పదేళ్ల ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యమేనా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పదేళ్ల ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యమేనా?

పదేళ్ల ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యమేనా?

Written By news on Thursday, August 1, 2013 | 8/01/2013

పదేళ్ల ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్: :
  • సీమాంధ్రతో భౌగోళిక అనుసంధానం లేకపోవడం ఇబ్బందే  
  •  ఉద్రిక్తతలు తలెత్తితే రాకపోక లూ కష్టమే
  •  హైదరాబాద్ నుంచి సీమాంధ్ర పాలనా కష్టమే
  •  చండీగఢ్‌కు ఇరు రాష్ట్రాలతో భౌగోళిక అనుసంధానం  
  •  హైదరాబాద్ పరిస్థితి అందుకు భిన్నమంటున్న మేధావులు
 
 పుల్లూరు నుంచి హైదరాబాద్- 210 కి.మీ.
 నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ - 163 కి.మీ.
 కోదాడ నుంచి హైదరాబాద్ - 175 కి.మీ.
 
పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని.. రాష్ట్ర విభజన ప్రక్రియకు ఆమోదం తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు ఎటుచూసినా అవరోధాలే కనిపిస్తున్నాయని మేధావులు, సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్రాల కార్యకలాపాల నిర్వహణ ఎలా ఉంటుందనేది పక్కనపెడితే.. అసలు దశాబ్ద కాలం పాటు ఇది మనుగడ సాగించగలదా అనే అంశంపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయని, ముఖ్యంగా ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్ నగరానికి సీమాంధ్ర ప్రాంతంతో భౌగోళిక అనుసంధానం(లింక్) లేని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎటు చూసినా దాదాపు 200 కిలోమీటర్ల పాటు తెలంగాణ ప్రాంతాన్ని దాటిన తర్వాతే సీమాంధ్ర ప్రాంతాలు వస్తాయి. ‘ఉమ్మడి రాజధాని’, కోస్తాంధ్ర మధ్య తెలంగాణలో భాగమైన నల్లగొండ జిల్లా ఉంటే, హైదరాబాద్-రాయలసీమ మధ్య మహబూబ్‌నగర్ జిల్లా ఉంది. కోస్తాంధ్ర వైపు.. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్, కోదాడ తెలంగాణ సరిహద్దులుగా ఉండగా, రాయలసీమ వైపు ఆలంపూర్ సరిహద్దుగా ఉంది. నీటి పంపకాలు, ఇతర ఏ విషయంలో అయినా ఇరు ప్రాంతాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు.. సీమాంధ్ర, రాజధాని మధ్య రాకపోకలకు అంతరాయం కలిగించే అవకాశం ఉంటుందేమోనని అలాంటప్పుడు ఇబ్బందులు తప్పవని పాలనలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఐఏఎస్ అధికారి ఒకరు తన అభిప్రాయాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.
 
తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరి నదీ జలాల పంపిణీ విషయంలో వివాదం ముదిరి ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య రవాణా స్తంభించడం ఎన్నోసార్లు జరిగిందని ఆయన గుర్తు చేశారు. నీటి పంపకాల విషయంలో తెలంగాణ, సీమాంధ్రల మధ్య జరిగే ఒప్పందాలు ఇరు ప్రాంతాల ప్రజలకు సమానంగా ఆమోదయోగ్యంగా ఉంటాయని ఎవరైనా హామీ ఇవ్వగలరా? అని ఆయన ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ముదిరి ప్రతిష్టంభన ఏర్పడితే.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగినన్ని రోజులు సీమాంధ్ర ప్రజలే ఇబ్బంది పడతారనే వాదన ఇప్పుడు తెరపైకి వస్తోంది. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజలు, వారి ఆస్తుల భద్రతకు కేంద్రం చట్టం తీసుకొచ్చినా.. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు ఆందోళనకారులు రోడ్డు రవాణాను స్తంభింపజేస్తే అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టడం మినహా కేంద్రం ఏమీ చేయలేదని, తమ ప్రాంతానికి చెందిన ఆందోళనకారుల మీద తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే అవకాశం ఉండకపోవచ్చునని అంటున్నారు. ‘పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా ఉంది. అయితే చండీగఢ్‌కు ఇరు రాష్ట్రాలతో భౌగోళిక అనుసంధానం ఉంది. రెండు రాష్ట్రాల నుంచి నేరుగా రాజధానిలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని సమస్య కాలేదు’ అని అధికారులు చెబుతున్నారు.
 
 పాలన మీదా ప్రతికూల ప్రభావం : పాలనకు గుండెకాయలాంటి సచివాలయం ఉమ్మడి రాజధానిలో ఉంటుంది. రాష్ట్రానికి దూరంగా పరిపాలనా కేంద్రం ఉండటం, ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు సీనియర్ అధికారులంతా రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉండటం వల్ల పాలన మీదా ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు అంచనా వేశారు. ఉమ్మడి రాజధాని నిర్వహణ, రాష్ట్రేతర ప్రాంతం నుంచి పాలన సాగించడం అంత సులభమైన వ్యవహారం కాదని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో పేర్కొనడాన్ని గుర్తుచేశారు. కేంద్రం తగినన్ని నిధులు ఇస్తే రెండేళ్లలో రాజధాని ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.
Share this article :

0 comments: