్ములను పట్టించుకునే వాళ్లే లేరమ్మా అని చెప్తున్నప్పుడు తట్టుకోలేని పరిస్థితి. నాన్న ఉంటే ఎంత బాగుండు, ప్రజలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనిపిస్తుంది’’ అని చెప్పారు. ఆమె ప్రతి అడుగూ, ప్రతి శ్వాసా వైఎస్సార్, జగన్ మాదిరిగానే ప్రజల గురించి ఆలోచన చేస్తూ పాదయాత్రను ఒక యజ్ఞంలా చేస్తున్నారు.
- వర్ధెల్లి వెంకటేశ్వర్లు, 
‘మరో ప్రజాప్రస్థానం’ ప్రత్యేక ప్రతినిధి


చరిత్రలో కొన్ని ఘటనలు

చైనా లాంగ్ మార్చ్: మన పొరుగుదేశంలో కమ్యూనిస్టు విప్లవానికి నాంది పలికిన ఉద్యమమిది. చైనీస్ నేషనలిస్ట్ పార్టీ దాడుల నుంచి తప్పించుకునేందుకు మావో జెడాంగ్, ర-ఎన్-లై మొదలుపెట్టిన ప్రయాణాన్ని లాంగ్‌మార్చ్‌గా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఇది ఒకే మార్చ్ కాదు. వేర్వేరు కమ్యూనిస్టు దళాలు చైనా దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర, పశ్చిమ దిక్కులకు వెళ్లిపోయాయి. యాంగ్‌క్సీ నుంచి 1934 అక్టోబర్ 16న ‘బో గూ’, ఒట్టో బ్రాన్‌ల నేతృత్వంలో దాదాపు 1.3 లక్షల మంది సైనికులతో మొదలైన లాంగ్ మార్చ్‌కు తరువాత కాలంలో మావో, ర-ఎన్-లై నేతృత్వం వహించారు. 368 రోజుల పాటు సాగిన లాంగ్ మార్చ్‌లో రెడ్ ఆర్మీ అత్యంత సంక్లిష్ట మార్గాల మీదుగా దాదాపు 9,000 కిలోమీటర్ల దూరం సాగింది. 1935 అక్టోబర్ 22న షాన్‌క్సీలో మూడు దళాల చేరికతో ముగిసింది. ఇదంతా పాదయాత్రగానే భావించడానికి లేదు. ఆరోగ్యంగా ఉన్నవారు నడిచారు. అనారోగ్యంతో ఉన్న వారిని గుర్రాల మీద, బళ్ల మీద, డోలీల్లో తరలించారు.

జార్జ్ గ్రీమన్: అతి సుదీర్ఘమైన నడక సాగించాడు. బ్రిటన్‌కు చెందిన జార్జ్ గ్రీమన్ 1977లో దక్షిణ అమెరికాలోని టియారా డెల్‌ఫ్యూగో నుంచి మొదలుపెట్టి.. మొత్తం పశ్చిమార్ధ గోళాన్ని చుట్టేశాడు. పాతికేళ్ల వయసులో మొదలైన ఈ ప్రస్థానం 1983లో అలాస్కాలోని ప్రుధో బే వద్ద ముగించాడు. ఆరేళ్ల కాలంలో 2,425 రోజుల్లో 30,608 కిలోమీటర్లు నడిచి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు.

వినోబా భావే: ఆచార్య వినోబా భావే 1951లో మొదలుపెట్టిన భూదాన్ ఉద్యమం పేదల జీవితాలను సమూలంగా మార్చింది. భూస్వాముల నుంచి విరాళంగా సేకరించిన భూమిని లేని వారికి పంచిపెట్టే ఉద్దేశంతో 1951 ఏప్రిల్‌లో ప్రారంభమైందీ ఉద్యమం. వినోభా భావే దేశవ్యాప్తంగా 13 ఏళ్లపాటు పాదయాత్ర జరిపారు. ఎన్ని వేల మైళ్లు నడిచారన్నది కచ్చితమైన అంచనాలు లేవు.

చంద్రశేఖర్: మాజీ ప్రధాని, యంగ్ టర్క్ ఎస్.చంద్రశేఖర్ 1983లో భారత్ యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. కన్యాకుమారి నుంచి ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వరకూ 4,260 కి.మీ. మేర పాదయాత్ర జరి గింది. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ఈ యాత్రలో వేర్వేరు రాష్ట్రాల్లో 15 భారత్ యాత్ర కేంద్రాలను ఏర్పాటు చేశారు.

షర్మిల పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలోకి అడుగుపెట్టేప్పటికి చలికాలం మొదలైంది. కృష్ణా జిల్లా దాటి ఖమ్మంలోకి అడుగుపెట్టే నాటికి తీవ్రమైన ఎండలు. మే 4 నుంచి 7 తేదీ వరకు కొత్తగూడెంలో పాదయాత్ర సాగినపుడైతే ఏకంగా 49 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు. మిర్యాలగూడెం నియోజకవర్గం తుంగపాడు గ్రామంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసి షర్మిల టెంట్ పూర్తిగా తడిసింది. కృష్ణా జిల్లా కంచికచర్లలో టెంటు గాలి దుమారానికి తిరగబడిపోయింది. అయినా ఎక్కడా షర్మిల అడుగు వెనకకు పడలేదు. ఎండా, వానా, చలీ దేన్నీ లెక్క చేయకుండా నిబ్బరంగా ముందుకే సాగారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన రోజు నుంచి భారీ వర్షాలు కురిస్తున్నా తడుస్తూనే యాత్రను కొనసాగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం తుడ్డలి గ్రామంలో రాత్రి పూట షర్మిల బస చేసిన టెంట్‌లోకి కట్ల పాము వచ్చింది. కాసేపటికే మరో పాము వచ్చింది. తేళ్లయితే ఎన్ని వచ్చాయో లెక్కే లేదు!

భరోసా కల్పిస్తున్నారు..

‘‘ఓ మహిళ 3 వేల కి.మీ. నడవడం బహుశా ప్రపంచ చరిత్రలోనే రికార్డు. షర్మిల ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పాదయాత్ర చేస్తూ ప్రజల్లో కలిసిపోవడం, రాజకీయంగా పరిణతి చెందిన ఉపన్యాసాలు ఇవ్వడాన్ని చూస్తే కచ్చితంగా ఆమెను విలక్షణ నేతగా చెప్పవచ్చు. రచ్చబండ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. వాటిపై పోరాటం చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులకు సూచిస్తున్నారు. ఆసరా లేని అభాగ్యులకు సాయం చేసి భరోసా కల్పిస్తున్నారు. ప్రజల ఆదరణ చూస్తే.. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్ కుటుంబాన్ని ప్రజల గుండెల్లోంచి చెరపలేరని రుజువవుతోంది.’’
- వాసిరెడ్డి పద్మ,
వైఎస్సార్ సీపీ నేత


అభినందనీయం..

‘‘ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు షర్మిల చేపట్టిన పాదయాత్ర అభినందనీయం. ఇది రాజకీయాల్లో కొనసాగే మహిళలకు స్ఫూర్తిదాయకం. తన పాదయాత్ర అనుభవాలను పార్టీలో చర్చించి, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు షర్మిల కృషి చేస్తుందని 
ఆశిస్తున్నాను.’’
- దేవి, సామాజిక కార్యకర్త

అపూర్వం..
‘‘షర్మిల సుదీర్ఘ పాదయాత్ర ఒక అపూర్వఘట్టం. ప్రజలు ఆమెకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతిచోటా భారీ సంఖ్యలో ప్రజలు కదిలి రావడం వైఎస్ కుటుంబం పట్ల ప్రజలకున్న అపార అభిమానానికి నిదర్శనం.’’
- అనురాధ, ఎన్‌జీ రంగా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్

ప్రజలు గుర్తిస్తున్నారు..

‘‘తమ కష్టాలను తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్న షర్మిల పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ఆమె వాగ్దానం చేస్తున్న రాజన్న రాజ్యాన్ని జగనన్న తీసుకువస్తారని, ప్రజల కష్టాలను రాజన్న బిడ్డలు దూరం చేస్తారని ఆశిస్తున్నాను.’’
- వినుతా రెడ్డి, గృహిణి

ప్రజలకు ధైర్యం ఇస్తున్నారు..

‘‘ఒక మహిళ ఎండావానలను భరిస్తూ ఇంతదూరం నడవడం ఒక సాహసం. మోకాలికి ఆపరేషన్ అయినా లెక్కచేయకుండా.. ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేయడం గొప్పవిషయం. మీ వెంట నేనున్నాననే ధైర్యాన్ని ప్రజలకు కల్పించడం ఆవిడ సాధించిన ఘన విజయం.’’
- సుశీలా దేవి, ఢిల్లీ తెలుగు ఎంప్లాయీస్ వెల్ఫేర్ 
అసోసియేషన్ అధ్యక్షురాలు

ఇది చాలా గొప్ప విషయం..

‘‘ఇంత సుదీర్ఘ పాదయాత్ర గొప్ప విషయం. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న షర్మిల వాటి పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.’’
- జయలక్ష్మి, ఉపాధ్యాయురాలు, చిత్రకారిణి

గర్వకారణం..

‘‘తండ్రి మరణానంతరం ప్రభుత్వం అన్నయ్యను అన్యాయంగా జైలు పాలు చేయడంతో.. ప్రభుత్వ విధానాలను ప్రజల ముందుంచడానికి షర్మిల చేస్తున్న పాదయాత్ర గర్వకారణం. చిన్న వయసులో ప్రజల వద్దకు వెళ్లి, సమస్యలను తెలుసుకోవడం గొప్ప విషయం.’’
- రెహనాఖాన్, హైకోర్టు న్యాయవాది
Share this article :

0 comments: