విజయమ్మ దీక్ష భగ్నం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ దీక్ష భగ్నం

విజయమ్మ దీక్ష భగ్నం

Written By news on Saturday, August 24, 2013 | 8/24/2013

* నేడు సీమాంధ్ర బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపు
* గుంటూరులోని దీక్షా శిబిరానికి అర్ధరాత్రి దూసుకొచ్చిన పోలీసులు
* ప్రతిఘటించిన విజయమ్మ, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు.. తీవ్ర ఉద్రిక్తత
* విజయమ్మను బలవంతంగా పోలీసు వ్యాన్‌లో ఆస్పత్రికి తరలించిన ఖాకీలు
 
సాక్షి, గుంటూరు: రాష్ట్ర విభజనంటూ జరిగితే అన్ని ప్రాంతాలవారికీ సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలీసులు భగ్నం చేశారు. గుంటూరులో విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్ష శుక్రవారం ఐదో రోజు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అర్ధరాత్రి దాటాక పోలీసు బలగాలు శిబిరంలోకి దూసుకొచ్చాయి.

ఐదు రోజులుగా నిరాహార దీక్షతో నీరసిం చిన విజయమ్మను తమతోపాటు రావాలని, ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు కోరారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు దీక్షవిరమించేది లేదని విజయమ్మ తేల్చి చెప్పారు. ఈ సమయంలో వైవీ సుబ్బారెడ్డి, వాసిరెడ్డి పద్మ, శోభానాగిరెడ్డి సహా పార్టీ నేతలు పోలీసులను అడ్డుకున్నారు. జై జగన్, జై సమైక్యాంధ్ర నినాదాలతో దీక్షా ప్రాంగణం హోరెత్తింది.

కనీసం అంబులెన్స్ కూడా తీసుకురాని పోలీసులు 1.55 గంటలకు బలవంతంగా ఆమెను పోలీసు వ్యాన్‌లోనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సమయంలో పార్టీ  శ్రేణులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. కొందరు నేతలను పోలీసులు వేదికపై నుంచి ఎత్తి పడేశారు. కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని వేదిక పైనుంచి కిందికి తోసేశారు. దీంతో ఆయన కాలికి గాయమయింది.

పోలీసుల వైఖరిని నిరసిస్తూ విజయమ్మ ఆస్పత్రి నుంచి బయటికి వచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. 20 నిమిషాల తర్వాత వైద్యులు వచ్చి ఆమెను ఐసీయూలోకి తరలించారు. కాగా, సర్కారు తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శనివారం సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

అయితే  ఆస్పత్రిలోనూ విజయమ్మ దీక్షను కొనసాగిస్తున్నారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఐవీ ప్లూయిడ్స్  తీసుకునేందుకు కూడా  ఆమె ఒప్పుకోవడం లేదని వెల్లడించారు. మహానేత సతీమణిని అమానుషంగా తరలించిన తీరుకు నిరసనగా బంద్ కు పిలుపునిస్తున్నట్టు చెప్పారు.  బంద్ కు అందరూ సహకరించాలని కోరారు. అధికార కాంగ్రెస్ కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు.
Share this article :

0 comments: