ఒకసారి మోసపోయాం చాలదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒకసారి మోసపోయాం చాలదా?

ఒకసారి మోసపోయాం చాలదా?

Written By news on Saturday, August 10, 2013 | 8/10/2013

‘చరిత్ర పునరావృతమవుతుంది. తొలిసారి విషాదంగా, తదుపరి ప్రహసనంగా’ - అన్నాడు కార్ల్ మార్క్స్.
ఉమ్మడి రాజధాని గొడవ అరవై ఏళ్ల తరవాత మళ్లీ మొదలైంది. రాష్ట్రాన్ని ఆంధ్ర, తెలంగాణాలుగా విడగొట్టాలని కేంద్ర ప్రభువులు పట్టుపడితే- పోనీ! ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు హైదరాబాదు కొనసాగటానికి దయతో అనుమతించారు కదా? అదే పదివేలు. హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికే చెందనీ! ఆ నగరం మీద అధికారాలు యావత్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉండనీ! ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలమూ ఆ నగరంలో ఆంధ్రా సర్కారు పనికి ఇబ్బంది రాకుండా కట్టుబాట్లు కోరదాం. వీలైతే హైదరాబాదు మహానగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయిద్దాం. అది కుదరకపోతే ఉమ్మడి రాజధాని యోగాన్ని ఇంకో ఐదేళ్లో, పదేళ్లో, శాశ్వతంగానో పొడిగించమందాం - అని మహా తెలివిగల తెలుగు కేంద్రమంత్రులు, వారికి తోడుబోయినవారు వ్యూహాలు పన్నుతున్నారు. ఆపసోపాలు పడుతున్నారు.
ఒక రాష్ట్రంలోని ప్రాంతం వేరే రాష్ట్రంగా విడిపోయిన సందర్భాలు దేశంలో చాలానే ఉన్నాయి. వేరుపడిన ప్రాంతం తనకు అనువైన వేరేచోట రాజధానిని ఏర్పరచుకోవటం రివాజు. ఒక ప్రాంతం విడిపోదలిచింది కాబట్టి మిగతా రాష్ట్రం చిరకాలంగా ఉన్న రాజధానిని దానికి వదిలేసుకుని వేరేచోటికి తరలిపోవలసి రావటం మునె్నన్నడూ జరగలేదు. ఎప్పటినుంచో నడుస్తున్న రాష్ట్రం తనకు వేరే రాజధాని అమరేదాకా ఉన్నచోటే పనిచేసుకోనివ్వండని తనతో తెగతెంపులు చేసుకున్న చిన్న ప్రాంతం వారిని దేబిరించాల్సి రావటం విధి వైచిత్రి. అనేక దశాబ్దాలుగా సాగుతున్న రాజధాని నగరాన్ని, దాని పరిసర ప్రాంతాలను విభజన మూలంగా డిస్టర్బ్ చేయటం, చిరకాల నివాసం చేస్తున్న పౌరులను అకారణంగా అస్తవ్యస్త అభద్రతకు గురి కావించటం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిది. అలాగే ఒక రాష్ట్రం రాజధాని వేరే రాష్ట్రంలో అదీ వందల కిలోమీటర్ల దూరంలో పనిచేయటమనేది రాజకీయ శాస్త్రంలో ఎవరూ ఊహించని కొత్త పుంత!
అయినా - సందేహించాల్సిన పనిలేదు. ఎవరికీ ఈ లోటూ ఉండదు. ఎటు నుంచీ ఏ చిక్కూ రాదు. మాదీ భరోసా. అంతా మేము చూసుకుంటాం. అన్ని రక్షణలూ కల్పిస్తాం. మా మాట నమ్మి నిశ్చింతగా నిద్రపోండి - అని మరుగుజ్జు మహానేతలు అడక్కుండానే వరాలిస్తున్నారు. అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు.
ఇలాంటి కబుర్లను విని, విని - ఔను కదా, అలా చేస్తే పోతుందేమో - అని లేనిపోని ఐడియాలు దరిచేరనిచ్చేముందు - గతంలో ఇలాంటిదే సంకటంలో ఏమి జరిగిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఉమ్మడి రాజధానిని నమ్ముకుంటే ఏమైందో, మహామహులు చెప్పిన మాటలు నిజమని నమ్మి ఎలా మోసపోయామో గుర్తు పెట్టుకోవాలి.
తెలుగు వారికి ఇప్పుడు హైదరాబాదు ఎలాగో అరవై ఏళ్ల కిందటి వరకూ మద్రాసు అలాగ. నిజాం రాజ్యం దాదాపుగా వేరే దేశమైనట్టుగా ఉండేది. అదంతా ఉర్దూమయం. అక్కడి కరెన్సీ వేరు. సంస్కృతి వేరు. కాబట్టి నైజాం రాజధాని హైదరాబాదుతో మిగతా ఆంధ్ర జిల్లాల వారికి ఏమంత సంపర్కం ఉండేది కాదు. వారికి అనుబంధం, మమకారం అంతా మద్రాసుతోనే. పై చదువులకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు ప్లీడరీ లాంటి వృత్తులకు అన్ని జిల్లాల వారూ అత్యధికంగా మద్రాసుకే పోయేవారు.
చంద్రగిరి రాజు అప్పయ్య నాయకుడు తన తండ్రి చెన్నప్ప నాయకుడి పేర కట్టించిన చెన్నపట్టణం పదహారణాల తెలుగు పట్నం. మొదటినుంచీ అక్కడ నివసించిన వారిలో ఇంచుమించు అందరూ తెలుగువారేనని ఈస్టిండియా కంపెనీ రికార్డులు చెబుతాయి. 1891 నాటికి మద్రాసు జనాభా నాలుగు లక్షలు కాగా వారిలో అత్యధికులు తెలుగువారే. క్రమేణా చుట్టుపట్ల తమిళ జిల్లాల నుంచి అరవలు విస్తృతంగా వలసవెళ్లి, పథకం ప్రకారం తెలుగు వీధులకు అరవపేర్లు పెట్టి, జనాభా లెక్కల్లో తమిళం మాట్లాడగలిగిన తెలుగువారిని అరవల కింద చూపించి తిమ్మిని బమ్మి చేశారు. అయినా మద్రాసులో తెలుగు వారికి తమిళులతో సమానంగా పట్టు ఉండేది. కాబట్టే మద్రాసు రాజధానిగా 12 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచాలని 1918 నుంచి ప్రతి వార్షిక సభలోనూ ఆంధ్ర మహాసభ తీర్మానించేది. ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజధాని కావాలన్న తీర్మానం 1933లో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిలులో ఒకే ఒక్క ఓటు తేడాతో వీగిపోయింది. మద్రాసు విషయంలో ఆంధ్రులపట్టు ఎంత గట్టిగా ఉండేదో దాన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. దేశానికి స్వతంత్య్రం వచ్చిన తొలి ఏళ్లలో ‘మద్రాసు మనదే’ అంటూ పెద్ద ఉద్యమమే నడిచింది. తెలుగు నాయకుడు ప్రకాశం -గాంధీని కూడా ధిక్కరించి, అన్ని భాషా వర్గాల మద్దతును కూడగట్టి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఏకంగా ముఖ్యమంత్రే అయ్యాడు.
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దానికి మద్రాసే రాజధాని అవుతుందని యావదాంధ్రులూ... కొంపదీసి అలా అవుతుందేమోనని రాజాజీలాంటి అరవ పెద్దలూ అనుకుంటున్న తరుణంలో - ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచెయ్యాలీ అంటే మద్రాసు నగరం మీద క్లెయిమును ఆంధ్రులు వదిలేసుకోవాలని జె.వి.పి. కమిటీ మెలికపెట్టింది. తెలుగు వాడివై ఉండీ, అన్నీ తెలిసీ, తెలుగు వాళ్లకు అన్యాయం ఎందుకు చేశావని పదుగురూ నిలదీస్తే ఆ కమిటీ మెంబరైన పట్ట్భా సీతారామయ్యగారు గొప్ప వివరణ ఇచ్చాడు. ఆంధ్ర రాష్ట్రంలో మద్రాసును చేర్చకూడదన్నామేగాని అది ఉమ్మడి రాజధాని కాకూడదని మేము చెప్పలేదు గదా? ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసునే రాజధానిగా కొంతకాలం నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. లేదా - మద్రాసు నగరాన్ని ఎవరికీ చెందకుండా ప్రత్యేక రాష్ట్రంగానూ చేయవచ్చు - అని పట్ట్భా భరోసా ఇచ్చాడు. అలాగైతే అభ్యంతరం లేదని ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షుడు రంగా అన్నాడు. పట్ట్భా వివరణతో సంతృప్తి చెంది, ఆ మేరకు జె.వి.పి. నివేదికను ఆమోదిస్తున్నామని ఎ.పి.సి.సి. 1949 నవంబరు 14న తీర్మానం చేసింది.
ఇక అడ్డంకులన్నీ తొలిగాయి - మద్రాసు ఉమ్మడి రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం వచ్చేస్తున్నదని అందరూ ఆశపడుతూండగా పెద్ద మనిషి పట్ట్భా ఇచ్చిన ఉమ్మడి రాజధాని మాట గంగలో కలిసింది. మద్రాసు లేకుండా అయితేనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇస్తామని కాంగ్రెసు వర్కింగు కమిటీ అడ్డం తిరిగింది.
తరవాత - మద్రాసు సిటీ కోసమే, మద్రాసు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం కోసమే పొట్టి శ్రీరాములు బలిపీఠం ఎక్కి, 58 రోజుల ప్రాయోపవేశంతో ఆత్మార్పణ చేశాక, ఆంధ్రదేశమంతా అల్లర్లతో అట్టుడికాక ప్రధాని నెహ్రూకు ఎట్టకేలకు దయకలిగి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని పార్లమెంటులో ప్రకటించాడు. అదికూడ పొట్టి శ్రీరాములు ప్రాణాలను ధారపోసిన మద్రాసు నగరాన్ని మినహాయంచి! కొత్త రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక సర్దుబాట్లను, సాధక బాధకాలను పరిశీలించడానికి జస్టిస్ ఎ.ఎన్.వాంఛూను నియమించారు. ఉన్నపళాన వేరే రాజధానిని వెతుక్కోవటం కష్టం కాబట్టి కొత్త రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిని మద్రాసు నగరంలోనే మూడు నుంచి ఐదేళ్ల వరకు ఉండనివ్వాలని వాంఛూ కమిటీ సూచించింది. ఆంధ్రా పి.సి.సి. కూడా అదే అభ్యర్థన చేసి, మద్రాసును చీఫ్ కమిషనరేట్ ప్రాంతంగా ప్రకటించాలని డిమాండు చేసింది.
కనీసం దానికైనా నెహ్రూ సర్కారు ఒప్పుకుందా? మద్రాసు గడ్డమీద ఆంధ్ర రాజధానికి సూది మోపినంత స్థలం కూడా ఇవ్వరాదని తమిళులు కత్తికట్టారు. తాత్కాలిక రాజధానిని అనుమతిస్తే మద్రాసు నగరం యుద్ధ్భూమి అవుతుంది. తమిళనాట మిగతా ప్రాంతాల్లో అల్లర్లు లేస్తాయి. అక్కడి ఆంధ్రులు ప్రశాంతంగా బతకలేరు అంటూ 32 మంది ఆంధ్రేతర ఎం.పి.లు మెమొరాండం ఇచ్చారు. మద్రాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారేమో వాంఛూ సిఫారసును ఆమోదిస్తే రాజీనామా చేస్తానని బెదిరించాడు. ఇప్పటికిప్పుడు వెళ్లిపొమ్మంటే ఎక్కడికి పోతాం? ఎల్లకాలం ఇక్కడ తిష్ఠ వేయం. కాలూ చెరుూ్య కూడదీసుకునేంత వరకైనా మద్రాసు నుంచి పనిచేసుకోనివ్వండి అని ఉపరాష్టప్రతి రాధాకృష్ణన్, కార్మికమంత్రి వి.వి.గిరి లాంటి పెద్దలు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా - ఆంధ్రులకు అన్యాయం చేయటంలో ఎప్పుడూ ముందుండే నెహ్రూ పండితుడు వినలేదు. ‘మద్రాసు నుంచి కొంతకాలమైనా పనిచేయనిచ్చే ప్రసక్తే లేదు. తాత్కాలిక రాజధానిని ఆంధ్ర ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకోవాలి’ అని 1953 మార్చి 25న లోక్‌సభలో నిర్దాక్షిణ్యంగా అనుశాసించాడు. ఇక చేసేది లేక అప్పటికప్పుడు తట్టాబుట్టా సర్దుకుని, తమదనుకున్న మద్రాసుకు వదిలేసి, ఆంధ్రులు కాందిశీకుల్లా బయటికి పోయారు.
నెహ్రూ అంతటి ప్రియతమ నాయకుడు ప్రధానిగా ఉండి... ప్రకాశం అంతటి ధీరుడు ఆంధ్రులకు పెద్దదిక్కుగా ఉన్నప్పుడే... రాధాకృష్ణన్ అంతటివాడు కలగజేసుకున్నా ప్రయోజనం లేక... కాంగ్రెసు పెద్దలు ఇచ్చిన హామీలకు విలువలేక... రాజధాని విషయంలో దగాపడి తెలుగు వాళ్లు రోడ్డున పడ్డారంటే-
మరికొద్ది నెలల్లో అధికారం గడువు తీరే యు.పి.ఎ. సర్కారు మాటలను, దాన్ని నడిపించే సోనియాగాంధి బాసలను నమ్ముకుని ఇప్పుడు తెలుగు రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చటానికి సమ్మతిస్తే తెలుగు జాతి గతి ఏమవుతుంది? ఆంధ్రులపట్ల నాడు అరవలు చూపిన ద్వేషం రేపు తెలంగాణ్యులు కనపరచరన్న గ్యారంటీ ఏమిటి? కె.ఎస్.రావు, చిరంజీవి, చంద్రబాబు లాంటి ఊసరవెల్లులు తెలుగువారిని కాపాడేవారా?!

http://www.andhrabhoomi.net/content/telugu-tagavu-1
Share this article :

0 comments: