ఘన విజయం సాధిస్తాం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఘన విజయం సాధిస్తాం..

ఘన విజయం సాధిస్తాం..

Written By news on Wednesday, August 14, 2013 | 8/14/2013

నిజామాబాద్ : తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బాజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల మారిన రాజకీయ పరిణామాలతో పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అపోహలను దూరం చేశారు. రానున్న రోజుల్లో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ విషయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు అవలంబిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చిన కాంగ్రెస్ మరోవైపు సీమాంధ్రలో ధర్నాలు, రాస్తారోకోలు చేయిస్తోందని విమర్శించారు. చంద్రబాబు కూడా తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే యూ టర్న్ తీసుకున్నారని ఆరో పించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూనే.. సీమాంధ్రలోని ఆ పార్టీ నేతలను ఉసిగొల్పుతున్నారని బాబుపై విమర్శలు గుప్పించారు. ప్రజలను మోసం చేస్తున్న ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
 
అతిగా స్పందిస్తున్నారు..
తమ పార్టీ పట్ల కొన్ని పత్రికలు, చానళ్లు అతిగా స్పందిస్తున్నాయని బాజిరెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడే ఆ పార్టీని వీడిపోయినా పెద్దగా పట్టించుకోని కొన్ని పత్రికలు.. తమ పార్టీ నుంచి ఒకరిద్దరు నేతలే వెళ్లిపోయినా అత్యుత్సాహం చూపుతూ కథనాలు రాస్తున్నాయని, ఇందులో ఆంతర్యమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో తమ పార్టీని బలహీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పదవులు, స్వప్రయోజనాలు ఆశించి వచ్చిన ఒకరిద్దరు నేతలే పార్టీ మారుతున్నారన్నారు. వారికి ఆయా పార్టీల్లోనూ ఆశించిన స్థానం దక్కదని పేర్కొన్నారు. ఒకరిద్దరు నేతలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీ బలహీనపడబోదన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారన్నారు.
 
ఘన విజయం సాధిస్తాం..
‘ఇందిరాగాంధీపైనా కేసులు బనాయించి జైలులో పెట్టారు.. కానీ ఆమె బయటకు రాగానే ఎన్నికల్లో గెలిచి దేశాన్ని పాలించారు. అలాగే మహానేత వైఎస్ అకాల మరణం తర్వాత తమ పార్టీ అధినేత జగన్‌ను కూడా తప్పుడు కేసులతో జైలులో పెట్టారు. ఆయన బయటకు వచ్చి ఘన విజయం సాధిస్తారు’ అని బాజిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమవేశంలో జుక్కల్ నియోజకవర్గ సమన్వయకర్త నాయుడు ప్రకాశ్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ సులోచన, యువజన విభాగం రాష్ట్ర నాయకుడు బాజిరెడ్డి జగన్, జిల్లా కన్వీనర్ కంఠం ధర్మరాజు, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ పంచరెడ్డి చరణ్, అధికార ప్రతినిధులు రఫీక్‌ఖాన్, విజయలక్ష్మి, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, నాయకులు గంగాధర్, అనిల్ కులకర్ణి, పండిత్‌ప్రేమ్, రమాకాంత్, అరుణజ్యోతి, సునీత, భారతి, ఇస్మాయిల్, ప్రకాశ్, కె.నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: