తిట్టి మళ్లీ మళ్లీ దగ్గరయ్యే యత్నాలెందుకు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తిట్టి మళ్లీ మళ్లీ దగ్గరయ్యే యత్నాలెందుకు?

తిట్టి మళ్లీ మళ్లీ దగ్గరయ్యే యత్నాలెందుకు?

Written By news on Tuesday, August 13, 2013 | 8/13/2013

బీజేపీతో దోస్తీకి బాబు వెంపర్లాట
వైఎస్సార్ సీపీ నేతలు కొరుముట్ల, ఆకేపాటి ధ్వజం
  మతతత్వ పార్టీ అంటూ తిట్టి మళ్లీ మళ్లీ దగ్గరయ్యే యత్నాలెందుకు?
ఇన్నాళ్లూ కేసుల భయంతో కాంగ్రెస్‌తో దోస్తీ..
ఇప్పుడు అధికారం కోసం బీజేపీతో పొత్తా!
మోడీ వద్దకు బాలకృష్ణను పంపడంలో మతలబేమిటి?

 
 సాక్షి, హైదరాబాద్: ‘‘తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంటుందా..? లేదా దూరంగా ఉంటుందా? దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి మాట్లాడారు. ఇప్పటివరకూ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కాంగ్రెస్‌తో అంటకాగుతున్న చంద్రబాబు.. ఇపుడు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని వారు పేర్కొన్నారు.
 
  ‘‘నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు వస్తే చంద్రబాబు తన వియ్యంకుడు బాలకృష్ణను ఆయన వద్దకు పంపించారు. తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకే వెళ్లినట్లు బాలకృష్ణ చెప్పుకొచ్చారు. రెండ్రోజుల కింద టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటే తప్పేమిటన్నారు. మరోవైపు.. మోడీ కూడా తన ప్రసంగంలో ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. టీడీపీకి ఆహ్వానం పలుకుతున్నట్లుగా సూచనలిచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భవిష్యత్తులో బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంటున్నారా.. లేదా? బయటపెట్టాలి’’ అని వారు పేర్కొన్నారు. తన కుమార్తె వివాహ పత్రికను ఇవ్వడానికే మోడీ వద్దకు వెళ్లానని బాలకృష్ణ అనడం చూస్తే.. ‘తాటిచెట్టు ఎక్కింది కల్లు కోసం కాదు, దూడగ డ్డి కోసం...’ అన్నట్లుగా ఉందని ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. గుజరాత్‌ను మోడీ అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అభివృద్ధి చేస్తారన్న టీడీపీ నేతల మాటలు చూస్తే భవిష్యత్‌లో వారిద్దరూ కలిసేలా ఉందన్నారు.
 
 1995, 98 మధ్య కాలంలో బీజేపీని మతతత్వ పార్టీ అంటూ తిట్టి, అంటరానిదిగా పరిగణించి వామపక్షాలతో దోస్తీ చేసిన చంద్రబాబు 1999 సంవత్సరం వచ్చే నాటికి బీజేపీ గాలి వీస్తోందని తెలుసుకుని అటు వెళ్లారని విమర్శించారు. ‘‘ఇక 99 ఎన్నికల ముందు చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై వంద ఆరోపణలతో బీజేపీ ఒక పత్రాన్ని విడుదల చేస్తూ తాము అధికారంలోకి వస్తే వాటన్నింటిపైనా విచారణ జరిపిస్తామని ప్రకటించింది. దాంతో భయపడిపోయిన చంద్రబాబు.. ఆగమేఘాల మీద పరుగెత్తి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు’’ అని కొరుముట్ల, ఆకేపాటి విమర్శించారు. తనపై కేసులు పెడతారని, సీబీఐ దర్యాప్తు జరుగుతుందని భీతిల్లిన చంద్రబాబు కొంత కాలంగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నారని.. కేంద్రంలో బీజేపీ వస్తుందేమోనన్న అంచనాతో వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శించారు.
 
  ‘‘బాబు చిదంబరంతోనూ, కాంగ్రెస్ అధిష్టానవర్గం పెద్దలతోనూ రహస్యంగా చర్చలు జరపడం వాస్తవం కాదా? యూపీఏ ప్రభుత్వం స్థిరంగా ఉండటానికి వారికి మద్దతు తెలిపిన మాట నిజం కాదా? శాసనసభలో అవిశ్వాసం సమయంలో విప్ జారీ చేసి మరీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఘనత బాబుది కాదా?’’ అని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. వాస్తవానికి ఆరోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టి ఉంటే రాష్ట్రంలో ఈ గందరగోళ పరిస్థితులు నెలకొని ఉండేవి కాదు కదా? రాష్ర్టం అగ్ని గుండంగా మారి ఉండేది కాదు కదా? అని పేర్కొన్నారు. టీడీపీకి ఆహ్వానం పలికేలా మోడీ ప్రసంగించడం కూడా బాబు సూచనల మేరకే జరిగి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు.  కడప లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా మతతత్వ పార్టీ అయిన బీజేపీతో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పొత్తు పెట్టుకుంటారంటూ దుష్ర్పచారం చేసిన బాబు ఇపుడు తానే బీజేపీతో కలిసేందుకు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు.
 
 బాబు చేసిన ఆ తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మలేదన్నారు. గతంలో ఎన్డీయేకు మద్దతిచ్చినపుడు కూడా బాబు మంత్రి పదవులు వద్దు, రాష్ట్ర అభివృద్ధి వద్దని.. తన ప్రయోజనాలు, తన వాళ్ల ప్రయోజనాలే చూసుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజల గురించి మాత్రం ఆలోచించలేదని విమర్శించారు. తన ఆడిటర్‌ను రిజర్వు బ్యాంకు డెరైక్టర్‌గా దక్షిణ భారత ఇన్‌చార్జిగా నియమింపజేసుకున్న ఘనత బాబుదని ఆరోపించారు. విభజన వ్యవహారంలోకి దివంగత వైఎస్ పేరును లాగితే ప్రజలు క్షమించరని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తా మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేది వైఎస్ కల అని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాకే ఏ నిర్ణయమైనా తీసుకుందామని వైఎస్ చెప్పారని గుర్తు చేశారు. వైఎస్‌పై బురద జల్లుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని జరుగుతున్న ప్రయత్నాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. విభజనపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కేంద్రం ఒక తండ్రిలా అందరికీ సమన్యాయం చేయాలని జగన్, వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారని ఒక ప్రశ్నకు సమాధానంగా కొరుముట్ల, ఆకేపాటి చెప్పారు.
Share this article :

0 comments: