రాష్ట్ర విభజన కేంద్ర నాయకత్వం కర్కోటక నిర్ణయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర విభజన కేంద్ర నాయకత్వం కర్కోటక నిర్ణయం

రాష్ట్ర విభజన కేంద్ర నాయకత్వం కర్కోటక నిర్ణయం

Written By news on Monday, August 19, 2013 | 8/19/2013

ఆమరణ దీక్ష భగ్నం
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ జిల్లా కడప నగరంలో ఏడురోజులుగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి, పార్టీ నేతలు హఫీజుల్లా, పాండురంగారెడ్డి, సంపత్‌కుమార్‌లు చేస్తున్న ఆమరణ దీక్షలను ఆదివారం రాత్రి 9గంటలకు పోలీసులు భగ్నం చేశారు. కడప డీఎస్పీ  రాజేశ్వరరెడ్డి నేతృత్వంలో ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, పదుల సంఖ్యలో పోలీసులు ఒక్కమారుగా శిబిరంపై దాడి చేసి నేతలను బలవంతంగా ఎత్తుకెళ్లి రిమ్స్‌కు తరలిం చారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనే కాంగ్రెస్ పార్టీ కుట్రలను నిరసిస్తూ, అన్నిప్రాంతాలను సమన్యాయం చేయాలనే డిమాండ్‌తో ఈనెల 12న రాయచోటి ఎమ్మెల్యే గడికోట, కడప మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డితో పాటు మరో ముగ్గురు నేతలు కలెక్టరేట్ ఎదుట ఆమరణ  దీక్షకు కూర్చున్నారు.
 
ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక మొక్కవోని ధైర్యంతో దీక్ష చేస్తున్న నేతల స్ఫూర్తితో ప్రజానీకం రోడ్లపైకి వచ్చి ప్రత్యక్షపోరాటం చేసింది. దీక్షలకు వస్తోన్న ప్రజాస్పందన చూసి భరించలేని సర్కారు ఆదేశాలతో పోలీసులు మూకుమ్మడిగా శిబిరంపై దాడిచేసి ఐదుగురినీ రిమ్స్‌కు తరలించారు.  శాంతియుతంగా కొనసాగిస్తున్న నేతలను అరెస్టు చేసేందుకు యత్నిస్తుండడంతో పార్టీ శ్రేణులు పోలీసు చర్యలను ప్రతిఘటించాయి. పోలీసుల చర్యలను నిరసిస్తూ వైఎస్సార్ టీయూసీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు మేసా ప్రసాద్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డిలు ఆదివారం రాత్రి నుంచే ఆమరణ దీక్షకు దిగారు. పోలీసుల అక్రమ అరెస్టు ఖండిస్తూ  పార్టీ సిటీ కన్వీనర్ అంజాద్ బాషా సోమవారం కడపనగరం బంద్‌కు పిలుపునిచ్చారు.
 
ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తాం: రవీంద్ర
ఏడురోజులుగా శాంతియుత దీక్ష చేస్తున్నాం. దీక్షకు స్పందించాల్సింది పోయి మమ్మల్ని అరెస్టు చేయడం దారుణం. దీక్షను భగ్నం చేశామని పోలీసులు, ప్రభుత్వం భావించవచ్చు. కానీ ఆస్పత్రిలోనూ దీక్షను కొనసాగిస్తాం. సమైక్య ప్రకటన వచ్చేంత వరకూ ప్రాణాలు పోయినా దీక్షను ఆపే ప్రసక్తే లేదు. ఆ మేరకు రిమ్స్‌లో వైద్యం తీసుకోకుండా నిరాకరించారు.
 
ప్రాణాలు పోయినా మా ప్రాంతానికి అన్యాయం జరగనివ్వం..  శ్రీకాంత్‌రెడ్డి
దీక్షను భగ్నం చేయడం అన్యాయం. రాష్ట్ర విభజన కేంద్ర నాయకత్వం కర్కోటక నిర్ణయం. ఆ నిర్ణయం వల్ల మా ప్రాంతానికే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రాణాలు పోయినా మాప్రాంతానికి మాత్రం అన్యాయం జరగనివ్వం. సమైక్య ప్రకటన వెలువడే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదు.
Share this article :

0 comments: