నేటి మధ్యాహ్నం 2 గంటల తర్వాత జైలు నుంచి విడుదల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి మధ్యాహ్నం 2 గంటల తర్వాత జైలు నుంచి విడుదల

నేటి మధ్యాహ్నం 2 గంటల తర్వాత జైలు నుంచి విడుదల

Written By news on Tuesday, September 24, 2013 | 9/24/2013

* వైఎస్ జగన్‌కు బెయిల్
మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు
నేటి మధ్యాహ్నం 2 గంటల తర్వాత జైలు నుంచి విడుదల
ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారనడానికి సీబీఐ ఆధారాలు చూపలేదు: న్యాయమూర్తి
కొన్ని షరతులతో బెయిల్ మంజూరు
 
కారుమబ్బులు తొలిగాయి. సుదీర్ఘ గ్రహణం వీడింది. న్యాయం నిలిచింది. ధర్మం గెలిచింది. రాహు కేతువుల్లా కాంగ్రెస్, టీడీపీలు అటు సీబీఐతో, ఇటు తమ తాబేదారు మీడియాతో కలిసి పన్నుతూ వచ్చిన కుయుక్తులకు తెరపడింది. 484 చీకటి రాత్రులను చీల్చుకుంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తిరిగి జనం మధ్యకు రానున్నారు. ఆయనకు సీబీఐ కోర్టు బెయిల్ ఇచ్చింది. సీబీఐ నాలుగు నెలల్లో దర్యాప్తును పూర్తి చేయాలని, ఆ తర్వాత బెయిల్ కోసం జగన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని 2013 మే 9న సుప్రీంకోర్టు పేర్కొనడం తెలిసిందే. ఆ మేరకు జగన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌రావు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం    2 గంటల తర్వాత జగన్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు.
 
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోరుతూ ఇటీవల జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావు సోమవారం తీర్పు వెలువరించారు. బెయిల్‌పై విడుదల చేస్తే జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తం చేసిన సీబీఐ అందుకు బలమైన ఆధారాలను చూపలేదని తెలిపారు. జగన్ తరఫు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనతో ఏకీభవిస్తూ జగన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రూ.2 లక్షల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించి బెయిల్ పొందాలన్నారు. న్యాయస్థానం అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేయరాదని సూచించారు. కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని చెప్పారు.

న్యాయస్థానం విధించిన షరతులను జగన్ ఉల్లంఘిస్తే ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ఎప్పుడైనాసరే కోరవచ్చని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు విధించిన షరతుల మేరకు పూచీకత్తు బాండ్లను జగన్ తరఫు న్యాయవాదులు మంగళవారం కోర్టుకు సమర్పించనున్నారు. దీంతో దాదాపు పదహారు నెలల (484 రోజులు) తర్వాత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తరువాత చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు.

సీబీఐది అపోహ మాత్రమే
జగన్‌కు బెయిల్ ఇస్తే, ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారనేది కేవలం సీబీఐ అపోహ మాత్రమేనని సుశీల్‌కుమార్ గతవారం వాదనల సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ‘సీబీఐ ఈ తరహా ఆరోపణలు గతంలో ఎప్పుడూ చేయలేదు. జగన్ బెయిల్ పిటిషన్లు గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణకు వచ్చినప్పుడు కూడా... దర్యాప్తు పెండింగ్‌లో ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వరాదని మాత్రమే సీబీఐ చెప్పింది. దర్యాప్తు పూర్తి కాని అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొన్న ఉన్నత న్యాయస్థానాలు ఆ మేర జగన్‌కు బెయిల్ నిరాకరించాయి.

అయితే తాజాగా జగన్ బెయిల్‌ను వద్దనేందుకు సీబీఐ ఎటువంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదు. కేవలం ఆపోహలు, అనుమానాల ఆధారంగా బెయిల్ ఇవ్వరాదని కోరుతోంది. కేవలం బెయిల్‌ను అడ్డుకునేందుకే, నిందితుల హక్కులను కాలరాసేందుకే సీబీఐ ఈ తరహా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది..’ అని వివరించారు. దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత నిందితులకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని తెలిపారు.

పారదర్శకమైన తుది విచారణ (ట్రయల్) జరగాలంటే నిందితులకు బెయిల్ ఇవ్వాలని, నిందితులు బయట ఉన్నప్పుడే వారు తమ వాదనను సమర్థవంతంగా వినిపించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసినట్లు సుశీల్‌కుమార్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2జీ కేసులో కూడా నిందితులుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సహా నిందితులందరికీ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, సుప్రీం తీర్పుల ప్రకారం బెయిల్ పొందేందుకు అర్హుడు కాబట్టి జగన్‌కు బెయిల్ ఇవ్వాలని కోరారు.
 
సీబీఐ ఆధారాలు చూపలేదు: కోర్టు
‘బెయిల్ మంజూరు చేసే సమయంలో నిందితుడు దర్యాప్తు దశలోనే కాక, విచారణ (ట్రయల్) దశలో కూడా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందా? లేదా? అన్న విషయాన్ని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావు లేదు. అయితే అటువంటి భయాందోళనలు వ్యక్తం చేసే ముందు ప్రాసిక్యూషన్ అందుకు సంబంధించిన బలమైన ఆధారాలను న్యాయస్థానాల ముందుంచాలి. సంజయ్ చంద్ర వర్సెస్ సీబీఐ కేసులో 2012లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ‘పిటిషనర్ సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ చెబుతున్నప్పటికీ, అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలను ఉంచలేదు. విచారణ సమయంలో పిటిషనర్ సాక్ష్యాలను తారుమారు చేస్తారనేందుకు కూడా ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. కాబట్టి ఈ దశలో సీబీఐ వాదనను ఆమోదించడం కష్టం..’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.

అయితే రామలింగరాజు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ ప్రస్తావించింది. కేసు పరిస్థితులు, అసాధారణ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని రామలింగరాజు బెయిల్‌ను రద్దు చేసినట్లు సీబీఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెబుతున్నారు. కానీ ఈ కేసులో పిటిషనర్ (జగన్) తరఫు సీనియర్ న్యాయవాది వాదించినట్లుగా ప్రాసిక్యూషన్ ఎటువంటి అసాధారణ వాస్తవాలను కోర్టు ముందుంచలేదు. కాబట్టి ప్రాసిక్యూషన్ భయాందోళనలను ఈ దశలో ఆమోదించడం కష్టసాధ్యం. బలమైన ఆధారాలను చూపి, పిటిషనర్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరే స్వేచ్ఛ ప్రాసిక్యూషన్‌కు ఎప్పుడూ ఉంటుంది.’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
Share this article :

0 comments: