కృష్ణమ్మపై కేంద్రం పెత్తనం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కృష్ణమ్మపై కేంద్రం పెత్తనం?

కృష్ణమ్మపై కేంద్రం పెత్తనం?

Written By news on Saturday, August 10, 2013 | 8/10/2013

కృష్ణమ్మపై కేంద్రం పెత్తనం?

రాష్ట్ర విభజనతో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులు రెండు ప్రాంతాల అధీనంలో లేకుండా.. కేంద్రం కర్రపెత్తనం కిందకు వెళతాయా? ఇప్పటివరకూ అంతర్రాష్ట్ర జల వివాదాల పరిణామాలను పరిశీలిస్తే అవుననే స్పష్టమవుతోంది. రెండు రాష్ట్రాల నడుమ నీటి ప్రాజెక్టుల విషయంలో వివాదం తలెత్తితే.. ఆ ప్రాజెక్టులపై ఆ రెండు రాష్ట్రాలూ పెత్తనం వదిలేయాల్సిందే. జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఓ బోర్డును ఏర్పాటు చేయటం షరామామూలుగా మారింది. ఫలితంగా సదరు ప్రాజెక్టుపై ఆధారపడ్డ రెండు రాష్ట్రాలకూ ఎడతెగని ఇబ్బందులు తప్పవని సాగునీటి నిపుణులు చెప్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా నది జలాల వివాదం రోజు రోజుకు ముదురుతున్న నేపథ్యంలో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందనే దిశగా ఇప్పుడు విసృ్తత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిధిలో నీటి పంపకాలు సంక్లిష్టంగా మారితే కేంద్రం జోక్యం చేసుకుని ప్రత్యేక అథారిటీ (బోర్డు) ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ నదీ జలాల విషయంలో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలతో తలెత్తిన వివాదాలు ఏళ్ల తరబడి కొనసాగుతున్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనతో ఏర్పడే కొత్త రాష్ట్రాలతో ఈ వివాదాలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 
 
 శ్రీశైలం, సాగర్, జూరాలకు ప్రత్యేక బోర్డులు!
 కృష్ణా నదిపై ఇప్పటికే ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లోని ఆయకట్టుకు నీరు అందుతోంది. రాష్ట్రం విడిపోతే.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా మారతాయి. దాంతో వీటి నిర్వహణకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటయ్యే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అదే జరిగితే ఎగువ ప్రాంతంలో ఉన్న జూరాల కూడా బోర్డు పరిధిలోకే వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. జూరాల నుంచే శ్రీశైలంలోకి నీరు విడుదల కావాల్సి ఉండటం.. అలాగే దీనిని ఆధారం చేసుకుని నెట్టెంపాడు (నీటి కేటాయింపు లేదు) చేపట్టటంతో ఈ ప్రాజెక్టును కూడా బోర్డు పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ బోర్డులను స్వయం ప్రతిపత్తితో కానీ, కేంద్ర పర్యవేక్షణలో ఉండే విధంగా కానీ రూపొందించే అవకాశం ఉంది. అంటే ఈ ప్రాజెక్టులపై కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకు ఎటువంటి అధికారం ఉండే అవకాశం లేదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేంద్రమే పెత్తనం చేస్తుంది. 
 
 తుంగభద్రపై బోర్డున్నా తీరని వెతలు: ప్రస్తుతం మన రాష్ట్రంతోపాటు కర్ణాటకకు సాగునీరు అందిస్తున్న తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రత్యేక బోర్డు ఉంది. ప్రతి ఏటా సీజన్‌కు ముందు బోర్డు సమావేశమై నీటి విడుదలపై షెడ్యూలును ప్రకటిస్తుంది. ఈ షెడ్యూల్ ప్రకారమే నీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే పలు సందర్భాల్లో మనకు న్యాయంగా రావాల్సిన నీరు కూడా రావటం లేదు. ఆ నీటి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల్లో ప్రాజెక్టుపై ఆధారపడ్డ రైతులు తీవ్రంగా నష్టం పోవాల్సి వస్తోంది. ప్రాజెక్టుకు దగ్గరలోని కర్ణాటక ఆయకట్టుకు నీరు అందుతుండగా.. మన రాష్ట్రంలోని పంటలు ఎండిపోతున్నాయి. ఒక్కోసారి ఒకటి, రెండు టీఎంసీల కోసం కూడా తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితులున్నాయి. గత రబీ సీజన్‌లో పంటల రక్షణ కోసం 3 టీఎంసీల నీటి విడుదల కోసం కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు కేంద్రాన్ని కూడా జోక్యం చేసుకోవాల్సిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సి వచ్చింది.
 
Share this article :

0 comments: