బాబుది విజన్-2020 కాదు.. డివిజన్ 420 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుది విజన్-2020 కాదు.. డివిజన్ 420

బాబుది విజన్-2020 కాదు.. డివిజన్ 420

Written By news on Sunday, August 11, 2013 | 8/11/2013

బాబుది విజన్-2020 కాదు.. డివిజన్ 420
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రకటన వెలువడిన పది రోజుల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుకు సీమాంధ్ర ప్రజలు గుర్తుకొచ్చారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన మాదిరిగానే చంద్రబాబు... మరోసారి సీమాంధ్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. చంద్రబాబుది విజన్ 2020 కాదని, ఆయనది డివిజన్ 420 అని నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజనపై ప్రకటన వెలువడిన పది రోజుల తర్వాత చంద్రబాబు తీరుబడిగా ప్రధానికి లేఖ రాయడం చూస్తే ఆయన ఎంతగా నటిస్తున్నారో ప్రతీ ఒక్కరూ గమనిస్తున్నారని చెప్పారు. విభజనకు సంబంధించి నెల రోజులుగా లోకం కోడై కూస్తున్నా.. నిత్యం కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్న మీకు, వాస్తవాలు అన్నీ తెలిసి కూడా ఎందుకు మిన్నకుండిపోయారని బాబును ప్రశ్నించారు. ఏ ఒక్కరోజూ సీమాంధ్ర ప్రజల మనోభావాలు గుర్తుకురాలేదా? అని నిలదీశారు. చంద్రబాబును, కాంగ్రెస్‌ను నమ్ముకొని దగాపడ్డామని ఆవేదనతో సీమాంధ్ర ప్రజానీకం మొత్తం స్వచ్ఛందంగా ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టడాన్ని చూసి ఇరువురు నేతలు భయపడుతున్నారని చెప్పారు. అందుకే చంద్రబాబు రెండో కన్ను తెరిచి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
 
 గతంలో ఇచ్చిన లేఖలేంటి?
 సీట్లు, ఓట్ల కోసం చంద్రబాబు రోజుకొక మాట, పూటకొక వైఖరి అవలంబించడం పరిపాటిగా మారిందని పద్మ దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలంటూ 2008, 2012లో కేంద్రానికి ఒక బ్లాంక్‌చెక్ ఇచ్చిన మాదిరిగా లేఖలు అందజేసి, విభజించే వరకు పదే పదే తరిమిన విషయం ప్రజలకు గుర్తుందన్నారు. తీరా నిర్ణయం వెలువడిన తర్వాత ఊసరవెల్లిలా రంగులు మార్చడం ఆయనకే చెల్లుబాటవుతుందని విమర్శించారు. ‘‘2008లో కేంద్రానికి లేఖ రాసిన తర్వాత రాష్ట్ర విభజనకు పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పి 2009లో టీఆర్‌ఎస్‌తో జతకట్టి మహాకూటమి ఏర్పాటు చేసి పోటీచేశారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో విభజనకు మద్దతు పలికారు. 2009 డిసెంబర్‌లో చిదంబరం ప్రకటన చేసిన వెంటనే ‘యూ’ టర్న్ తీసుకొని ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించారు. తర్వాత మళ్లీ రాజకీయత లబ్ధి కోసం తెలంగాణలో ఓట్లు, సీట్ల కోసం 2012లో కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు నిర్ణయం వెలువడిన తర్వాత బాబు ఇంటికి ఏపీ ఎన్జీవో ఉద్యోగులు వెళ్లినప్పుడు ఏం మాట్లాడారు? ‘తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చాను. వెనక్కి తగ్గేది లేదు.
 
 అయినా మీరెందుకు భయపడుతున్నారు? మన వాళ్లు బెంగళూరు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవడం లేదా? హైదరాబాద్ విషయంలో భయమెందుకు?’ అంటూ మందలించి పంపిన విషయం ప్రజలకు గుర్తుంది. అలాంటి మనిషికి తీరా పదిరోజుల తర్వాత సీమాంధ్ర ప్రజల భవిష్యత్తు, జలవనరులు గుర్తుకొచ్చాయా? కాంగ్రెస్ పార్టీ సీట్లు, ఓట్ల కోసమే రాష్ట్రాన్ని విభజిస్తుందని, రాహుల్‌ను ప్రధాని చేయడం కోసమే అనే విషయాన్ని ఇన్నాళ్లకు గ్రహించారా?’’ అని ప్రశ్నించారు. చంద్రబాబు, కాంగ్రెస్ నేతలు కలిసి రాష్ట్ర ప్రజలను మరోసారి మోసగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్, టీడీపీలకు లేదన్నారు. ఆ రెండు పార్టీల ధోరణి చూస్తే ‘హత్యచేసిన హంతకుడే శవం మీదపడి ఏడ్చినట్లుంది’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రవిభజన ద్రోహిగా, మోసగాడిలా చంద్రబాబు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పద్మ దుయ్యబట్టారు.
Share this article :

0 comments: