సమరదీక్ష శిబిరం వద్దకు తరలివచ్చిన ప్రజలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమరదీక్ష శిబిరం వద్దకు తరలివచ్చిన ప్రజలు

సమరదీక్ష శిబిరం వద్దకు తరలివచ్చిన ప్రజలు

Written By news on Wednesday, August 21, 2013 | 8/21/2013

 గుంటూరు : వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆమరణదీక్షకు పల్లెలన్నీ కదిలాయి. ముంచుకువచ్చిన వ్యవసాయ పనుల్ని పక్కన పెట్టిన ప్రజలు ట్రాక్టర్లు, ఆటోలు, లారీలు, రైళ్లల్లో సమరదీక్షా శిబిరానికి చేరుకుంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో అనేక ప్రాంతాల్లోని రహదారులపై వంటా-వార్పు, రాస్తారోకోలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ట్రాఫిక్ అవరోధాలన్నింటినీ అధిగమించి ఉదయం బయలుదేరిన వారు మధ్యాహ్నానికి గుంటూరు చేరుకుంటున్నారు. జిల్లాలోని ప్రతీ గ్రామంలోనూ ఇదే పరిస్థితి కనపడుతోంది. ఇదే స్పూర్తితో తెనాలి, తాడికొండ, మంగళగిరి, నరసరావుపేట నియోజకవర్గాల నుంచి రైతాంగం అధిక సంఖ్యలో తరలివచ్చారు. విభజన కారణంగా మాగాణి భూములు బీడుగా మారే అవకాశాలు కనపడటంతో రైతుగుండె తల్లిడిల్లుతోంది. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుపై విభజన ప్రభావం పడుతుందనే భయం రైతుల్ని వెన్నాడుతోంది. పులిచింతల ప్రాజెక్టు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉండగానే 90 శాతం పూర్తికాగా, మిగిలిన 10 శాతాన్ని ఇప్పటికీ పూర్తికాలేదు. 
 
 రహదారులన్నీ రద్దీ ...
 పల్లెలన్నీ ఇలా ఉంటే గుంటూరు నగరంలో పరిస్థితి మరోలా ఉంది. విజయమ్మ దీక్షకు నలుదిక్కుల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో రహదారులన్నీ కిటకిటలాడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోతోంది. దీక్షా శిబిరానికి చేరుకుంటున్న ప్రజలు ప్రదర్శనలు, పాదయాత్రలు చేస్తూ వస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. శాశ్వతంగా ఎదురుకానున్న అనేక సమస్యల పరిష్కారానికి విజయమ్మ చేపట్టిన ఈ దీక్ష ముందు తమకు కలుగుతున్న ఇబ్బంది ఏపాటిదనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. 
 
 కాంగ్రెస్, టీడీపీలపైనే విమర్శలు ..
 శిబిరానికి చేరుకుంటున్న వారంతా రాష్ట్ర విభజన వల్ల కలగనున్న నష్టాలు, కాంగ్రెస్, టీడీపీలు అనుసరించిన  వైఖరిపైనే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిపోయిందని, అది శిలాశాసనమని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనపై ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ముఖ్య నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు ఉపసంహరించుకున్నదని చెబుతూ అందుకు ఉదాహరణలు పేర్కొంటున్నారు. ఐక్యంగా పోరాటం చేస్తే ప్రభుత్వం దిగివస్తుందనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది.  
 సమైక్యాంధ్ర కోసం కదంతొక్కుతున్న గుంటూరు గడ్డపై వైఎస్ విజయమ్మ సమరదీక్ష పేరుతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. విజయమ్మ చేపట్టిన సమరదీక్ష ఇటు నాయకులు, అటు ప్రజల్లో సమైక్యస్ఫూర్తిని నింపింది.  కేంద్రం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్, టీడీపీలు అవలంబిస్తోన్న ద్వంద్వ విధానాలను ఎత్తి చూపింది. రాష్ట్ర ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా 2008లో చంద్రబాబునాయుడు ప్రణబ్‌ముఖర్జీకి రాసిన లేఖను బహిర్గతం చేశారు.  లేఖ సారాంశాన్ని కరపత్రాల రూపంలో ముద్రించి ప్రజలకు పంపిణీ చేశారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని జనం పూర్తిగా అర్థం చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన వచ్చినపుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ దాన్ని  తిప్పికొట్టిన వైనాన్ని వేదికపై నుంచి నేతలు తమ ప్రసంగాల్లో వివరించారు.
 
 ఆకట్టుకున్న విజయమ్మ ప్రసంగం...
 దీక్ష ప్రారంభం రోజైన సోమవారం వైఎస్ విజయమ్మ ప్రసంగం ఎంతో మందిని ఆకట్టుకుంది. రాష్ట్ర రాజకీయాలు, భౌగోళిక స్థితిగతులు, సామాజిక వ్యవహారాలతో పాటు రాష్ట్ర విభజన ఎందుకు చేశారో విజయమ్మ తన ప్రసంగంలో వివరించిన తీరు అక్కడ వున్నవారందరినీ అబ్బురపరిచింది. వైఎస్ ఉన్నపుడు రాష్ట్రం ఎలావుంది, లేనపుడు ఎలా తయారైంది అనే విషయాలను వివరిస్తూ, రెండేళ్లుగా వివిధ వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. ఈక్రమంలోనే ‘సమన్యాయం’ అంటూ విజయమ్మ చేపట్టిన ఉద్యమానికి అర్థం జనానికి బోధపడింది. 
 
 ఇక రెండవ రోజు దీక్షాశిబిరం కిటకిటలాడింది.  కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాల నుంచి పార్టీ నాయకులే కాకుండా సమైక్యవాదులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీక్షా శిబిరానికి హాజరై సంఘీభావాన్ని తెలిపారు. వికలాంగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు, నెల్లూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి మహిళలు విచ్చేసి విజయమ్మదీక్షకు సంఘీభావంగా నిలిచారు. గుంటూరు నగరంలోని ముస్లిం మత పెద్దలు  విజయమ్మను నిండుమనసుతో ఆశీర్వదించారు. స్కూలు విద్యార్థులు, వికలాంగులు కూడా స్వచ్చందంగా వేదికపై కొచ్చి విజయమ్మకు మద్దతుగా, సమైక్యవాదాన్ని వినిపించారు.
 విజయమ్మ సూచనలు ...
 దీక్షలో వున్న విజయమ్మ మీడియా ద్వారా ఉద్యమకారులు, యువకులు, విద్యార్థులకు అనేక సూచనలు ఇచ్చారు. ఎవరూ ఆత్మార్పణలకు దిగవద్దని, విద్యార్థులు ఆవేశాలకు లోను కాకూడదని పేర్కొన్నారు. ఆమెకు సంఘీభావం పలికిన కొందరు ప్రముఖులకు  విభజన కారణంగా వ్యవసాయ, పారిశ్రామిక, విద్యారంగాలకు ఏర్పడనున్న పెనుముప్పును వివరిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షా శిబిరానికి  ప్రజలు భారీగా తరలివస్తుండటంతో ఉద్యమం ఉధృతమవుతోందనే భావనకు పోలీస్ శాఖ వచ్చింది. ముందు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నంలో వున్నారు. ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తోన్నారు.
Share this article :

0 comments: