తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీ డబుల్ గేమ్: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీ డబుల్ గేమ్: షర్మిల

తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీ డబుల్ గేమ్: షర్మిల

Written By news on Friday, August 2, 2013 | 8/02/2013

తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీ డబుల్ గేమ్: షర్మిల
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్, టీడీపీ డబుల్ గేమ్ ఆడుతున్నాయని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు. తమ పార్టీ ఒక్కటే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతోందని చెప్పారు. తెలంగాణ అంశం ఎన్నికలు లేదా రాజకీయ అంశం కాదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ను తామెప్పుడూ గౌరవిస్తామన్నారు. నిష్పక్షపాతంగా, న్యాయబద్దంగా రాష్ట్ర విభజన జరిగితే తమకు అభ్యంతరం లేదని 'హెడ్ లైన్స్ టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తూనే 'హెడ్ లైన్స్ టుడే'కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. వైఎస్సార్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేశారని, దీంతో ఆయన హయాంలో తెలంగాణ, నక్సలిజం సమస్య సమసిపోయిందని షర్మిల తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లో విఫలమవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం జనాభా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తోందని తెలిపారు. నదుల దిగువన ఉన్న కోస్తాంధ్రకు విభజన కారణంగా నీళ్లు అందకుంటే ఏడారిగా మారే ప్రమాదముందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం లేదా ఉమ్మడిగా రాజధానిగా ప్రకటించాలని షర్మిల అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు సరిపోవని చెప్పారు. ఆదాయం పంపిణీ సహా పలు అంశాలు రాష్ట్ర విభజనతో ముడిపడివున్నాయని తెలిపారు. హైదరాబాద్ లోని ఆంధ్రావాసుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వలేదని ఆమె విమర్శించారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైఎస్సార్ సీపీ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ మాత్రం గోడ మీద పిల్లివాటం ప్రదర్శిస్తున్నాయని దుయ్యబట్టారు.

రాష్ట్ర విభజన అంశం ఎన్నికలు లేదా రాజకీయాలకు సంబంధం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని తన తండ్రి వైఎస్సార్ విశ్వసించారని తెలిపారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోలేదన్న దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ... ఇది క్విక్ ప్రో కో కాక మరేమిటని నిలదీశారు. తెలంగాణపై కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని ఆమె ఆరోపించారు. నాలుగేళ్ల పాటు సాగదీసి, ఇంత హడావుడిగా తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదమన్నారు.

తెలంగాణ సెంటిమెంట్ ను తామెల్లప్పుడూ గౌరవిస్తామని షర్మిల చెప్పారు. ఇరు ప్రాంతాల వారికి అన్యాయం జరగకుండా రాష్ట్ర విభజన జరిగితే వ్యతిరేకించబోమని స్పష్టం చేశారు. విభజన విషయంలో తాము అడిగిన అంశాలపై కాంగ్రెస్ వివరణ ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ స్పందిస్తే తామ కూడా స్పందిస్తామన్నారు. ఎవరితోనూ సంప్రదించకుండా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల వారితో కాంగ్రెస్ చర్చలు జరపాలని షర్మిల సూచించారు.
Share this article :

0 comments: