కుమ్మక్కు పార్టీల కొత్త డ్రామా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుమ్మక్కు పార్టీల కొత్త డ్రామా

కుమ్మక్కు పార్టీల కొత్త డ్రామా

Written By news on Saturday, August 3, 2013 | 8/03/2013


కుమ్మక్కు పార్టీల కొత్త డ్రామా
హైదరాబాద్: : కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు తీరని ద్రోహం తలపెట్టిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, రాజీనామాల పేరుతో మరో కొత్త డ్రామాకు తెర తీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ‘‘సీమాంధ్రకు అన్యాయం తలపెట్టిన రెండు పార్టీల నేతలు దొంగ ముసుగు వేసుకుని, ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంలోకి ప్రవేశించి, దాన్ని అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిపట్ల ప్రజలు, ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలి’’ అన్నారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమాన్ని చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయటం చాలా ఆశ్చర్యకరం. పైగా రాజీనామాలను కొందరు పీసీసీ అధ్యక్షుడికి, మరికొందరు సీఎంకు అందజేయడాన్ని బట్టే వారి చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది’’ అని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనకు వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించడం వల్లే ఆ మేరకు నిర్ణయం జరిగిందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల పట్ల అంబటి అభ్యంతరం వ్యక్తంచేశారు.
 
 కేంద్ర హోంమంత్రి నిర్వహించిన అఖిలపక్ష భేటీలో వైఎస్సార్‌సీపీ చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. ‘‘తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తున్నాం. రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా సర్వాధికారాలూ కేంద్రానికే ఉన్నాయి. అయినా మా జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మేము అడిగేదల్లా అన్ని విషయాలను, సమస్యలను పరిగణనలోకి తీసుకొని త్వరతగతిన ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలి’’ అని వివరించారు. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన విభజన అందరికీ ఆమోదయోగ్యమైనదేనా అని అంబటి సూటిగా ప్రశ్నించారు. ‘‘విభజన సమస్య పుట్టినప్పుడు ఉన్న పార్టీ కాకపోయినా విజ్ఞతతో, ముందుచూపుతో మేం చెప్పినదాన్నే ప్రస్తుతం అందరూ అనుసరిస్తున్నారు.
 
  మేం చెప్పిన విషయాలనే కాంగ్రెస్, టీడీపీ నేతలు చెబుతున్నారు’’ అని అన్నారు. రాష్ట్ర ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా డ్రామాలాడుతున్నారని అంబటి ధ్వజమెత్తారు. ‘‘కాంగ్రెస్ ఇలాంటి ప్రకటన చేస్తుందని భావించలేదంటూ కేంద్ర మంత్రి ఒకాయన మొసలి కన్నీరు కారుస్తున్నారు. విభజన అనివార్యమని పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నా కాంగ్రెస్ నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. మీడియా కథనాలకు స్పందించి, బాధ్యతాయుతమైన పార్టీగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు జూలై 17న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు లేఖ రాశారు. తెలంగాణపై ముందు కేంద్రం తన అభిప్రాయం చెప్పి, అన్ని పార్టీలను పిలిచి చర్చించాలని అందులో స్పష్టంగా కోరాం. వాటిని పరిగణనలోకి తీసుకుని ఉంటే రాష్ట్రం ఇలా అగ్నిగుండంలా మారేదే కాదు’’ అన్నారు.
 
 బ్రిటిషోళ్లలా కాంగ్రెస్ తీరు: రాష్ట్రంలో చిచ్చుపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం మరో దుర్మార్గమైన ఆలోచన చేస్తోందని అంబటి నిప్పులు చెరిగారు. బ్రిటిష్ వారి మాదిరిగా విభజించు, పాలించు విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపించారు. ‘‘గుంటూరు, ఒంగోలు, కర్నూలుల్లో మరో రాజధాని తెచ్చుకోవచ్చని సీమాంధ్ర నేతలతో దిగ్విజయ్‌సింగ్ చెబుతూ ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమాన్ని చీల్చి మరో కొత్త చిచ్చు పెడుతున్నారు. విభజనకు చంద్రబాబు రెడ్‌కార్పెట్ పరిచి సీమాంధ్రులకు తీరని ద్రోహం చేశారు. ఆ పార్టీ నేతలేమో తీరిగ్గా మూడు రోజుల తర్వాత  ‘రాజీ డ్రామా’లు చేస్తున్నారు.
 
 రాష్ట్ర విభజనకు టీడీపీ కట్టుబడి ఉందని, కొత్త రాజధాని కోసం రూ.4, 5 లక్షల కోట్లిస్తే  సర్దుకొని వెళ్లిపోతామంటూ చంద్రబాబు దౌర్భాగ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేసరికి అందులో ప్రవేశించి నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. సీమాంధ్ర టీడీపీ నేతలు కన్నీరు కార్చడం మాని, ఇలా ఎందుకు చేశారంటూ బాబును గట్టిగా నిలదీయాలి. బాబుకు విజన్ 2020 లేదు. ఆయన విలన్ 2013!సీమాంధ్రలో ఉద్యమం ఎగసిపడుతుంటే నీరో చక్రవర్తిలా ఆయన ఫిడేల్ వాయిస్తున్నారు’’ అన్నారు. అన్ని ప్రాంతాలకు, ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం వైఎస్సార్‌సీపీ వద్ద ఉందని, కేంద్రం అడిగితే కచ్చితంగా చెబుతామని ఒక ప్రశ్నకు బదులుగా అంబటి చెప్పారు. న్యాయమైన తెలంగాణ విభజనను తమ పార్టీ ఆహ్వానిస్తోందన్నారు.
Share this article :

0 comments: