తెలంగాణలో ఓట్లడిగే హక్కు మాకే ఉంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణలో ఓట్లడిగే హక్కు మాకే ఉంది

తెలంగాణలో ఓట్లడిగే హక్కు మాకే ఉంది

Written By news on Wednesday, August 7, 2013 | 8/07/2013

తెలంగాణలో ఓట్లడిగే హక్కు మాకే ఉంది: వైఎస్ విజయమ్మ
వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టీకరణ
వైఎస్సార్ హయాంలోనే ప్రాంతాలకుఅతీతంగా సమగ్రాభివృద్ధి జరిగింది
తెలంగాణలో అపారంగా వైఎస్సార్ అభిమానులున్నారు..
విభజనలో కాంగ్రెస్, టీడీపీలది ఓట్ల రాజకీయమే
తన అభిప్రాయం చెప్పకుండానే కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయం ప్రకటించింది
చంద్రబాబు పరిహారం కావాలంటారు.. ఆ పార్టీ ఎంపీలేమో ఆందోళన చేస్తారు
 కేంద్రం తండ్రిలా సమన్యాయం పాటించాలన్నదే మా డిమాండ్


 సాక్షి ప్రతినిధి, కడప: తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ స్పష్టంచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ రెండు ప్రాంతాలలో ఉంటుందనే ఉద్దేశంతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో కొట్టుకుపోయినా తెలంగాణలో ఉంటుందనే ధీమాతో ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
 
 అయితే ఒక్క వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఇరు ప్రాంతాల్లో ఓట్లు అడిగే హక్కు ఉందని పేర్కొన్నారు. అందుకు రాష్ర్టంలో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన, ఆయన చేసిన అభివృద్ధి పనులే కారణమన్నారు. ఇరు ప్రాంతాల్లో మహానేతను ప్రేమించేవారు, ఆరాధించేవారున్నారని తెలిపారు. తెలంగాణలో కూడా వైఎస్సార్ సీపీ ఉంటుందని, అక్కడ కూడా తమ పార్టీని ఆదరించే అభిమానులు మెండుగా ఉన్నారని విజయమ్మ స్పష్టం చేశారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని తమ నివాసంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
 తెలంగాణలో ఓట్లడిగే హక్కు మాకే ఉంది: విజయమ్మ
 మహానేత హయాంలోనే సమన్యాయం..
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రాంతాలకు అతీతంగా సమగ్రాభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించింద ని విజయమ్మ అన్నారు. అప్పట్లో కూడా రాష్ట్ర విభజన ఉద్యమం తలెత్తడంతో ఇచ్చేది పెట్టేది కేంద్ర ప్రభుత్వమేనని మహానేత స్పష్టం చేశారన్నారు. విభజన ఉద్యమాలను దృష్టిలో ఉంచుకుని ప్రాంతాలకు అతీతంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడానికి ప్రయత్నించారని, అందులో భాగంగానే అన్ని ప్రాంతాలలో ఏక కాలంలో 86 సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడానికి జలయజ్ఞం మొదలుపెట్టారని గుర్తుచేశారు.
 
  ‘‘జెన్‌కోను బలోపేతం చేసి మూడు వేల మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులను రూపొందించే ప్రయత్నం చేశారు. విద్య, వైద్య, మౌలిక సదుపాయాలతోపాటు జిల్లాకొక యూనివర్శిటీ, జేఎన్‌టీయూ, రిమ్స్ వైద్య కళాశాలలు, బిట్స్ పిలానీ, ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశారు’’ అని వివరించారు. ఇవన్నీ దూరదృష్టితో దివంగత నేత వైఎస్‌ఆర్ చేపట్టిన చర్యలేనని తెలిపారు. విడిపోవాల్సి వస్తే అన్ని ప్రాంతాలూ బాగుండాలనే మహానేత ఆశించారన్నారు. హైదరాబాద్ నగరాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ మెట్రో రైలు, ఫ్లై ఓవర్లు, కృష్ణా జలాలు ఇలా ఎన్నో పథకాలు ఆలోచన చేశారని తెలిపారు. సమదృష్టి, సమన్యాయం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాత్రమే సాధ్యమైందని చెప్పారు.
 
 ఏకపక్ష నిర్ణయమెలా తీసుకుంటారు?
 ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలెన్నుకున్న పార్టీలున్నాయి. ఇక్కడి పార్టీలను పిలిచి ‘కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇది.. మేం ఇలా చేయాలనుకుంటున్నాం.. ఈ విధంగా ఈ పక్క వారికి న్యాయం చేస్తాం.. ఇలా ఈ పక్కవారికి న్యాయం చేస్తాం’ అని చెప్పకుండాఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం బాధగా ఉంది’’ అని విజయమ్మ అన్నారు. ‘‘తెలుగువాళ్లందరికీ సమ న్యాయం కావాలన్నదే వైఎస్సార్ సీపీ డిమాండ్. సమ న్యాయం చేయలేకుంటే.. విభజించే బాధ్యత, అధికారం మీరెలా తీసుకుంటారు?’’ అని ఆమె కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.
 
 విభజన విషయంలో దొందూ...దొందే...
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండు కూడా ఓట్లు, సీట్లు కోసం రాజకీయం చేస్తున్నాయని విజయమ్మ ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇస్తామని చెబుతోంది. మరోవైపు వాళ్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. పార్లమెంటులో బిల్లు ఆగిపోతుందని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు.
 
  హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఒకరు, కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని, దేశంలోనే రెండో రాజధానిగా ఉంటుందని మరొకరు చెబుతున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చూస్తే 2008లోనే తెలంగాణకు అనుకూలమని లేఖ రాసిచ్చారు.. ఈ రోజేమో కొత్త రాజధాని కట్టడానికి రూ.4, 5 లక్షల కోట్లు కావాలని అడుగుతున్నారు. మరోవైపు ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు. అలాగే పార్లమెంటు సమావేశాలనూ అడ్డుకుంటున్నారు. ఈ దొంగ నాటకాలన్నీ ఎవర్ని మోసం చేయడానికి?’’ అని ఆమె ప్రశ్నించారు.
 
 మేం ఎప్పుడూ ఒకే మాట చెప్పాం..
 వైఎస్సార్‌సీపీ మాత్రమే మొదటి నుంచి ఒకే అభిప్రాయం చెబుతోందన్నారు. తండ్రివలె అన్నీ ప్రాంతాలను సమన్యాయంతో చూడాలని భావిస్తోందన్నారు. ‘‘మేం మొదట్నుంచీ చెబుతున్నదొక్కటే.. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాలని కోరుతున్నాం. సమైక్యంగా ఉంచండి  లేదంటే విభజన చేయాల్సి వస్తే ఒక తండ్రిలా ఆలోచించి విభజించాలని కోరాం. ప్లీనరీలోను, అఖిలపక్షంలోనూ ఇదే చెప్పాం. మొదటిసారి చర్చలు జరిగినపుడుగాని, శ్రీకృష్ణ కమిటీ చర్చలు జరిగేటప్పడికిగాని వైఎస్సార్ సీపీ పుట్టలేదు. హోం మంత్రి షిండే నేతృత్వంలో జరిగిన అఖిలపక్షానికి మాత్రమే వైఎస్సార్ సీపీ హాజరైంది. అప్పుడు అందరికీ తండ్రిలా ఆలోచించి న్యాయం చేయాలని కోరాం. ప్లీనరీలోను, అఖిలపక్షంలోనూ ఇదే చెప్పాం. ఇప్పుడు చెప్తున్నదీ అదే’’ అని స్పష్టంచేశారు.
 
 రోజుకొక చిచ్చు పెడుతున్నారు
 ‘‘ఈ రోజు కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొంటోంది. ఈ రోజు సాగునీరు, తాగునీరు, విద్యుత్, పరిశ్రమలు.. వీటిలో ఏ విధమైన హామీలూ ఇవ్వడంలేదు. పైగా రోజుకో చిచ్చు పెడుతున్నారు. ఒక రోజు రాజధాని గుంటూరంటారు.. మరో రోజు ఒంగోలు, కర్నూలు అంటున్నారు.. మరొకరు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తుందంటారు.. ఇలా రోజుకొక రకంగా మిగతా ప్రాంతాల్లో చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ చూస్తోంది’’ అని విజయమ్మ మండిపడ్డారు. ‘‘ఉద్యోగులు ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని, ఆప్షన్ లేదని ఈ రోజు కేసీఆర్ అనగలిగారు అంటే..దానికి కాంగ్రెస్సే కారణం. అన్ని పార్టీలతో మాట్లాడి, ఫలానా రకంగా న్యాయం చేస్తామని చెప్పి ఉంటే ఆయన ఆ మాట అనగలిగేవారు కాదు. ఇంకా ఏమీ కాకుండానే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారు.
 
 ఒక వేళ నిజంగా తెలంగాణ వస్తే సీమాంధ్రులను హైదరాబాద్‌లో ఉండనిస్తారన్న నమ్మకమేంటి?’’ అని ప్రశ్నించారు. ‘‘‘ఈ రోజు సీమాంధ్ర అనేకాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గ్రామం నుంచీ కనీసం పది మంది ఇక్కడుంటున్నారు. ఉద్యోగాలు, చదువుల కోసం, విదేశాలకు పోవడం కోసం ఇలా ప్రతి గ్రామం నుంచి కనీసం పది మంది హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇంత మంది జీవితాలతో ముడిపడి ఉన్న హైదరాబాద్ విషయంలో స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తోంది’’ అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: