విభజనపై ఏకాభిప్రాయమేదీ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విభజనపై ఏకాభిప్రాయమేదీ?

విభజనపై ఏకాభిప్రాయమేదీ?

Written By news on Thursday, September 12, 2013 | 9/12/2013

విభజనపై ఏకాభిప్రాయమేదీ?
* షిండేకు విజయమ్మ లేఖ
* కేంద్ర హోం మంత్రి స్థాయిలో ఉండి వక్రీకరణ తగదు
* విభజన ప్రక్రియను ఆపండి.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి
* వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం, సీపీఎం విభజనను వ్యతిరేకించాయి
* అంగీకరించింది కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐలే
* అలాంటప్పుడు 100% ఏకాభిప్రాయం వచ్చిందని ఎలా చెప్తారు?
* ఒక ప్రాంతానికి న్యాయమంటే మరో ప్రాంతానికి అన్యాయమని కాదు.. 60 శాతం మంది ప్రజలు  43 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టదా?
 
సాక్షి, హైదరాబాద్: ఏకాభిప్రాయం కుదిరినందునే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నామన్న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర హోం మంత్రి స్థాయిలో ఉండి వక్రీకరణ తగదన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐలు మాత్రమే రాష్ట్ర విభజనకు అంగీకరించాయనీ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సీపీఎం విభజనను వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 60 శాతం మంతి ప్రజలు 43 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే 100 శాతం ఏకాభిప్రాయం కుదిరిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ మేరకు షిండేకు బుధవారం విజయమ్మ మరో లేఖ రాశారు. విభజనపై వైఎస్సార్‌సీపీ వైఖరిని తెలియజేస్తూ 2012 డిసెంబర్ 28న ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో అందజేసిన లేఖ, ప్రధానికి 2013 ఆగస్టు 14న రాసిన లేఖ, తాజాగా సెప్టెంబర్ 6న షిండేకే రాసిన లేఖలను తాజా లేఖకు జత చేశారు. అందులోని వివరాలిలా ఉన్నాయి...
 
కేంద్ర హోం మంత్రి షిండే గారికి,
బాధ్యతాయుతమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్ విభజనపై మీకు ఇలాంటి లేఖ రాయాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదు. కానీ కేంద్ర హోంమంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వాస్తవాలను వక్రీకరిస్తూంటే బాధ కలిగింది. ‘సీపీఎం మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలూ లిఖితపూర్వకంగా ఆమోదం తెలిపిన తర్వాతే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఒక్క సీపీఎం మినహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ తెలంగాణకు మద్దతిచ్చాయి’ అని ఈ నెల 7న ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మీరన్నట్టు వార్తలు వచ్చాయి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఐ మద్దతివ్వగా... రాష్ట్ర విభజన యత్నాలను వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం, సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని మీకు మేం పదేపదే గుర్తు చేస్తున్నాం. నగ్న సత్యం ఇదైతే, మీరు మాత్రం విభజన ప్రక్రియను ఒకే ఒక పార్టీ వ్యతిరేకిస్తోందని అనడం వాస్తవాలను మరుగు పరచడమే. ఇది మీ హోదాకు తగని పని. అందుకే విభజనపై ప్రధానికి, మీకు మా పార్టీ రాసిన లేఖలను జతపరుస్తున్నాం. రాష్ట్ర విభజనపై 2012 డిసెంబర్ 28న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం నాటి నుంచీ మా పార్టీ వైఖరిని తేటతెల్లంగా తెలియజెపుతూనే వస్తున్నాం. ప్రధానికి రాసిన లేఖలో కూడా మా పార్టీ వైఖరిని పునరుద్ఘాటించాం. అందులో మేం పేర్కొన్న విషయాన్ని మరోసారి మీకు గుర్తు చేయదలచాం.

‘‘ఒక ప్రాంతానికి న్యాయం చేయడమంటే ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయడమని కాదు. ఓట్లు, సీట్లకే ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ మౌలిక సూత్రాన్ని పూర్తిగా విస్మరించింది. ఏ ప్రాంతానికీ అన్యాయం జరక్కుండా భాగస్వాములందరిని ఒప్పించి నిర్ణయం తీసుకోలేనపుడు ఏ రాష్ట్రానైన్నా పునర్విభజించే అధికారాన్ని కేంద్రం తన వద్ద ఉంచుకోవడం ఎంతమాత్రమూ సమంజసం కాదు. ైవె ఎస్సార్‌సీపీ, ఎంఐఎం, సీపీఎం మూడూ వ్యక్తం చేసిన అభిప్రాయమిది. మీరు న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని విభజించవద్దు. యథాతథ స్థితినే కొనసాగించండి. ఇదే మా మూడు పార్టీల వైఖరి’’ అని ఆ లేఖలో స్పష్టం చేశాం.

రాయలసీమ, కోస్తా ప్రాంతాల ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తూంటే... ధర్నాలు, సమ్మెలతో ఆ రెండు ప్రాంతాలూ అట్టుడుకుతుంటే... విభజనపై వంద శాతం ఏకాభిప్రాయాన్ని సాధించామని కాంగ్రెస్ ఎలా చెబుతుంది? విభజనకు అంగీకరించింది టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ మాత్రమే. మీరు మాట్లాడుతూ వస్తున్న విషయాల్లోని వక్రీకరణలను సరిదిద్దుకుంటారనే ఉద్దేశంతోనే మా గత లేఖల ప్రతులను మీకు పంపుతున్నాం.
 
తెలియనట్టు నటిస్తున్నారా?
రాష్ట్ర విభజన విషయంలో మీరు చేసిన ప్రతిపాదన రాజకీయ పార్టీలకు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదు. కోట్లాది మంది ప్రజలు కూడా దానికి సమ్మతించడం లేదు. తమకు అన్యాయం జరిగిందని వారు నమ్ముతున్నారు. అలాంటపుడు ఈ ప్రక్రియ అందరికీ ఆమోదయోగ్యమేనని మీరు (కేంద్రం) ఎలా చెప్పగలుగుతారు? మీ ప్రతిపాదనకూ ఆమోదయోగ్యతా లేదు, తమకు న్యాయం జరిగిందని ప్రజలు నమ్మడమూ లేదు. అలాంటప్పుడు వాస్తవాలను వక్రీకరించడం ఏ మేరకు వివేకం అన్పించుకుంటుంది? రాష్ట్ర విభజనకు జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలందరూ జూలై 25వ తేదీనే రాజీనామాలు చేశారు.

సీడబ్ల్యూసీ సభ్యునిగా, కేంద్ర హోం మంత్రిగా మీకిది తెలిసే ఉంటుంది. విభజన నిర్ణయం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, విభజనకు వ్యతిరేకంగా మీ పార్టీపై ఒత్తిడి పెంచేందుకే వారు రాజీనామాలు చేశారు. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నేను కూడా విభజనను వ్యతిరేకిస్తూ పదవులు వదులుకున్నాం. 12 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం. మీరు కేంద్ర హోంమంత్రి గనుక ఇవి మీకు తెలిసే ఉంటాయి. తెలియలేదంటే కచ్చితంగా మీ దృష్టి వీటిపై పడి ఉండకపోవచ్చు. విభజనను వ్యతిరేకిస్తూ నా సారథ్యంలో మా పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి, ప్రధానితో పాటు ఇతర పార్టీల నేతలను కలవడంతో పాటు ఒక రోజు నిరసన దీక్ష కూడా చేపట్టిన విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ ఢిల్లీలోనే జరిగాయి. అయినా ఇవన్నీ కేంద్ర హోంమంత్రి దృష్టికి రాలేదా? లేదంటే మీరు కావాలనే ఇవేవీ తెలియనట్టుగా నటిస్తున్నారని మేమనుకోవాలా? అదే నిజమైతే అందుకు కారణాలేమిటన్నది కూడా మీకే తెలియాలి.

అంతకుముందు మీ పార్టీ నేత దిగ్విజయ్‌సింగ్ కూడా విభజనపై వక్రీకరణలతో కూడిన కథనాలను మీడియాతో ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఏకాభిప్రాయాన్ని సాధించామంటూ ఊదరగొట్టారు. విభజన పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పక్కన పెట్టారు. ఆయన చెప్పిందేదీ వాస్తవం కాదు. అందుకే ప్రధానికి మేం రాసిన లేఖలో మా వైఖరిని స్పష్టం చేశాం. మా విధానంలో ఎలాంటి మార్పూ లేదని, మాతో పాటు ఎంఐఎం, సీపీఎం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నాయని వివరించాం.
 
మీ నిర్ణయాన్ని మాపై రుద్దుతారా?
ఈ వాస్తవాలన్నీ బాగా తెలిసి ఉండి కూడా, ప్రభుత్వంలో భాగంగా ఉండి కూడా, ఒక కాంగ్రెస్ వ్యక్తి మాదిరిగా సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని మా తలపై తుపాకి పెట్టి మరీ మాపై రుద్దాలని మీరు చూస్తున్నారు. ఇదే మాత్రమూ న్యాయబద్ధం కాదు. విభజనను వ్యతిరేకిస్తున్న పార్టీల గొంతు నులిమేందుకు మీరు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. మీ పార్టీ నిర్ణయాన్ని ప్రజలపై రుద్దజూస్తున్నారు. మీ నిర్ణయంపై వ్యతిరేకత మిన్నంటుతుందనే భయంతోనే మీరు కనీసం ప్రభుత్వ కమిటీని కూడా వేయలేదు!

అసలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు కనీసం అన్ని పార్టీల వివరణ, స్పష్టత అయినా తీసుకోలేదెందుకు? హోంమంత్రి వంటి ఉన్నత స్థానంలో ఉండి, మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దుతూ, మీ స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి దేశ ప్రజలను కూడా తప్పుదోవ పట్టించడం ఎంతవరకు న్యాయం? రాష్ట్రంలోని సుమారు 60 శాతం మంది ప్రజలు విభజన నిర్ణయానికి నిరసనగా 43 రోజులుగా సమ్మె చేస్తుంటే మీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.
 
నీళ్లెక్కడి నుంచి ఇస్తారు?
రాష్ట్రం సమైక్యంగా ఉండగానే ఎగువన మహారాష్ట్ర అవసరాలు తీరి, కర్ణాటకలో అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండనిదే మాకు నీళ్లు రావడం లేదు. ఇలాంటప్పుడు మధ్యలో మరో రాష్ట్రం వస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీళ్లెక్కడి నుంచి వస్తాయి? కృష్ణా నదీ ఆయకట్టు వెంబడి ఉన్న రైతుల మధ్య ప్రతి రోజూ నీటి యుద్ధాలు జరుగుతాయి. ఒక ప్రాంతంలో కొన్ని ఓట్లు, సీట్ల కోసం మీరు మా రాష్ట్రాన్ని విభజిస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ మంచినీళ్లే ఉండవు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కానీ మధ్యలో మరో రాష్ర్టం వస్తే పోలవరానికి నీళ్లు రావడం అంత సులువు కాదు.

గతంలో మీరు మమ్మల్ని మద్రాసు రాష్ట్రం వదలి వెళ్లమన్నారు. ఇప్పుడేమో పదేళ్లలో హైదరాబాద్‌ను కూడా ఖాళీ చేయాలంటున్నారు. మేం హైదరాబాద్ వీడితే మా పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళతారు? రాష్ట్ర ఆదాయంలో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. అది మాకు అందుబాటులో లేకున్నా, కొత్త రాజధాని నిర్మాణానికే ఖర్చయినా, కనీసం ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు కూడా డబ్బుండదు! ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలకు, మున్ముందు మొదలు పెట్టే వాటికి కూడా నిధులుండవు. హైదరాబాద్‌లో నివసించే ఉద్యోగులు, ప్రజల భవిష్యత్తు సందిగ్ధంలో పడుతుంది.
 
మీకు చీమ కుట్టినట్టయినా లేదు
మాకు మా రాష్ట్రంలోనే సహజ వాయువు అందుబాటులో ఉన్నా, విభజన జరిగితే దాన్ని మేం వాడుకునేందుకు అనుమతించే పరిస్థితి ఉండబోదు. తమకు నీళ్లుండబోవని, హైదరాబాద్ తమకు కాకుండా పోతోందని కోట్లాది మంది ప్రజలు 43 రోజులుగా ఆందోళన చేస్తున్నా మీకు చీమ కుట్టినట్టయినా లేదు. పైగా విభజనపై ఏకాభిప్రాయం ఉందని వక్రీకరిస్తున్నారు. విభజన వల్ల కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు, ఓట్లు లభించవచ్చేమో గానీ, విభజన ప్రక్రియ కోట్లాది మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది.  అందుకే విభజన ప్రక్రియను నిలిపి వేయాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మిమ్మల్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం.
 - వైఎస్ విజయమ్మ
Share this article :

0 comments: