రెండు ప్రసవాల్లో ఎందరు పిల్లలున్నా పోటీకి అర్హులే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రెండు ప్రసవాల్లో ఎందరు పిల్లలున్నా పోటీకి అర్హులే

రెండు ప్రసవాల్లో ఎందరు పిల్లలున్నా పోటీకి అర్హులే

Written By news on Friday, July 12, 2013 | 7/12/2013

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదనే నిబంధన కొందరికే వర్తించనుంది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి తొలి ప్రసవంలో ఒక బిడ్డ పుట్టిన వారికి రెండో ప్రసవంలో ఇద్దరు, ముగ్గురు పిల్లలు పుట్టినా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే భాగ్యం లభించనుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇద్దరు పిల్లలు మించి ఉన్నవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు.

అయితే, రెండో ప్రసవంలో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే అందులో ఆ పిల్లల తల్లిదండ్రుల తప్పిదం లేదని, అందువల్ల ఇలాంటివారిని ఎన్నికల్లో పోటీకి అర్హులుగా పరిగణించాలని గతంలో బలగ సావిత్రమ్మ వర్సెస్ సత్యనారాయణ, ఇతరులు కేసులో హైకోర్టు స్పష్టం చేసింది. దీని ప్రకారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. పంచాయతీరాజ్ శాఖలో ఇంకా చట్ట సవరణ చేయలేదు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం చట్టసవరణ చేసే సమయం లేనందున హైకోర్టు తీర్పును జిల్లా స్థాయిలో కలెక్టర్లే అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా రెండు ప్రసవాల్లో ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్న వారు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించినట్లయింది.


ముగ్గురు పిల్లలున్నా ‘పంచాయతీ’కి అనుమతి

 పోరాడి సాధించుకున్న రాములు
- కు.ని. ఆపరేషన్ విఫలమై మూడో బిడ్డ పుట్టిందని వినతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేటకు చెందిన టి.రాములు ముగ్గురు పిల్లలున్నా సర్పంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ ప్రభుత్వంపై పోరాడి పంతం నెగ్గించుకున్నారు. పూర్వాపరాలిలా.. రాములు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన భార్య శాంతకుమారికి ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్ చేయిం చారు. ఈ ఆపరేషన్ విఫలం కావడం వల్ల ఆమె మూడో బిడ్డను కనింది. ఇందులో తమ తప్పిదం లేదని, ఇది సర్కారు ఆస్పత్రి వైఫల్యం కనుక ‘ఇద్దరు పిల్లల’ నిబంధన నుంచి తనకు మినహాయింపు ఇచ్చి సర్పంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అన్ని పత్రాలు పరిశీలించిన ప్రభుత్వం ఆయనకు ఇద్దరు పిల్లల నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చి ముగ్గురు పిల్లలున్నా పోటీ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు రాములును ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వి. నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Share this article :

0 comments: