బాబూ.. వెన్నుపోటు యాత్ర చేయండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబూ.. వెన్నుపోటు యాత్ర చేయండి

బాబూ.. వెన్నుపోటు యాత్ర చేయండి

Written By news on Wednesday, August 21, 2013 | 8/21/2013

బాబూ.. వెన్నుపోటు యాత్ర చేయండి: ప్రవీణ్‌కుమార్‌రెడ్డి
టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ నేత ప్రవీణ్‌కుమార్‌రెడ్డి
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి ఇప్పుడు యాత్ర చేస్తారా?
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు చంద్రబాబే కారణం
ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవిశ్వాసం నుంచి రెండుసార్లు కాపాడారు
ప్రభుత్వం పడిపోయి ఉంటే ఈ అడ్డగోలు నిర్ణయాలు వచ్చేవే కావు

 
 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన యాత్రకు ‘తెలుగుజాతికి వెన్నుపోటు’ యాత్రగా నామకరణం చేసుకుంటే బాగుంటుందని తాజా మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకైన ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి తీవ్ర అవమానానికి గురిచేసిన చంద్రబాబు.. ఇప్పుడు తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని ఢిల్లీ వీధుల్లో నాలుగు లక్షల కోట్లకు అమ్మేశారని దుయ్యబట్టారు. ఆ డబ్బుతో సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటు చేసుకుంటామని చెప్పిన వ్యక్తి.. ఇప్పుడు యాత్ర తలపెట్టడం హాస్యాస్పదమని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు చంద్రబాబు వైఖరే కారణమన్నారు.  
 
 కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవిశ్వాసం నుంచి రెండుసార్లు గట్టెక్కించి ప్రజల పాలిట గుదిబండలా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాసం పెట్టినప్పుడు చంద్రబాబు మద్దతిచ్చి ఉంటే ఈ ప్రభుత్వం పడిపోయేదని, ఇలాంటి అడ్డగోలు నిర్ణయాలు వచ్చేవే కాదని చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి గత కొంత కాలంగా మీడియాలో వార్తా కథనాలు వస్తున్నా చంద్రబాబు ఎందుకు మౌనం దాల్చారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల మాదిరిగా ముందుగానే టీడీపీ, కాంగ్రెస్ నేతలు కూడా రాజీనామా చేసుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని వివరించారు. తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసిన చంద్రబాబు కచ్చితంగా యాత్ర చేయాల్సిందేనని, దానికి మాత్రం ‘తెలుగుజాతి విధ్వంసకర యాత్ర, ఆత్మగౌరవం తాకట్టుపెట్టే యాత్ర, ఆత్మాభిమానాన్ని అమ్ముకోవడం, వెన్నుపోటుయాత్ర’ అనే పేర్లతో యాత్ర చేయాలంటూ నిప్పులు చెరిగారు.
 
 సోనియాకు గండ్ర గొడ్డలి ఇచ్చింది బాబే
 ‘‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ నాయకుడికీ లభించని అవకాశం తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు తెలుగుజాతి కల్పించింది. అయితే అవకాశం ఇచ్చిన వారినే అడ్డంగా నరికేయమని ఆయన సోనియాకు గండ్ర గొడ్డలిని ఒకటి రెండుసార్లు కాకుండా ఏకంగా ఆరుసార్లు ఇచ్చారు. 2008లో ప్రణబ్ కమిటీ రాష్ట్రాన్ని రెండుగా విభజించాలంటూ లేఖ ఇచ్చారు. 2009లో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. 2009 డిసెంబర్ 6న అసెంబ్లీలో తీర్మానం పెట్టి, విడగొట్టాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 7న అప్పటి సీఎం రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అదే చెప్పారు.
 
 ఆ తర్వాత ఎవరూ అడగకపోయినా 2012, సెప్టెంబర్ 25న కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. డిసెంబర్‌లో జరిగిన అఖిలపక్షభేటీలో అదే చెప్పారు. తెలుగుజాతిని నిట్టనిలువునా చీల్చాలంటూ ఆరుసార్లు ప్రయత్నించారు’’ అని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని పట్టుబట్టిన చంద్రబాబు.. సీమాంధ్ర ప్రాంతానికి జరిగే అన్యాయాలను ఏ ఒక్కటీ ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తెలుగు ప్రజల ముందుకు వస్తారని ప్రశ్నించారు. గతంలో బ్రిటిష్ వారు భారతదేశ ద్రోహులను కొందరిని లోబరుచుకొని .. దేశాన్ని విచ్ఛిన్నం చేసిన  చరిత్ర ఇప్పుడు కూడా పునరావృతమవుతోందన్నారు.
 
 బయటి నుంచి వచ్చిన సోనియాకు తెలుగుజాతికి భంగం కలిగించేలా, రాష్ట్రాన్ని ముక్కలు చేసే కుట్రలో చంద్రబాబు భాగస్వామి అయ్యారని దుయ్యబట్టారు. తెలుగుజాతికి తీరని ద్రోహం తలపెట్టినందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సేకు భారతీయుల హృదయాల్లో ఎలాంటి స్థానం ఉందో అలాగే తెలుగుజాతికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు అదే స్థానం ఉంటుందని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే రాష్ట్రం ఇప్పటిదాకా సమైక్యంగా ఉండగలిగిందని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆయన బతికున్నంత వరకు సోనియాగాంధీ, టీఆర్‌ఎస్ రాష్టాన్ని విభజించాలని కనీసం కలలో కూడా సాహసించ లేకపోయారన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సమైక్య అభివృద్ధికి కృషిచేసి, ఉద్యమాల నుంచి దృష్టి మళ్లించిన నాయకుడు రాజశేఖరరెడ్డి అని చెప్పారు.
Share this article :

0 comments: