అబద్ధాలు, అసత్యాలను ఎన్నాళ్లని ప్రచారం చేస్తారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అబద్ధాలు, అసత్యాలను ఎన్నాళ్లని ప్రచారం చేస్తారు?

అబద్ధాలు, అసత్యాలను ఎన్నాళ్లని ప్రచారం చేస్తారు?

Written By news on Wednesday, August 21, 2013 | 8/21/2013

అబద్ధాలు, అసత్యాలను ఎన్నాళ్లని ప్రచారం చేస్తారు?
హైదరాబాద్‌ : నిన్న ఒక ఛానల్, కొందరు టీడీపీ నాయకులు జగన్ జైలులో ఫోన్ వాడుతున్నాడని నానా హడావిడి చేశారు. జైలులో ఫోను సదుపాయం వచ్చి దాదాపు 2 నెలలు అవుతున్నా జగన్ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ సదుపాయాన్ని వినియోగించుకోలేదు. గత 14 నెలల 20 రోజులుగా జగన్ ఫోన్ అనే వస్తువు (అది లాండ్ ఫోన్ కావచ్చు, సెల్‌ఫోన్ కావచ్చు)ను ముట్టను కూడా ముట్టలేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ఆరోపణలు చేస్తున్న మీరు చెప్పగలరా... నేను చెప్పినంత ఖరాఖండిగా!  జగన్ ఫోన్‌లో మాట్లాడినట్టు మీరు ఎటువంటి రుజువులు తెచ్చినా నేను మరోమాట మాట్లాడను. కానీ, మీరు రుజువు చేయలేకపోతే మీతో అబద్ధాలను / అసత్యాలను ప్రచారం చేయిస్తున్న మీ పార్టీ నాయకుడు రాజకీయాలు మానుకుంటాడా? అబద్ధాలను / అసత్యాలను ప్రచారం చేస్తున్న ఛానల్ మూసుకుంటారా?

అయినా నిజాయితీతో రాజకీయాలు చేసే జగన్ లాంటి వారికి దొంగ ఫోన్‌లు చేయవలసిన ఖర్మ పట్టలేదు. చీకటి ఒప్పందాలు, తెరచాటు వ్యవహారాలు, రెండుకళ్ల సిద్ధాంతాలు గల చంద్రబాబు లాంటి వారికే అది అవసరం. ఎఫ్‌డీఐలో వోటు వేయించడానికి, చిన్న వ్యాపారుల పొట్టకొట్టి కాంగ్రెస్‌ను గట్టెక్కించడానికి అహ్మద్ పటేల్ గారితో మాట్లాడుకోవాలన్నా; అవిశ్వాసంలో గట్టెక్కిస్తామని కిరణ్‌గారితో మాట్లాడుకోవాలన్నా; చీకటిలో చిదంబరం గారితో కలవడానికి అపాయింట్‌మెంట్లు తీసుకోవాలన్నా చంద్రబాబుగారికే దొంగఫోన్లు అవసరం!

యనమల రామకృష్ణుడు గారయితే గత 15 నెలల్లో ప్రజాసమస్యల మీద ఎన్ని మాటలు మాట్లాడారో, ఎన్ని ఉత్తరాలు రాశారో; జగన్ జైలు జీవితం గురించి ఎన్ని మాటలు మాట్లాడారో తనను తానే ప్రశ్నించుకోవడం మంచిది. జగన్ గురించి మాట్లాడడానికే ఆయనకు చంద్రబాబుగారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ప్రజలు అనుకుంటున్నారు. అయ్యా రామకృష్ణుడు గారూ, జగన్ వారానికి ఆరుగురిని మాత్రమే కలుస్తున్నాడు. మీరు భయపడుతున్నట్టు ఆయన ఫోన్ వాడడం లేదు. దయచేసి మీరు ఇప్పుడైనా ప్రజా సమస్యల మీద స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అయినా రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే ఈ నాయకులంతా బయట వుండి ఏం చేస్తున్నారు? చంద్రబాబుగారు ఏం చేస్తున్నారు? కిరణ్‌కుమార్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? జైలులో ఉన్నా ఫోన్‌లో ఎవ్వరితో మాట్లాడకున్నా, వారానికి ఆరుగురినే కలుస్తూ వున్నా, జులై 30న తెలంగాణ మీద ప్రకటన రాకముందే జులై 25నే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాడు. రాజీనామాల కంటే ముందే హోమ్ మినిస్టర్ షిండే గారికి పార్టీ తరఫున లెటర్ కూడా రాయించాడు. సమస్యలన్నిటినీ పరిష్కరించాలని తర్వాత కూడా లెటర్ రాయించాడు. తెలంగాణ ప్రకటన వస్తూనే తను రాజీనామా చేయడంతోపాటు తన తల్లితోనూ చేయించాడు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆవేదన చెందుతూ నిద్ర పట్టడం లేదన్నాడు. ఆమరణ నిరాహారదీక్ష కూడా చేస్తానన్నాడు. జగన్ అంతగా బాధపడుతూ వుంటే - 50 ఏళ్లు పైబడిన మా అత్తగారి మాతృహృదయం తల్లడిల్లిపోయింది... జగన్‌ను వద్దని వారించింది. ఈరోజు తన కొడుకు ఇన్ని కష్టాలు, బాధలలో వుండి కూడా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడని, ఆ కొడుకు తరఫున ప్రజలతో నిలబడడం తన కర్తవ్యమని ఈరోజు ఆ తల్లి ముందుకు వచ్చింది.

ఇన్ని కష్టాల మధ్య వున్నా ప్రజా సమస్యలపై జగన్ చూపించిన చొరవ, జగన్ తీసుకున్న నిర్ణయాలు మరి ఏ నాయకుడూ తీసుకోలేదు. ఒక ప్రాంతంలో ఓట్లు, సీట్లకోసం కాంగ్రెస్, టీడీపీలు మరొక ప్రాంతానికి అన్యాయం చేస్తూ వుంటే, జగన్ నాయకత్వంలోని వైయస్సార్‌సీపీ తప్ప మరి ఏ పార్టీ నోరు మెదపలేదు.

 2-3 నెలలుగా ఢిల్లీ వెళ్లి వస్తూ, అన్నీ తెలిసిన కిరణ్‌కుమార్‌రెడ్డి గారు తెలంగాణ ప్రకటన తరువాత 3 రోజులకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మొట్టమొదటి మాటలు - రాజీవ్‌గాంధి, ఇందిరాగాంధి విగ్రహాలు పగలగొట్టకండి అని! ఆ తరువాత 10 రోజులకు - రాష్ట్ర ప్రజలందరు తమ సమస్యల గురించి పోరాటం చేస్తూ వుంటే, ఆయనేదో తనకు తెలంగాణ ప్రకటన అప్పుడే కొత్తగా వినబడినట్టు మాట్లాడారు. ఇక చంద్రబాబుగారేమో మొదటిరోజు కొత్త రాజధానికి డబ్బులు అన్నారు... తరువాత తన దగ్గరకు వచ్చిన జెఏసీ వాళ్లతో నిర్దయగా ‘నేను లేఖను ఉపసంహరించుకోలేను’ అన్నారు. ఇదిలా వుండగా ఆయన పార్టీ ఎంపీలు రెండుకళ్ల సిద్ధాంతం పాటిస్తూ ప్రజల ముందు కొత్త నాటకాలు ఆడుతున్నారు.

 ఇచ్చిన మాటకు, నమ్మిన దానికి కట్టుబడి నడిచే వైయస్సార్ వారసత్వం జగన్‌ది! ప్రజలకోసం ఎందాకైనా ముందుకుసాగే వైయస్సార్ వారసత్వం జగన్‌ది! అన్ని ప్రాంతాల ప్రజల క్షేమం, సంక్షేమం కోరే వైయస్సార్ వారసత్వం జగన్‌ది! నిజాయితీ, నిబద్ధత, పట్టుదల, విశ్వసనీయత వంటి లక్షణాలు గల వారసత్వం జగన్‌ది!

 జగన్ మీద అబద్ధాలు, అసత్యాలు మాట్లాడే వారికి బైబిల్‌లో ఒక మాట వుంది - ‘‘అబద్ధములాడువాడు తప్పించుకొనడు... అబద్ధములాడువాడు నశించును’’ అని! ఒక్క బైబిల్‌లోనే కాదు... ప్రతి మతమూ అదే చెబుతుందనుకుంటా. అలాగే ఇన్ని కష్టాలుపడుతున్న మన రాష్ట్ర ప్రజల గురించి, జగన్ గురించి దేవుడు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడని, మన రాష్ట్రానికి సంతోషం, సమాధానం త్వరలోనే కలుగజేస్తాడనే నాకు గట్టి నమ్మకం ఉంది. త్వరలోనే మనని, మన రాష్ట్రాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను.

 - వైఎస్ భారతి, w/o వైఎస్ జగన్
Share this article :

0 comments: