సీమను చీల్చే కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీమను చీల్చే కుట్ర

సీమను చీల్చే కుట్ర

Written By news on Thursday, August 8, 2013 | 8/08/2013

సీమను చీల్చే కుట్ర : గడికోట శ్రీకాంత్‌రెడ్డి
 వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం
  బాబు రాజగురువే చీల్చాలని చెప్పారు
  సీమను విడదీస్తుంటే కిరణ్, చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?
   నేతలు మౌనం దాలిస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి విపత్కర పరిస్థితులను సృష్టించిన కాంగ్రెస్ అధిష్టానవర్గం.. రాయలసీమ జిల్లాలను కూడా చీల్చాలన్న దుర్మార్గానికి ఒడిగట్టడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
 కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గపు పనికి రాయలసీమ ప్రాంతానికే చెందిన కొందరు నేతలను పావులుగా వాడుకుంటోందని.. విభజించు-పాలించు అనే బ్రిటిష్ విధానాన్ని అమలుచేస్తోందని విమర్శించారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్లి.. రాష్ట్రాన్ని విభజిస్తే తమను తెలంగాణతో కలపాలని  సోనియాగాంధీని అడిగారని, ప్రధాని మన్మో హన్‌నూ అదే కోరబోతున్నారని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.
 
 మంత్రి రఘువీరారెడ్డి కూడా  తాను సోనియాను కలిసి రాష్ట్రాన్ని విభజిస్తే గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని చెబుతానని చెప్పారు. ఈ నేతలు రాష్ట్ర సమైక్యత కోసం పాటు పడుతున్నామని బయటకు చెబుతూ... తెరవెనుక సోనియా తో రాయలసీమను చీల్చే ప్రతిపాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతినిధి బృందంలో వెళ్లిన కాంగ్రెస్ నేతలే ఈ విషయాలను బయటకు చెబుతున్నారన్నారు. రాజకీయంగా తాను పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ రాయలసీమను చీల్చాలనుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రాంతా ల మధ్య చిచ్చు పెట్టింది చాలక.. జిల్లాల వారీగా కూడా చిచ్చుపెట్టే దౌర్భాగ్య స్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుకుందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ‘‘శతాబ్దాల చరిత్ర ఉన్న రాయలసీమను చీల్చాలనే కుట్ర జరుగుతున్నా.. అదే ప్రాంతానికి చెందిన సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రులు గల్లా అరుణ, రామచంద్రయ్య, అహ్మదుల్లా వంటి వారు ఎందుకు స్పందించడం లేదు.
 
 కాంగ్రెస్ దుర్బుద్ధిని ఎందుకు ప్రశ్నించ లేకుండా ఉన్నారు? వారంతా గాడిదలు కాస్తున్నారా? లేక తాము పదవుల్లో ఉంటే చాలనుకుంటున్నారా?’’ అని గడికోట ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇందిరాగాంధీకి స్వతహాగానే ప్రజాదరణ ఉండేదని, ప్రస్తుతం సోనియాకు ఏమాత్రం ప్రజాదరణ లేకపోవడంతో.. ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రజాదరణ గలిగిన బలమైన నాయకుడు ఎదుగుతూ ఉంటే ఓర్వడం లేదని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ‘‘2009 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 33 లోక్‌సభ స్థానాలు గెలిపించి ఇస్తే... కాంగ్రెస్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టింది. రాష్ట్రాన్ని, జిల్లాలను చీలికలు చేసి తగవు పెడుతోంది. గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతగా కాంగ్రెస్ ఇచ్చే బహుమతి ఇదా!’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ మంచి సంక్షేమ పథకాలు అమలు చేసి, ఒంటరి పోరాటం చేసి 33 స్థానాలు గెలిపించి ఇస్తే... ఆయనను కూడా బలహీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు జగ న్‌మోహన్‌రెడ్డి బలమైన నాయకుడవుతాడనే భయం కాంగ్రెస్‌కు పట్టుకుందని, 30, 40 లోక్‌సభ సీట్లు గెలుచుకుని ఆయన తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవిస్తే తమకు సమస్యలు వస్తాయనే కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పారు.
 
 బాబు, రాజగురువు ఆస్తుల కోసమేనా!?
 ‘‘చంద్రబాబు తన ఆస్తులు, తన రాజగురువు ఆస్తులు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతోనే మాట్లాడడం లేదు.. చంద్రబాబు రాజగురువే సాక్షాత్తు గవర్నర్ వద్దకు వెళ్లి రాష్ట్రాన్ని ఎలా విభజించాలో చెప్పి వచ్చారట.. ఈ రాష్ట్రం, తెలుగు ప్రజలు ఏమైపోయినా ఆ రాజగురువుకు పట్టలేదు. తెలుగు ప్రజల బలీయమైన ఆకాంక్షలు, మనోభావాలు ఆయనకు పట్టలేదు..’’ అని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదని, ఏ ప్రాంతం ఎటుపోయినా ఫర్వాలేదని మౌనంగా ఉంటే నష్టం జరుగుతుందన్నారు.
 
 నేతలు ఇప్పటికైనా నోరు విప్పాలని లేదా తమకు పదవులు, స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం కనుక మాట్లాడబోమని చెప్పాలని తాను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. నోరు మెదిపితే సీబీఐ కేసులు పెడతామని చంద్రబాబును కాంగ్రెస్ బెదిరించిన మాట వాస్తవం కాదా? అని కూడా ఆయన ప్రశ్నించారు. వారికి లొంగి మౌనంగా ఉంటే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడితే ప్రజలు తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నారు.
 
 కాంగ్రెస్ తీరు నాజీయిజమే !
 కాంగ్రెస్ వ్యవహారం చూస్తోంటే జర్మనీలో నాజీ నియంతల తీరును గుర్తుకుతెస్తోందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. నాజీలు ప్రజలను ఎలా విభజించి హతమార్చిందీ రచయిత మార్టిన్ నిలోమర్ చెప్పిన మాటలను ఆయన ఉదహరించారు. ‘‘వాళ్లు (నాజీలు) ముందుగా కమ్యూనిస్టులను చంపాలని వచ్చారు.. మేం కమ్యూనిస్టులం కాదు కనుక ఏమీ మాట్లాడలేదు.. వారిని నరికేశారు. రెండోసారి సోషలిస్టులను హతమార్చాలని వచ్చారు.. మేం సోషలిస్టులం కాదు కనుక పట్టించుకోలేదు.. వారినీ చంపేశారు.
 
 ఆ తరువాత వాళ్లు ట్రేడ్ యూనియన్ నేతల కోసం వచ్చారు. నేను ట్రేడ్ యూనియన్ నేతను కాదు కనుక జోక్యం చేసుకోలేదు.. అనంతరం క్యాథలిక్‌ల కోసం వచ్చారు.. మళ్లీ యూదుల కోసం వచ్చారు..  ఎప్పుడూ అంతే. చివరిగా వాళ్లు నాకోసమే వచ్చామన్నారు. అపుడు నా వెనుక ఎవరైనా ఉన్నారేమోనని చూశాను.. అప్పటికి ఎవరూ మిగల్లేదు. నా గురించి మాట్లాడేవారే లేకుండా పోయారు..’’ అని ఆ రచయిత వాపోయారని చెప్పారు.
 
  రాష్ట్రంలో పరిణామాలు కూడా అలాగే ఉన్నాయని గడికోట వ్యాఖ్యానించారు. ‘‘తొలుత జగన్‌పైకి వచ్చారు.. ‘ఆయన మా పార్టీ కాదు కదా, మేమెందుకు మాట్లాడాలి’ అని వేరే పార్టీల వారు భావించారు. తరువాత కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పూనుకుంది. ‘ఈ ప్రాంతం మాది కాదు కదా, ఎందుకు మాట్లాడాలి’ అనుకున్నారు. ఈ రోజు జిల్లాల వారీగా చీలికలు తెస్తున్నారు. ఇంకా మేమెందుకు మాట్లాడాలని నాయకులు మౌనంగా కూర్చోవడం చూస్తోంటే ఆనాడు నాజీల సమయంలోలాగే అందరూ బలికావాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: