ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో సంబంధం ఉంటే జగన్ జైల్లో ఎందుకు ఉంటారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో సంబంధం ఉంటే జగన్ జైల్లో ఎందుకు ఉంటారు?

ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో సంబంధం ఉంటే జగన్ జైల్లో ఎందుకు ఉంటారు?

Written By news on Friday, September 6, 2013 | 9/06/2013

చంద్రబాబుకు మతి భ్రమించింది: అంబటి రాంబాబు
ఆయన్ని పిచ్చాసుపత్రిలో చేర్పించాలి: వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు
 అవిశ్వాసం సమయంలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది మీరు కాదా బాబూ?
ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో సంబంధం ఉంటే జగన్ జైల్లో ఎందుకు ఉంటారు?
మతి భ్రమించి మాట్లాడుతున్న బాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలి
సమైక్యాన్ని కోరుతున్నది వైఎస్సార్‌సీపీ, సీపీఎం, ఎంఐఎం మాత్రమే
ఏకపక్ష విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీలే
విభజనపై చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి.. ఆయనతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులకు రాజీనామా చేయాలి

 
 సాక్షి, హైదరాబాద్: ‘తెలుగుజాతి ఆత్మగౌరవం’ పేరిట సీమాంధ్రలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలో లేక విభజించాలనే దానికి స్పష్టంగా వైఖరి చెప్పకుండా... మతి భ్రమించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే మంచిదని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన తర్వాత ఏకపక్ష విభజనకు అనుకూలంగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీలు వ్యవహరించాయి. కానీ ఏకపక్ష విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యవాణిని వినిపిస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం మాత్రమే’ అని అంబటి పేర్కొన్నారు.
 
  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా... ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఏ ఒక్కరికీ అర్థంకావడంలేదన్నారు. ‘చంద్రబాబూ ఇప్పటికైనా మించిపోయింది లేదు. విభజించాలంటూ కేంద్రానికి మీరిచ్చిన లేఖను వెంటనే ఉపసంహరించుకోండి. మీరు, మీ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి’ అని హితవు పలికారు. చంద్రబాబు చేస్తున్న యాత్రకు జనం రాకపోవడంతో.. వారికి అనుకూలంగా ఉండే కొన్ని చానెళ్లు ఆ దృశ్యాలను చూపించేందుకు చాలా ఇబ్బంది పడిపోతున్నాయన్నారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని బాబు కూడా తన యాత్రను ముఖ్య పట్టణాల ద్వారా వెళ్లకుండా సందులు, గొందుల్లో తిరుగుతున్నారని ఎద్దేశా చేశారు. విభజన లేఖను వెనక్కు తీసుకునే దాకా సీమాంధ్ర ప్రజల ఆదరణ బాబుకు దక్కదని అంబటి స్పష్టం చేశారు.
 
 ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది చంద్రబాబే..
 తెలుగువారి ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబేనని ప్రజలు నమ్ముతున్నట్లు అంబటి పేర్కొన్నారు. ‘ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రాన్ని విభజించాలంటూ ప్రణబ్ కమిటీకి 2008లో లేఖ ఇచ్చారు. అంతేకాదు 2009 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరం లేదనడమే కాక, రాష్ట్ర ఏర్పాటుకు కావాల్సిన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. గతేడాది రాష్ట్రాన్ని విభజించాలంటూ ప్రధానికి లేఖలు రాసి, షిండేకు లేఖలు అందజేశారు’ అని వివరించారు. ఇంత చేసిన చంద్రబాబు ఆత్మగౌరవయాత్ర చేస్తున్నానంటే సీమాంధ్ర ప్రజలు విశ్వసించేదెలా? అని ప్రశ్నించారు.
 
 హైదరాబాద్ సీమాంధ్రుల హక్కు అని ఎక్కడైనా చెబుతున్నారా?
 హైదరాబాద్ నగరాన్ని మొత్తం తానే నిర్మించానని చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గేయడం లేదా అని అంబటి ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌కు బాబు ఒరగబెట్టింది ఏంటి? అసెంబ్లీ నిర్మించారా, చార్మినార్ కట్టించారా, మక్కామసీద్, బిర్లాటెంపుల్, ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే వీటిలో ఏ ఒక్కటైనా నిర్మించారా’ అని అడిగారు. హైదరాబాద్ మొత్తాన్ని సింగపూర్‌లా మార్చానని చెబుతున్న బాబు ఎందుకు ఓడిపోయారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఇంతగా గింజుకుంటున్న చంద్రబాబు రాష్ట్రం మొత్తం సమైక్యంగా ఉంచాలని, హైదరాబాద్‌పై సీమాంధ్రులకు కూడా హక్కు ఉందని ఏ ఒక్క చోటైనా చెబుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ‘పాడిందే పాటరా పాచిపళ్ల దాసరి’ అన్నట్లు మహానేత వైఎస్ కుటుంబంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
 
 ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందని అంబటి మండిపడ్డారు. అలాంటి పార్టీతో కుమ్మక్కు అయితే జగన్ జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అవిశ్వాసం సందర్భంగా విప్ జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడినది మీరు కాదా? అని చంద్రబాబును అడిగారు. నాలుగేళ్లుగా ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌ను మోసే కార్యక్రమం మీరు తీసుకొని ఇతరులను నిందించడమేమిటన్నారు. అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టినట్లయితే ఇప్పుడు రాష్ట్ర విభజన పరిస్థితి వచ్చుండేదే కాదు కదా? అని ప్రశ్నించారు. ‘అనునిత్యం సమయం, సందర్భం లేకుండా 24 గంటలు జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.
 
 ఈ రోజు జగన్ జైలుకు ఎందుకు వెళ్లారో, ఎవరిని ఎదిరించినందుకు ఇలా జరుగుతున్నదో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. మరి ఆయన సుపుత్రుడు లోకేష్‌బాబు సంగతేంటి? ఆయన కొడుకు గురించి మాట్లాడాల్సి వస్తే పుంఖానుపుంఖాలుగా చెప్పాల్సి వస్తుంది’ అని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు సొల్లు కబుర్లు కట్టిపెట్టి రాష్ట్ర విభజనపై తన విధానమేంటో స్పష్టం చేయాలని అంబటి డిమాండ్ చేశారు. ఈనెల 7న హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సభకు వైఎస్సార్‌సీపీని ఆహ్వానించకపోవడానికి గల కారణాలేంటని మీడియా ప్రశ్నించగా... ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మేం చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఏపీఎన్జీవోలు ఎందుకు ఆహ్వానించడం లేదో వారినే అడగాలి’ అని ఆయన అన్నారు.
Share this article :

0 comments: