60 శాతం మంది రోడ్డెక్కుతున్నా పట్టదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 60 శాతం మంది రోడ్డెక్కుతున్నా పట్టదా

60 శాతం మంది రోడ్డెక్కుతున్నా పట్టదా

Written By news on Sunday, September 29, 2013 | 9/29/2013

విభజన ఆపకుంటే చరిత్రహీనులమే
సాక్షి, హైదరాబాద్‌: అడ్డగోలు విభజనను తక్షణం ఆపకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విభజనను ఆపాలంటే నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తేనే సాధ్యమవుతుందని చెప్పారు. 13 సీమాంధ్ర జిల్లాలకు చెందిన సమైక్యాంధ్ర న్యాయవాదులు జగన్‌ను శనివారం లోటస్‌పాండ్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి జగన్‌ ప్రసంగించారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని డిమాండ్‌ చేస్తూ జేఏసీ కేంద్రానికి ఒక లేఖ రాస్తే దానిపై తాను సంతకం చేస్తానని ప్రతిపాదించారు.
 
‘‘వైఎస్సార్‌సీపీతో పాటు సీపీఎం, ఎంఐఎం కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్నాయి. జేఏసీ లేఖపై ఒక్కొక్కరుగా సంతకాలు చేస్తే మూడు పార్టీలు కాస్తా ఐదు, ఆరు, ఏడు కావచ్చు. సంఖ్య పెరిగే కొద్దీ విభజన ప్రక్రియ ఆగిపోక తప్పదు’’ అని చెప్పారు. సమైక్యమంటే రాయలసీమ, కోస్తా, తెలంగాణ కూడా కావాలన్నారు. రాష్ట్రం పెద్దదిగా, ఒక్కటిగా ఉన్నప్పుడే మన రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి ఉంటుందని విశ్లేషించారు. జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే...

‘‘ఈ రాష్ట్రం మొత్తం ఒక్కటిగా ఉంటేనే సమష్టిగా ఉంటుంది. ఇవాళ ఒక్కటి చెప్పాలి. మనం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అడుగుతున్నాం. సమైక్యమంటే రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ కూడా కావాలి. రాష్టమ్రంతా పెద్దదిగా, ఒక్కటిగా ఉంటేనే మన రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి కాస్తో కూస్తో ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నాలకు సంబంధించి నేనొక ఉదాహరణ చెబుతా. ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలకు న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు యథావిధిగా వదిలేయాలే తప్ప ఒకరికి అన్యాయం చేసేలా పంపకాలు చేస్తే రేపటి రోజున కొట్టుకునే పరిస్థితి వస్తుంది’’

60 శాతం మంది రోడ్డెక్కుతున్నా పట్టదా

‘‘ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు. 60 శాతం మంది ప్రజలు నడిరోడ్డు మీదకొచ్చి, తమకు అన్యాయం జరుగుతుందంటున్నారు. అయినా కనిపించడం లేదా అని రాష్ట్రానికి, కేంద్రానికి చెందిన పెద్దలను అడుగుతున్నా. 60 శాతం మంది ప్రజలు ఆందోళనలు చేస్తుంటే, విభజన నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని ఎలా అనుకుంటున్నారని కేంద్రానికి, రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులను అడుగుతున్నా. ఎవరికీ ఆమోదం కాకపోయినా, అన్యాయం జరుగుతున్నా ఇవాళ రాష్ట్రాన్ని విభజించడానికి వీళ్లు చేస్తున్న ప్రయత్నాలను మనమంతా ఈ వ్యవస్థలోకి నిజాయితీని తీసుకొచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయాలి’’

పాలకులారా... బదులివ్వండి!

‘‘ఇవాళ నిజాయితీ కరువైందని నాకు ఎక్కడ అనిపించిందంటే, ఒక్క విషయం చెప్పాలి. కాంగ్రెస్‌, టీడీపీ వాళ్లు ఒకరేమో ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరొకరేమో ఓట్లు, సీట్లు పోతాయని అన్యాయం జరుగుతున్నా మాట్లాడని పరిస్థితి కన్పిస్తోంది. ఇవాళ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. అదేమిటంటే... చరిత్రహీనులుగా మిగిలిపోకుండా ఉండాలని. జరుగుతున్న ఈ విభజనను ఆపకపోతే చరిత్రహీనులుగానే మిగిలిపోతాం. కారణమేమిటంటే ఒక్కసారి నీటి పరిస్థితిని గమనించండి. ఇప్పటికే మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత నీరు కర్ణాటకకు వచ్చి అక్కడ ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండితే తప్ప మనకు నీరు వదలని పరిస్థితి! రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే ఈ పరిస్థితి ఉంది. ఇక విడగొట్టి మధ్యలో ఇంకో రాష్ట్రం వస్తే శ్రీశైలానికి నీళ్లెక్కడి నుంచి వస్తాయి? ఆ తర్వాత నాగార్జునసాగర్‌కు ఎక్కడి నుంచి వస్తాయి? కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీళ్లు ఎక్కడున్నాయని ఈ పాలకులను, ఆలోచన చేసే వారిని ఆడగదలుచుకున్నా. మరోవైపు పోలవరానికి జాతీయహోదా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా పాలకులారా! ఒక్క మాట అడగదలుచుకున్నా. రెండు రాష్ట్రాలుగా విడగొడితే పోలవరానికి నీళ్లెక్కడి నుంచి ఇస్తారు? రాష్ట్రాన్ని విడగొడితే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఎడారవుతుంది’’

ప్రతి యువకుడూ హైదరాబాద్‌ వైపే చూస్తున్నాడు

‘‘కృష్ణా ఆయకట్టు ఇటువైపు దిగువ ప్రాంతంలో ఉన్న రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరిల్లో ఉంది. మరోవైపు మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కూడా రోజూ తన్నుకునే, కొట్టుకునే పరిస్థితి వస్తోంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉందని తెలిసి కూడా ఏ ఒక్కరూ మాట్లాడని పరిస్థితి. మీరంతా (అడ్వొకేట్లు) మేధావులు. ఇవాళ ఒక్కటి చెప్పదలుచుకున్నాను. హైదరాబాద్‌ గురించైతే నేను వేరే చెప్పనవసరం లేదు. చదువుకున్న ప్రతి పిల్లాడూ ఇవాళ డిగ్రీ కాగానే ఉద్యోగం కోసం చూసేది హైదరాబాద్‌ వైపే. అంతేకాదు, రాష్ట్ర బడ్జెట్‌లో 50 శాతం నిధులు కూడా హైదరాబాద్‌ నుంచే వస్తున్నాయి. ఆ నిధులు రాకపోతే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం కూరుకుపోతుంది’’

నిజాయితీ రాజకీయాలు అవసరం

‘‘ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీని తీసుకొని రావాలి. ఆ నిజాయితీ ఎక్కడి నుంచి వస్తుందంటే, రాజకీయ నాయకులుగా, పార్టీ అధ్యక్షులుగా ఉన్న మనం తొలి సంతకం చేస్తే తప్ప రాదు. నేను మొన్న ఒక ప్రపోజల్‌ చెప్పాను. అదేమిటంటే... రాష్ట్రాన్ని విడగొట్టొద్దంటూ జేఏసీ తరఫున మీరే ఒక లెటర్‌ డ్రాఫ్‌‌ట చేయండి. నేను ఇవాళ జేఏసీకి హామీ ఇస్తున్నా. ఆ లేఖలో తొలి సంతకం పార్టీ అధ్యక్షునిగా నేనే పెడతా. ప్రతి పార్టీ అధ్యక్షుడూ అదే దారి పడితే రాష్ట్రాన్ని విడగొట్టవద్దంటున్న మూడు పార్టీలు కాస్త ఐదు, ఆరు, ఏడు కావచ్చు. సంఖ్య పెరిగే కొద్దీ ఈ (విభజన) కార్యక్రమం ఆగిపోతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతోందంటే... ఒకవైపు చంద్రబాబు తాను విభజనకు లేఖ ఇచ్చి, దాన్ని వెనక్కి తీసుకోరు.
 
రాజీనామా చేయరు. జేఏసీ, ప్రజల ఆగ్రహావేశాలకు భయపడి స్థానిక టీడీపీ నేతలు నామ్‌ కే వాస్తే రాజీనామాలు పడేస్తున్నారు. అవి స్పీకర్‌ ఫార్మాట్‌లో ఉన్నాయో లేవో కూడా తెలియదు. కానీ ఆ టీడీపీ నేతలు పార్టీకి మాత్రం రాజీనామా చేయరు. ఆ పార్టీ తరఫునే జేఏసీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ప్రతి జేఏసీ సభ్యుడూ వారిని అడగాలి. ‘అయ్యా.. టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తేనే జేఏసీలోకి రావాలి. లేదా మీ అధ్యక్షునితో రాజీనామా చేయించండి. విభజనకు వ్యతిరేకంగా లేఖ అయినా రాయించండి. ఆ తరువాతే జేఏసీలోకి రావాలి’ అని వారిపై ఒత్తిడి తెస్తేనే ఇది జరుగుతుంది. ప్రతి పార్టీ అధ్యక్షుడూ విభజనకు వ్యతిరేకంగా సంతకం చేస్తేనే మనం ఆ లీడర్లను జేఏసీలోకి అంగీకరించే పరిస్థితి రావాలి. విభజనకు వ్యతిరేకంగా మనల్ని ప్రోత్సహిస్తున్న సీపీఎం, ఎంఐఎం, వైఎస్సార్‌సీపీలను మనం ప్రోత్సహించాలి. మోటివేట్‌ చేయాలి. ఈ పార్టీలను చూపించి, మిగతా పార్టీల మీద ఒత్తిడి తేవాలి. ఇవాళ ఈ కార్యక్రమం నేనొక్కడిని చేసేది కాదు. పూర్తిగా, రాష్టవ్య్రాప్తంగా ప్రతి ఒక్కరమూ ఒక్కటవుతేనే ఇది సాధ్యమవుతుంది. టీడీపీ అని, కాంగ్రెస్‌ అని, ఇంకోటని నేను అనదల్చుకోలేదు. నేననేదల్లా ఒకటే.. ఇవాళ నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది’’

జగన్‌ను కలిసిన వారిలో న్యాయవాదుల జేఏసీ సమన్వయకర్త, బార్‌ కౌన్సిల్‌ రాష్ట్ర సభ్యుడు ఇ.శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు వై.నాగిరెడ్డి, జేఏసీ నేతలు ప్రేమ్‌సాగర్‌, అనితా, రాధిక, సుధ తదితరులున్నారు.
Share this article :

0 comments: