రేపు అసెంబ్లీ ఆవరణలో వైఎస్సార్ సీపీ ధర్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు అసెంబ్లీ ఆవరణలో వైఎస్సార్ సీపీ ధర్నా

రేపు అసెంబ్లీ ఆవరణలో వైఎస్సార్ సీపీ ధర్నా

Written By news on Thursday, September 19, 2013 | 9/19/2013


రేపు అసెంబ్లీ ఆవరణలో వైఎస్సార్ సీపీ ధర్నా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, రాష్ట్ర విభజనకు కారణమైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన (శుక్రవారం) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు శోభానాగిరెడ్డి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా వీధినాటకాలు ఆపేసి తమ పదవులకు రాజీనామా చేయటం ద్వారా రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తే కేంద్రం కానీ వారు నియమించిన కమిటీ కానీ దిగివస్తుందని, అప్పుడు విభజన ఎలా జరుగుతుందో చూడొచ్చని ఆమె పేర్కొన్నారు.
 
 టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీధి నాటకాలు కట్టిపెట్టి, రాజీనామాలు చేయాలన్న డిమాండ్‌తో 20వ తేదీన సచివాలయం తెలుగుత ల్లి విగ్రహం నుంచి తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకుని అక్కడ మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి అక్కడే ధర్నా చేపడతారని తెలిపారు. శోభానాగిరెడ్డి బుధవారం వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు ఎం.మారెప్పతో కలిసి హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.  రాష్ట్రాన్ని విభజించటానికి కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తూనే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ, అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిలు కూడా తమ పదవులకు రాజీనామా చేయటంతో పాటు సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ప్రజలకు అండగా నిరాహార దీక్షలు చేపట్టారని ఆమె గుర్తుచేశారు.
 
 బాబూ.. ద్వంద్వ వైఖరిని విడనాడు...
 
 చంద్రబాబు తానిచ్చిన లేఖ వల్లే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిందని, అదే విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలని తెలంగాణ ప్రాంత నాయకులకు చెప్తున్నారని.. మరోవైపు సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు అనునిత్యం ప్రజలను మభ్యపెట్టటానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
 
 టీడీపీ ఇచ్చిన లేఖ వల్లే విభజన నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒకవైపు చెప్తుంటే.. తెలుగుజాతి జోలికొస్తే అంతు చూస్తానంటూ చంద్రబాబు బీరాలు పలుకుతున్నారని.. ఇవన్నీ ఎవరిని మభ్యపెట్టటానికి చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం పెడితే మద్దతిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ విభజన నిర్ణయం వెలువడిన రోజే సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆయన బేరం పెట్టారని గుర్తుచేశారు. ఆ విషయం మరిచి చంద్రబాబు బస్సుయాత్రతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఈ ద్వంద్వ వైఖరిని విడనాడాలని.. విభజనకు అనుకూలంగా కేంద్రానికి ఇచ్చిన లేఖను తక్షణం వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర సమైక్యతకు కట్టుబడాలని ఆమె డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించటం ద్వారా విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేయటానికి చంద్రబాబుతో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. విభజన నిర్ణయం సీడబ్ల్యూసీ స్థాయిలో జరిగిందే కనుక, ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదని.. వెంటనే తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని శోభ ఈ సందర్భంగా చంద్రబాబుకు హితవు పలికారు.
 
 ఆ తెలివితేటలను ‘సమైక్యం’ కోసం ఉపయోగించు...
 
 పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నేతలతో చంద్రబాబు ఎందుకు ఢిల్లీ వెళ్లాలనుకున్నారని శోభ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్తున్న చంద్రబాబు ఇంకా ఏం చెప్పాలని ఢిల్లీ వెళతారని నిలదీశారు. చంద్రబాబు తెలివితేటలన్నీ జగన్‌మోహన్‌రెడ్డిని ఎలా ఇబ్బంది పెట్టాలి? ఆయనకు బెయిల్ రాకుండా ఏంచేయాలన్నదానికే ఉపయోగిస్తున్నారని విమర్శించారు. అందులో పదో వంతైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తే వచ్చే ఎన్నికల తర్వాత కనీసం ప్రతిపక్ష నేత హోదా అయినా దక్కుతుందని హితవుపలికారు.
 
తెలంగాణకు లేఖ ఇచ్చిన చంద్రబాబు సీమాంధ్రలో తిరుగుతుంటే మీరెందుకు వెళ్లలేకపోతున్నారని, మీరెందుకు ప్రజలకు నచ్చజెప్పలేకపోతున్నారని కాంగ్రెస్ నేతలను సోనియాగాంధీ అడుగుతున్నట్లు ఆ పార్టీ నాయకులే చెప్తున్నారని శోభ పేర్కొన్నారు. ‘‘విభజించాలని లేఖ ఇచ్చింది టీడీపీ, నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్.. కాగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేంద్ర మంత్రిని అడ్డుకున్న ఘటన చూస్తుంటే అంతా వీధి నాటకంలా ఉంది’’ అని విమర్శించారు. అలాగే ముఖ్యమంత్రి కిరణ్‌కుమారెడ్డికి తెలిసే విభజన నిర్ణయం జరిగిందని, ఆ రోజే ఆయన నిలువరించి ఉంటే సీమాంధ్ర ప్రజలు ఈ రోజు ఉద్యమం చేయాల్సిన అవసరమే ఉండేది కాదని ఆమె పేర్కొన్నారు.
Share this article :

0 comments: