వడ్డీ ‘లేని రుణాలు’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వడ్డీ ‘లేని రుణాలు’

వడ్డీ ‘లేని రుణాలు’

Written By news on Monday, July 22, 2013 | 7/22/2013

పావలా వడ్డీకీ పాతర .చిక్కుల్లో స్వయం సహాయక సంఘాలు
పావలా వడ్డీ రుణాలు.. అక్కా, చెల్లెళ్లంతా ఆర్థిక స్వాలంబన సాధించాలన్న లక్ష్యంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకమిది! ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయాలని ఈ పథకం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వయం సహాయక మహిళలకు పావలా వడ్డీకే వేల కోట్ల రుణాలిచ్చారు. ఏటికేడు పెరిగిన ఈ రుణాలతో మహిళా సంఘాల సభ్యులు.. చిన్నాచితక వ్యాపారాలు మొదలుపెట్టి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. అవసరాలకు డబ్బు అందడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే తిప్పలు, అధిక వడ్డీ రేట్ల బాధలు తప్పాయి. కానీ వైఎస్ మరణం తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. మహిళా సంఘాలకు రుణాల మంజూరు గణనీయంగా తగ్గింది. పావలా వడ్డీ రుణాలను వడ్డీ లేని రుణాలుగా మారుస్తున్నట్టు ప్రకటించిన కిరణ్ సర్కారు.. ప్రచారార్భాటం తప్ప చేతల్లో చూపలేకపోయింది. కొత్త రుణాల సంగతి అటుంచితే.. తీసుకున్న రుణానికి సక్రమంగా వడ్డీ చె ల్లించినా వడ్డీ రాయితీ ఇవ్వడం లేదు. ఫలితంగా మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. వైఎస్ ఉన్నప్పుటి, ప్రస్తుత పరిస్థితులకు ఎంత తేడా ఉందో సీఎం సొంత జిల్లా చిత్తూరులో ఈ రెండు ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది. - సాక్షి, హైదరాబాద్

వైఎస్ ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాం..
ఈమె పేరు ఎం లక్ష్మీదేవమ్మ. స్వస్థలం తిరుపతి. ఈమె సారథ్యంలో ఓం లక్ష్మి మహిళా గ్రూపు ఏర్పాటైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ గ్రూపునకు పావలా వడ్డీ రుణంగా రూ. 3 లక్షలు పైగా ఇచ్చారు. రుణ మొత్తంతో గ్రూపు సభ్యులంతా వ్యాపారాలు మొదలుపెట్టారు. వీరిలో లక్ష్మీదేవమ్మ చీరల వ్యాపారం మొదలు పెట్టింది. వచ్చిన ఆదాయంతో కుటుంబం బాగానే గడిచేది. బిడ్డలందరికీ పెళ్లి చేసింది. చీరల వ్యాపారం ఆదాయం.. కొడుకులు పనులు చేసి సంపాదించిన సొమ్ముతో ఇంటి నిర్వహణ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోయేది. కూతురు, కోడళ్లను కూడా గ్రూపుల్లో చేర్పించింది. వీరు కూడా రుణ సాయంతో తమ కాళ్ల మీద తాము నిలబడేస్థాయికి ఎదిగారు. ‘‘వైఎస్ బతికున్నప్పుడు నా యాపారం ద్వారా వచ్చే డబ్బులతో సంతోషంగా ఉన్నాం. నేను, నా భర్త వైద్యానికి ఖర్చులు చేసుకుంటూ బాగోగులు చూసుకునేవారం. వైఎస్ చనిపోయాక మాకు కష్టాలు మొదలయ్యాయి. గతేడాది పావలా వడ్డీకింద ఒక్కొక్కరు రూ.16 వేలు తీసుకున్నాం. డబ్బులంతా చెల్లించేశాం. మా గ్రూపునకు రూ.24 వేలు వడ్డీ రావాలి. ఇంతవరకు రూపాయి రాలేదు’’ అని లక్ష్మీదేవమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.


లోను దొరక్క సంఘం నుంచి బయటకు వచ్చేశా..
‘‘నాపేరు మునిరాజమ్మ. తిరుపతిలోని తాతయ్యగుంటలో నివాసం. పాఠశాలలో స్వీపరుగా పనిచేస్తున్నాను. భర్త, ఇద్దరు కొడుకులు, కూతురు. ఒక కొడుకు చనిపోయాడు. నా భర్త కూలి పనికెళ్లేవాడు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. స్వీపరుగా పనిచేసినందుకు నాకు నెలకు రూ.2,600 వస్తుంది. ఇది చాలకపోవడంతో కొన్ని ఇళ్లలో పాచిపని చేస్తున్నాను. కొడుకు పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. ఇలా సంపాదించిన డబ్బుతో కూతురికి పెళ్లిచేశాను. పదేళ్లుగా డ్వాక్రా సంఘంలో ఉండేదాన్ని. కానీ ఇటీవల లోన్లు ఇవ్వడం లేదు. తిరిగి తిరిగి కాళ్లు నొప్పులొచ్చాయి, కానీ డబ్బులు ఇవ్వలేదు. లోను కావాలని అందర్నీ అడుక్కున్నాను. ఎంత బతిమలాడినా లోను ఇవ్వలేదు. లోన్లు ఇవ్వనప్పుడు సంఘంలో ఉండి ఏం ప్రయోజనమని బయటకు వచ్చేశా. నా కూతురు అరుణ కూడా డ్వాక్రా సంఘంలో ఉండేది. కూతురికీ లోను ఇవ్వలేదు. దీంతో కూతురు కూడా నిలిచిపోయింది. ఇంతకుముందు నెలనెలా కట్టే పొదుపులో నుంచి కొంత మొత్తాన్ని లోనుగా ఇచ్చేవారు. పావలా వడ్డీ కాబట్టి పెద్ద ఇబ్బంది పడలేదు. ఇప్పుడైతే లోను కావాలంటే నరకం కనిపిస్తోంది’’
Share this article :

0 comments: