జగన్,విజయమ్మల బహిరంగ లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్,విజయమ్మల బహిరంగ లేఖ

జగన్,విజయమ్మల బహిరంగ లేఖ

Written By news on Saturday, August 10, 2013 | 8/10/2013

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి కడప లోక్ సభ సభ్యత్వానికి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు రాసిన బహిరంగ లేఖను యథాతథంగా ఈ దిగువ ఇస్తున్నాం.


 హైదరాబాద్, ఆగస్టు 10, 2013. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి,  అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు. వైఎస్ విజయమ్మ, గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే.
 బహిరంగ లేఖ


 రాష్ట్రానికి సంబంధించిన సమస్యను కాంగ్రెస్ పార్టీ మరింత జటిలం చేస్తోంది. ఎవరికీ అన్యాయం జరగకుండా, అన్ని ప్రాంతాలవారికీ ఆమోదయోగ్యమైన రీతిలో కేంద్ర ప్రభుత్వం ముందుగా తన స్టాండ్‌ను ఇక్కడి పార్టీలముందు ఉంచి, ఆ తరవాత అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరికీ అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మేం పదేపదే విజ్ఞప్తి చేశాం. అలాంటి వాతావరణం కనపడలేదు. కాంగ్రెస్ పార్టీ తానే ప్రభుత్వాన్ని అన్నట్టుగా నిర్ణయం తీసుకుంటూ, ఇక సంప్రదింపులు లేవని చెప్పటంతో మా పార్టీ ఎమ్మెల్యేలంతా గత నెల 25నే రాజీనామా సమర్పించటం జరిగింది. ఆ తరవాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీయే సమావేశాల్లో కూడా అదే నియంతత్వ ధోరణి కొనసాగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆంధ్ర, రాయలసీమల్లో ప్రజలు తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేయటాన్ని మనమంతా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ చదరంగంలో భాగంగా రాష్ట్ర విభజన పేరిట ఇక్కడి ప్రజల ప్రయోజనాలను బలిపెడుతున్న నేపథ్యంలో ఇక్కడి ప్రజల ఆగ్రహానికి, ఇక్కడి ప్రాంతాల అభిప్రాయాలకు విలువ ఇస్తూ భారత ప్రభుత్వం తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేసి సమన్యాయం చేయాల్సింది పోయి... కాంగ్రెస్ పార్టీ వారు ఎటువంటి చిత్త శుద్ధీ లేకుండా తమ పార్టీకే చెందిన సభ్యులతో, తమ పార్టీ కమిటీ అంటూ మరో డ్రామాకు తెరతీశారు.


 అలాగే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు వద్దకు ఏపీ ఎన్జీవోలు కలవటానికి వెళితే... వారు ప్రాధేయపడినా, తాను రాష్ట్ర విభజనకు బ్లాంక్ చెక్‌లా ఇచ్చిన ఉత్తరాన్ని వెనక్కు తీసుకునేది లేదని ఆయన తెగేసి చెప్పేశారు. అడ్డగోలు విభజనను ఆమోదిస్తూ నాలుగు లక్షల కోట్లతో  రాజధాని కట్టుకోవచ్చంటూ ఓ ప్రెస్‌మీట్ పెట్టారు. అవతలి ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందని తెలిసినా, స్పందిస్తే ఓట్లూ సీట్లూ తగ్గుతాయని... క్రెడిట్ రాకుండా పోతుందని స్పందించటానికి కూడా వెనకడుగు వేస్తున్న- చంద్రబాబు ఒక వైపు, రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు మరోవైపు  కోట్ల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వారు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకుని నష్టం జరగబోతున్న ప్రాంతం ప్రజలకు మద్దతు పలుకుతారని... ఆ పార్టీల పెద్దలు మా తరహాలోనే స్పందిస్తే నష్టం  జరగకుండా ఆపగలుగుతామని ఆశిస్తూ... ముందుకు వచ్చి మేం మా చట్టసభల సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నాం. ఇదే చిత్తశుద్ధిని వారు కూడా తమ రాజీనామాలతో కనబరచాలని కోరుకుంటున్నాం.


 మా ఈ రాజీనామాతో పాటు జరుగుతున్న అన్యాయాలు ఎత్తి చూపుతూ ముఖ్యమైన కొన్ని అంశాలను ప్రజలముందు ఉంచేందుకే ఈ  లేఖ రాస్తున్నాం. అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవ్వరికీ అన్యాయంగా జరగకుండా రాష్ట్రానికి సంబంధించిన అంశంలో పరిష్కారం చేయండి అని మా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించాం. అలాంటి ఆలోచనను పక్కన పెట్టి, ఇప్పుడు రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితిని ఎలా తయారు చేశారంటే...  నెత్తిన  తుపాకీ పెట్టి- ఒప్పుకుంటారా... చస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరిస్తున్నట్టుగా ఉంది.  ఒప్పుకోకపోయినా తాము చేయాల్సింది మేం చేస్తాం అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నమీదట... సీట్లూ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనాలోచిత విభజన రాజకీయం వల్ల వచ్చే సమస్యలేమిటో అందరికీ తెలిసేలా మరోసారి చెప్పకపోతే, కోట్ల మందికి తరతరాలపాటు అన్యాయం జరిగిపోతుందేమో అని మా పదవులకు రాజీనామా చేశాం. ఇప్పటికైనా అధికారంలో ఉన్నవారు కళ్ళు తెరవండి అని అడుగుతున్నాం.
 ఈ రాష్ట్ర విభజన తప్పదు అని కేంద్ర ప్రభుత్వం భావిస్తే, తెలుగు ప్రజల్ని విభజించటం కంటే వేరే దారి లేదు అని వారు అనుకుంటే...  ఒక రాజకీయ నాయకుడు తన వ్యక్తిగత లాభాల కోసమో, ఒక పార్టీ రాజకీయ లాభాల కోసమో, రాజకీయ కోణాలతోనో ఆ పని చేయకూడదు. తెలంగాణ అంశం కేంద్ర ప్రభుత్వం ఒక తండ్రిలా ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా, ఇక్కడి ప్రాంతాలు అన్నదమ్ముల్లా ఇక ముందు కూడా ఎప్పుడూ కలిసి ఉండేలా పంపకాలు చేయవలసిన సున్నితమైన అంశం. అలా అందరికీ న్యాయం చేయలేకపోతే, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నవారు విభజించే అధికారం తమ చేతుల్లోకి తీసుకోకూడదు.


 ఇక్కడ ఒకసారి ఈ రాష్ట్రం చరిత్రను గుర్తుకు తెచ్చుకోవాలి. ఏ ప్రాంతానికీ, ఏ జిల్లాకూ అనాదిగా ఒకే పరిస్థితులు లేవు. ఉదాహరణకు- భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కొన్ని మార్పులు జరిగాయి. మద్రాసు ప్రెసిడెన్సీ అన్న పదం నుంచి మద్రాసు దూరమైంది. కోస్తాంధ్ర ప్రాంతంలోని గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న భద్రాచలం ప్రాంతం అంతా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు బదలాయించారు. అలాగే మద్రాసు ప్రెసిడెన్సీలోని మన ఉత్తరాంధ్రలోని భాగమైన కోరాపుట్, రాయగఢ్ ప్రాంతాలను ఒడిస్సాలోకి బదలాయించడం జరిగింది. అలాగే రాయలసీమలో భాగమైన బళ్ళారి జిల్లాను కర్ణాటకకు చేరుస్తూ, కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని గద్వాల, అలంపూరు ప్రాంతాలను మహబూబ్‌నగర్‌కు చేర్చారు.


 అలాగే హైదరాబాద్ స్టేట్ నాలుగు డివిజన్‌లు- 1 ఔరంగాబాద్ డివిజన్, 2. గుల్బర్గా డివిజన్, 3. మెదక్ డివిజన్, 4. వరంగల్ డివిజన్ మార్పు చేర్పులకు గురయ్యాయి. ఇందులో ఔరంగాబాద్ డివిజన్ మహారాష్ట్రలోకి, గుల్బర్గా డివిజన్- మద్రాసు ప్రెసిడెన్సీలోని   బళ్ళారితో కలిసి కర్ణాటకకు పోవడం జరిగింది. ముందు చెప్పినట్లుగా గుల్బర్గా డివిజన్‌లోని రాయచూరు జిల్లాలోని కొంత భాగాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో కలపటం జరిగింది. అదే విధంగా కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని కొడంగల్, తాండూరు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చి చేరాయి. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్న నడిగూడెం, మునగాల ప్రాంతాలు గతంలో బ్రిటీష్ ఇండియాలో భాగంగా కృష్ణా జిల్లాలో ఉండేవి. కృష్ణా జిల్లాలో కంచికచర్ల దగ్గర ఉన్న పరిటాల గ్రామం నైజాం సంస్థానంలో భాగంగా ఉండేది. ఇలా అన్ని ప్రాంతాలు కూడికలు, తీసివేతలు తరువాత, మిగిలిన దానితో సంతప్తిపడి...మనం ఈ రోజున మన ప్రాంతాలను వివిధ పేర్లతో పిలుచుకోవడం జరుగుతోంది.
 ఇక్కడ ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల చారిత్రక నేపథ్యాన్ని, ఆ తరవాత మార్పు చేర్పుల్ని, ఆయా ప్రాంతాల అవసరాల్ని, ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా పరిష్కారం ఇవ్వాలి.  అన్నిటికంటే ముందు రెండు ప్రధాన సమస్యలు అధిగమించాలి.
 అనేక సమస్యలతో పాటు... 1. నీటి సమస్య 2.  హైదరాబాద్ మహానగరం అంశాలపై పరిష్కారాలు కావాలి.
 ముందు చెప్పినట్లు, ఏ పరిష్కారమైనా ఎలా ఉండాలి అంటే ఒక తండ్రి తన పిల్లలకు పంపకాలు చేసినట్లుగా ఉండాలి. ఎప్పుడూ ఆ అన్నదమ్ముల మధ్య గొడవలు పడే పరిస్థితి రాకూడదు. అలా చేయగలిగితేనే చేయాలి. ఈ దిశగా ఆలోచన చేసినప్పుడు కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా నది ప్రవాహం కర్ణాటకలోని రాయచూరు నుంచి, మహబూబ్‌నగర్ గుండా గద్వాల్, ఆలంపూర్ ప్రాంతాల ద్వారా కర్నూలులోని శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. ఆ తరువాత నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుతుంది.

 అదే విధంగా మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్‌కే పరిమితమైన నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. 1. భీమా 2. నెట్టెంపాడు 3. కల్వకుర్తి 4. కోయిల్ సాగర్. ఇలాంటి అంశాలు ముందుగానే ఆలోచించుకుని తరవాత నిర్ణయాలు తీసుకోవాలి. అలా జరగటం లేదని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రే ప్రెస్‌మీట్ పెట్టి చెపుతున్నాడు అంటే అధికారంలో ఉన్నవారు స్టేట్స్‌మన్‌లా తీసుకోవాల్సిన నిర్ణయాన్ని  ఎలాంటి ఆలోచనా లేకుండా, కేవలం నాలుగు సీట్ల కోసమో, పది సీట్ల కోసమో తీసుకుంటున్నారని అర్థం అవుతోంది.

 ఆరు దశాబ్దాలు కలిసి ఉన్న మూడు ప్రాంతాల ప్రజలు నీటి కోసం వారిలో వారు కొట్టుకునే పరిస్థితి, తన్నుకునే పరిస్థితి రాకూడదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సివస్తోందంటే... ప్రస్తుతం ఉన్న నీటి పంపకాల తీరు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతోంది. కృష్ణా నీటి పంపకాలనే చూడండి...  మన రాష్ట్రానికి అధికారికంగా కేటాయించిన నీటి పంపకాల నిష్పత్తి ఎలా ఉన్నా ట్రిబ్యునల్స్ ఏమి చెప్పినా, కోర్టులు ఏమి చెప్పినా మన ఎగువన ఉన్న కృష్ణా నీరు, మహారాష్ట్ర అవసరాలను తీర్చిన తరువాత కర్ణాటకలోకి వస్తుంది. అక్కడ ఆల్మట్టి, నారాయణపూర్  జలాశయాలు నిండితే తప్ప చుక్క నీరు కిందికి నీరు వదలని పరిస్థితి. అంటే కరువు వచ్చినా, వరదలు వచ్చినా నష్టపోయేది అనింటికన్నా చివరి రాష్ట్రమే. అయినా ఈ సమస్య గురించి ఎన్నిసార్లు గొంతు చించుకుని కేకలు వేసినా వినేవాడు లేడు. ఆర్తనాదాలు పట్టించుకునే నాథుడు లేడు.

 ఇటువంటి పరిస్థితుల మధ్య, మన మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా విడగొట్టబడ్డ క్రింద రాష్ట్రం పరిస్థితి ఏమిటి? శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయి? నాగార్జున సాగర్‌కు నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయి? దిగువన ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న  రాష్ట్రానికి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీళ్ళు తప్ప మంచి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? అటు గోదావరి చూసినా, ఇటు కావేరి చూసినా రాష్ట్రాల మధ్య తగాదాలే. కర్ణాటక, తమిళనాడులో రోజూ కొట్టుకునే పరిస్థితి. కోర్టులు చెప్పినా.. ప్రధాన మంత్రులు చెప్పినా.. ఆ గొడవలు మాత్రం గొడవలే. ప్రతి సంవత్సరం బంద్‌లు, సమ్మెలు! అటువంటి పరిస్థితి మనకు రాకూడదని కోరుకున్నాం.


 ఇక మన రాష్ట్రంలో ప్రవహిస్తున్న మరో ప్రధాన నది గోదావరి. గోదావరి నదికి నాలుగు పాయలున్నాయి. వీటి ద్వారా వచ్చే పరిమాణం ఎంతో చూస్తే     1. నాసిక్ నుంచి వచ్చే పాయ ద్వారా సుమారు 28 శాతం, ఇది నిజామాబాద్, అదిలాబాద్ మీదుగా వస్తుంది.     2. ప్రాణహిత నుంచి 37 శాతం, ఇది కరీంనగర్‌లో వచ్చి కలుస్తుంది.     3. ఇంద్రావతి నుంచి 22 శాతం, ఇది కరీంనగర్‌లో వచ్చి కలుస్తుంది.     4. శబరి నుంచి 13 శాతం, ఇది ఖమ్మంలో వచ్చి కలుస్తుంది.


 ఇది కొంచెం అటూ ఇటుగా మొత్తంగా గోదావరి నది నుంచి వచ్చే నీటి ప్రవాహం. కాంగ్రెస్ పెద్దలు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి మాట్లాడారుగానీ అంతకు ముందు సమాధానం రావాల్సిన మరో అంశం ఉంది.   రెండు రాష్ట్రాలు అయితే పోలవరం ప్రాజెక్టుకు నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయి..? ముంపు, పరిహారం వంటి అంశాలకు సంబంధించి ఏం ఆలోచించారు? నీటి కోసం గొడవలు తప్పని పరిస్థితేనా? ఇంకొక విషయం వారికి తట్టలేదా? గోదావరి ఆవలి ఒడ్డున ఉన్న భద్రాచలం ప్రాంతమంతా ఇంతకుముందు మద్రాసు ప్రెసిడెన్సీలో గోదావరి జిల్లాలోని భాగం కాదా? అది ఆ తరవాత ఖమ్మం జిల్లాకు   బదలాయింపు చేసిన ప్రాంతం కాదా? ఇలాంటి అంశాలమీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పదలచుకుంది? గోదావరి ఏయేజిల్లాలనుంచి ప్రవహిస్తోంది? దానికి వస్తున్న నీరు ఎక్కడెక్కడినుంచి ఎంతెంత శాతం చేరుతోంది? న్యాయం అంటే ఎంత శాతం కింది రాష్ట్రానికి ఇవ్వాలి? భవిష్యత్తులో తగాదాలు లేకుండా ఎలా ఇవ్వాలి వంటివి ఆలోచించకుండా విభజన నిర్ణయాలు ఎలా ప్రకటించారు?


 హైదరాబాద్ విషయానికి వస్తే- ప్రాంతాలకు అతీతంగా జాతులకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈ నగరంలో అందరూ నివాసముంటున్నారు. దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంతో వారి జీవితాలు ముడిపడి ఉన్నాయి. నేటి  హైదరాబాద్ నగరం ఇంతగా అభివద్ధి చెందిందంటే అందులో గత 60 ఏళ్ళుగా మూడు ప్రాంతాలవారి కష్టం, శ్వేదం అందుకు దోహదపడ్డాయి. దేశంలో అన్ని నగరాల కంటే గత 60  ఏళ్ళలో వేగంగా అభివద్ధి ఇక్కడే జరిగింది. ఈవాళ రాష్ట్ర బడ్జెట్‌లో ఒక్క హైదరాబాద్‌నగరమే దాదాపుగా 60 శాతం సమకూరుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చదువుకున్న పిల్లవాడయినా, తాను చదువు అయిపోయిన తరువాత ఉద్యోగం కోసం మొట్టమొదటగా చూసేది రాజధానిగా ఉన్న ఈ హైదరాబాద్ వైపు.  మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి గతంలో మద్రాసును దూరం చేశారు. మళ్ళీ ఈ రోజున 60 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడిగా అభివద్ధి చేసిన తరవాత, ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా ఆంధ్ర-రాయలసీమ వారికి దూరం చేసి పదేళ్ళలో వీడాలని అంటున్నారు. కట్టడానికి 60 ఏళ్ళు సమయం పట్టిన ఉమ్మడి రాజధాని నగరాన్ని పదేళ్ళలో వేరే చోట కట్టుకోండి... అని అంటున్నారు. గతంలో ఎక్కడా దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా... కలిసి ఉండాలనుకునేవారిని వెళ్ళగొడుతున్నారు. విడిపోవాలనుకున్నవారికి మాత్రమే చెందేలా ఉమ్మడిగా అభివద్ధి అయిన రాష్ట్ర రాజధానిని పంపకం చేస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఏమిటి?


హైదరాబాద్ ప్రస్తుతం ఏటా రూ. 90,000 కోట్లు (రాష్ట్ర పన్నులకు రూ.40,000 కోట్లు, కేంద్ర పన్నులకు రూ.35,000 కోట్లు, స్థానిక ఆదాయంగా రూ.15,000 కోట్లు) రాష్ట్ర బడ్జెట్‌లో జనరేట్ చేస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 55 శాతం, కేంద్రానికి రాష్ట్రం నుంచి వెళుతున్న పన్నుల్లో 65 శాతం కేవలం హైదరాబాద్ నగరం నుంచే జమ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌నుంచి ఇంత డబ్బులు ఖజానాకు రాకపోతే... లేదా హైదరాబాద్‌నుంచి వచ్చే ఈ డబ్బును వేరేచోట ఇంకొక నగరం కట్టటానికి డైవర్ట్ చేస్తే... అలాంటప్పుడు వద్ధాప్య పింఛన్ల దగ్గరనుంచి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఉచిత విద్యుత్తు వరకు, రూపాయి కిలో బియ్యం దగ్గరనుంచి ఇతరత్రా సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు... అమలు చేస్తున్న వాటికి, అమలు చేయదలచుకున్నవాటికి  డబ్బు ఎక్కడినుంచి వస్తుంది? భావోద్వేగాలతో కూడిన సంబంధాలను ఎందుకు దష్టిలోకి తీసుకోలేదు?  వీటన్నింటినీ గమనిస్తే అడ్డగోలుగా ప్రకటన చేసిన అధికారంలో ఉన్నవారికి ఇక్కడ ఉన్న ప్రజల బాగోగులమీద స్పష్టత లేదు. హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు చేస్తున్న సీమాంధ్ర ప్రజల బాగోగులకు సంబంధించిన స్పష్టతకూడా లేదు. ఇప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు వినిపిస్తున్నా వాటిని పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే విభజన తరవాత పరిస్థితి ఏమిటి? ఇలాంటి సున్నితమైన అంశాలను అధికారం ఉంది కదా అని సీట్లూ ఓట్ల కోసం విభజన నిర్ణయాలు తీసుకుంటున్నవారు ఎప్పుడైనా ఆలోచించారా? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతిపాదన ప్రకారం హైదరాబాదును 10 సంవత్సరాలపాటు జాయింట్ క్యాపిటల్‌గా ఉంచితే, వారి ప్రతిపాదన మేరకు రాష్ట్రాన్ని విడగొడితే... ఆ విడగొట్టబడ్డ దిగువ ప్రాంతానికి హైదరాబాద్‌నుంచి సంబంధాలు ఎలా నెరపాలి? ప్రజలకు ఏదైనా పనిపడితే... లేదా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవాలనుకుంటే, 200 కిలో మీటర్లకు పైగా వేరే రాష్ట్రం ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. 

 ఆ రాష్ట్రంలో పొరపాటున గొడవలు జరిగితే అక్కడికి చేరినవారికి  ఏ సంబంధం, ఆసరా లేకుండా ఎక్కడో ఓ ద్వీపంలో ఉన్నట్టే అనిపిస్తుంది.  కాబట్టి హైదరాబాద్ విషయంలో ఇవన్నీ దష్టిలో పెట్టుకుని సరైన పరిష్కారం దిశగా అడుగులు వేయాలి.  వనరులు ఇప్పుడు ఉన్నట్టుగానే కొనసాగేలా చూడాలి. ఉద్యోగులు, అన్ని ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలు ధైర్యంగా గుండెలమీద చేయి వేసుకుని నిర్భయంగా జీవించే పరిస్థితి ఉండాలి.
 ఏ రాష్ట్రానికి అయినా అంతర్గత భద్రత ముఖ్యమే. పాంతాల మధ్య అడవులు విస్తరించి ఉన్నాయి. తీవ్రవాద సమస్యలు లాంటి అంశాలమీద కాంగ్రెస్ పెద్దలకు ఆలోచన ఉన్నట్టు కనిపించటం లేదు. ఇలాంటి అంశాలమీద సరైన ఆలోచన చేయకుండా విభజన నిర్ణయాలు తీసుకుంటే అంతర్గత భద్రతను సాధించటం అసాధ్యం అవుతుంది.


 ఇప్పుడు వినిపిస్తున్న మాటల్ని బట్టి చూస్తుంటే, రాష్ట్రాన్ని పైభాగం ఒకరికి, కింది భాగం ఒకరికి అని అడ్డగోలుగా విభజిస్తే.. కింది భాగంలో ఉన్న వారికి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రం నీరు తప్ప మంచి నీళ్లెక్కడ ఉన్నాయి? ఇలాంటి పరిస్థితులమధ్య ఇంకా ఆశ్చర్యకరమైన వదంతి కూడా వినిపిస్తోంది- రాయల తెలంగాణ అని. ఇక్కడ మేం ఒక ప్రశ్న అడగదలచుకున్నాం. అసలు ఎందుకు తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌నుంచి విడగొడుతున్నారు? దీనికి మీరు చెప్పే సమాధానం... సెంటిమెంటు అని. మరి సెంటిమెంటు కారణం అయితే రాయలసీమను సగంగా విడగొట్టేటప్పుడు రాయలసీమ ప్రజలకు సెంటిమెంటు ఉండదా? అదీగాక, శ్రీశైలం డ్యాం ఒకవైపున, నాగార్జునసాగర్ డ్యామ్ మరోవైపున ఉంటే నాగార్జునసాగర్ డ్యాముకు నీళ్ళు ఎలా ఇస్తారు? ఎలా వస్తాయి? దిగువ ప్రాంతమైన కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా పరిస్థితి మారదు కదా? సముద్రం నీళ్ళు తప్ప మంచి నీళ్ళు ఉండవు కదా? మరి ఎందుకు ఇలా ఓట్ల కోసం.. సీట్ల కోసం ఎంతకైనా దిగజారటం? ఇది ఏ మేరకు న్యాయం? కష్ణా ఆయకట్టును విడగొడితే రోజూ గొడవలు తప్పని పరిస్థితి రాదా? రాష్ట్రాన్ని విభజిస్తే ఇవన్నీ జల నియంత్రణ బోర్డుల ఆధ్వర్యంలోకి వెళతాయి. అలాంటప్పుడు నికర కేటాయింపులు ఉన్నవాటికే నీరిస్తారు.


రాష్ట్రం విభజిస్తే అటు శ్రీశైలం, నాగార్జునసాగర్ కూడా జల నియంత్రణ బోర్డు పరిధిలోకి వస్తాయి. ఒక్కసారి అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటు అయ్యాక మిగులు నీరు మీద ఆధారపడ్డ ప్రాజెక్టులకు అటు రాయలసీమలోగానీ, ఇటు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు గానీ, అటు ప్రకాశం జిల్లాకుగానీ చుక్క నీరు ఉపయోగించుకునే అవకాశం ఉండదు. తుంగభద్ర బోర్డునే చూడండి. బోర్డు ఉన్నా మన రాష్ట్రానికి చట్టబద్ధంగా ఉన్న నీరు కూడా రావటం లేదు. ఆ పరిస్థితిలో కృష్ణా ఆయకట్టు రైతాంగం భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ సమస్య పరిష్కారానికి కష్ణ ఆయకట్టు ప్రాంతం అంతా ఒకవైపున అయినా ఉంచాలి, లేదా యథాతథ స్థితిని కొనసాగించాలి. ఏం చేయదలచుకున్నారంటే సమాధానం లేదు. విభజన ద్వారా ఒక వైపు ప్రాంతానికి బొగ్గు లేకుండా చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్యాస్ ఉన్నా ఇక్కడి అవసరాలకు ఇవ్వరు. కనీసం ప్రాణాలు నిలబెట్టే నీరు కూడా లేకుండా ఆ రాష్ట్రంలో ప్రజలు ఎలా బతికేది, అభివద్ధి చెందేది ఎలా?
 రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజనకు సంబంధించి సర్వాధికారాలూ కేంద్ర ప్రభుత్వానికే ఉన్న నేపథ్యంలో ఆ అధికారంతో కాంగ్రెస్ వారు ఈ రాష్ట్రంలోని కోట్ల మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్నవారు అన్ని ప్రాంతాల వారికి న్యాయం చేయలేని పరిస్థితి ఉంటే రాష్ట్రాన్ని యథావిధిగా వదిలేయాలని అర్థిస్తున్నాం. అందరికీ న్యాయం చేయలేకపోతే విడగొట్టే అధికారం చేతుల్లోకి తీసుకోవడం తప్పు. కాంగ్రెస్ పార్టీవారు ఇక్కడి ప్రజల స్థానంలో ఉండి ఆలోచనలు చేయాలి. ఎందుకు ఈ రోజున  కోట్ల మంది ఆందోళనకు గురవుతున్నారా అన్నది గమనించాలి. వారు పన్నే రాజకీయ పన్నాగం వల్ల, ఓట్ల కోసం సీట్ల కోసం ఆడే ఈ రాజకీయ క్రీడవల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే... దిగువన ఏర్పడే రాష్ట్రం మనిషి చేసిన ఎడారి అవుతుంది. తమ నిర్ణయాల వల్ల జరిగే కష్టనష్టాలను బేరీజు వేసుకోకుండా అధికార కాంగ్రెస్ పెద్దలు నియంతత్వ పోకడతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. మా రాజీనామాలతో, మా పార్టీ వారు చట్ట సభలకు చేసిన రాజీనామాలతో నిరంకుశ నిర్ణయంలో ఏమైనా మార్పు తీసుకురాగలుగుతామేమో అన్న ఆశతో నిరసన తెలుపుతూ రాజీనామాలు చేస్తున్నాం. 


(సాక్షి సౌజన్యంతో)

Share this article :

0 comments: