ఇరు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాలే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇరు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాలే..

ఇరు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాలే..

Written By news on Thursday, August 1, 2013 | 8/01/2013

ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్:  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయడం శుభపరిణామమని, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో వైఎస్సార్‌సీపీనే గెలుపొంది అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ తరఫున సర్పంచ్ అభ్యర్థులుగా విజయం సాధించిన వారికి బుధవారం ఖమ్మంనగరంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణపై ప్రకటన చేయగానే అధికార, ప్రతిపక్షాలు తెలంగాణలో వైఎస్సార్‌సీపీ పనైపోయిందని ప్రచారం చేస్తూ ప్రజలను ప్రలోభపెట్టడానికి చూస్తున్నాయని, వీటిని నమ్మవద్దని వారు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని అన్నిప్రాంతాల ప్రజలకు చేరాయని, రాష్ట్రం లోని బడుగు, బలహీన వర్గాల వారు మొత్తం వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారని అన్నారు.
 
 జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రెండు రాష్ట్రాల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న కాంగ్రెస్, 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ, అనేక సంవత్సరాల చరిత్ర ఉన్న కమ్యూనిస్టులను ప్రజలు నమ్మలేదని, వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులను 110 స్థానాల్లో గెలిపించారని అన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మండల పరిషత్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గెలిచిన అభ్యర్థులు వైఎస్ ఆశించిన పాలనను అందించి మళ్లీ ఏ ఎన్నికలు వచ్చినా తిరిగి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో మనమే నంబర్ వన్‌గా నిలిచామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా రాజన్నకు ఆదరణ ఉందని, రెండు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ గట్టిపట్టు కలిగి ఉందని అన్నారు.తెలంగాణలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలన్నారు.
Share this article :

0 comments: