ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పునర్విభజన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పునర్విభజన

ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పునర్విభజన

Written By news on Friday, August 2, 2013 | 8/02/2013

పంచాయతీ ఎన్నికల పర్వం ముగియగానే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల కసరత్తు మొదలైంది. పునర్విభజనతోపాటు ఆయా స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ జారీ చేసింది. ఇందులో భాగంగా ముందుగా మండల ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నెల 14వ తేదీన పునర్విభజన ముసాయిదాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత వారం రోజులపాటు.. అంటే 21వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వచ్చిన అభ్యంతరాలపై 22 నుంచి కసరత్తు మొదలుపెట్టి 26న నిర్ణయం తీసుకోనున్నారు. 27వ తేదీన ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు.
 
  అదే రోజున  పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదించి జిల్లా గెజిట్‌లో ప్రచురించనున్నారు. ఈ మొత్తం  బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ పంచాయతీరాజ్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పునర్విభజనకు పాటించాల్సిన మార్గదర్శకాలను సైతం ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించారు. కొత్త నిబంధనల ప్రకారం పునర్విభజనకు 2011 జనాభా లెక్కల ను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఒక్కో ఎంపీటీసీ (మండల ప్రాదేశిక నియోజకవర్గం) పరిధిలో ఓటర్ల సంఖ్య కనీసం మూడు వేలకు తక్కువ కాకుండా నాలుగు వేలకు ఎక్కువ కాకుండా ఉండేలా చూడాలి. ఎంపీటీసీల పరిధి విభజనలో వార్డు మొత్తం, గ్రామ పంచాయతీలు మొత్తంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వార్డు విలీనంతో ఓటర్లు పెరిగినా... తగ్గినా పంచాయతీరాజ్ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
 
 రెండేళ్ల క్రితం ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగిసిన విషయం విదితమే. అప్పటినుంచీ ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. అప్పటి లెక్కప్రకారం జిల్లాలో 50 జెడ్పీటీసీలు, 760 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గ్రేటర్ వరంగల్‌లో పరిసర గ్రామాలు విలీనం కావడంతో హన్మకొండ మండలం రద్దయింది.  నేపథ్యంలో జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 49కి పరిమితమవనుంది. కొత్తగా పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నగర పంచాయతీలుగా మారడం, మహబూబాబాద్ మునిసిపాలిటీ హోదాలో ఉండడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య సైతం మారిపోనుంది.  దీనికి తోడు కొత్త మార్గదర్శకాలతో ఈ సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశాలున్నారుు.
 
 ఇటీవలి పంచాయతీ ఎన్నికల సమయంలో ఉన్న ఓటర్ల జాబితాల ప్రకారం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 17.62 లక్షలు. ఈ లెక్కన కొత్త మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో గరిష్ఠంగా 587,  కనిష్ఠంగా 440 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడనున్నాయి. పునర్విభజనతో ఈ సంఖ్య తేలిపోతుంది. తర్వాతే రొటేషన్ పద్ధతి ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. రెండేళ్ల కిందట 2011లో ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలకు చేసిన రిజర్వేషన్లు తాజా ప్రక్రియతో రద్దయినట్లే. కొత్తగా ఖరారయ్యే రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించనున్నారు.
Share this article :

0 comments: