పైకి సమైక్య మంత్రం.. లోన విభజన తంత్రం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పైకి సమైక్య మంత్రం.. లోన విభజన తంత్రం

పైకి సమైక్య మంత్రం.. లోన విభజన తంత్రం

Written By news on Wednesday, September 18, 2013 | 9/18/2013

తెలంగాణ నేతలతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వ్యూహాలు
హైదరాబాద్: సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మాటలకు, చేతలకు మధ్య పొంతన కనిపించడం లేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పాటుపడుతున్నది తామేనంటూ బహిరంగంగా గర్జనలు చేస్తున్నప్పటికీ... అంతర్గతంగా విభజనకు అనుకూలంగా పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అందుకోసం రెండు మూడు రోజుల్లో ఇరుప్రాంతాల కాంగ్రెస్ నేతలూ చర్చలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ భాగస్వామ్యపక్షాలు ఏకగ్రీవ తీర్మానం చేసిన సమయంలో... నిర్ణయం జరిగిపోయినందున ఏమీ చేయలేమని, సీమాంధ్ర ప్రాంతానికి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తొలుత విభజన అనుకూల ప్రకటనలు చేయడం తెలిసిందే. అయితే సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు ఉవ్వెత్తున రేగడం, నిరసనలు మిన్నంటడంతో మాటమార్చి సమైక్యమంటూ కొత్తరాగం అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటుచేసినా అది ఉత్తుత్తి కమిటీగానే తేలిపోయింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక , కర్షక విద్యార్థులతో సహా సమస్తవర్గాలూ గత 40 రోజులకు పైగా చేస్తున్న సమ్మెతో రాష్ట్రంలో పాలన స్తంభించిపోవడం, కాంగ్రెస్ పార్టీయే ప్రధమ ముద్దాయిగా మారడంతో కాంగ్రెస్‌నేతలు ఇతరపార్టీలపై నిందలుమోపే ప్రయత్నాలు చేపట్టారు. తెలుగుదేశం, ఇతర పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చినందువల్లే తమ అధిష్టానం విభజన నిర్ణయం తీసుకుందని విమర్శలు చేశారు. సమైక్యాన్ని తామొక్కరమే కోరుకుంటున్నామని ప్రకటిస్తూ వచ్చారు. అయితే పైకి సమైక్యమని చెబుతున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, లోపల వేరే డ్రామాను నడిపిస్తున్నారని తాజా పరిణామాలతో అర్థమవుతోంది.
 
 పార్టీ పరువుకోసం రాష్ట్రం బలి
 పార్టీ అత్యున్న నిర్ణాయక వేదికైన సీడబ్ల్యూసీ చేసిన తీర్మానం అమలు చేయలేకపోతే జాతీయస్థాయిలో కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతింటుందని, తెలంగాణ పరిస్థితులు తీవ్రరూపం దాల్చే ప్రమాదముందని, దానివల్ల అటు ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో కూడా కాంగ్రెస్ నామరూపాల్లేకుండా కొట్టుకుపోతుందని అధిష్టానం పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అలాంటివి జరగముందే విభజన తీర్మానం అమలుకు వీలుగా రాష్ట్రంలో పరిస్థితులను సానుకూలం చేయాల్సిన బాధ్యతను రాష్ట్ర కాంగ్రెస్ నేతలకే అప్పగించారు. దీంతో సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమాన్ని చల్లార్చి తీర్మానంపై అధిష్టానం ముందుకు వెళ్లేలా చేయాలన్న వ్యూహానికి కాంగ్రెస్‌నేతలు తెరతీశారు. సీడబ్ల్యూసీ తీర్మానం అమలుకు అడ్డంకిగా ఉన్న సమస్యలపై ఇరుప్రాంతాల కాంగ్రెస్ పెద్దలు చర్చించుకొని సమస్యను ఒక కొలిక్కి తేవాలని నిర్ణయించుకున్నారు. నిన్నమొన్నటివరకు ఏపీఎన్జీఓలు సహా వివిధ జేఏసీల ఆధ్వర్యంలో సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ నేతలు ఇపుడు మాటమారుస్తున్నారు. సోమవారం రాత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో జరిగిన సమావేశంలో సమైక్య ఉద్యమంపై నేతలు చ ర్చించిన అనంతరం చేసిన ప్రకటనలే అందుకు తార్కాణం. సమైక్య ఉద్యమం పేరిట తమపై దాడులు చేస్తే సహించేది లేదని, తీవ్రంగానే స్పందిస్తామని ఉద్యమకారులకు స్వయానా మంత్రులే ఆ సమావేశానంతరం హెచ్చరికలు జారీచేశారు. తమను అడ్డుకున్న ఉద్యమకారులను రౌడీమూకలంటూ దుమ్మెత్తి పోశారు.
 
 మరోవైపు మంగళవారం మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, సీనియర్‌నేత జేసీ దివాకర్‌రెడ్డి, విప్ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సీఎల్పీ కార్యాలయంలో ఇష్టాగోష్టిగా సమావేశమైనప్పుడు సీడబ్ల్యూసీ తీర్మాన ం చర్చకు వచ్చింది. పార్టీ తీర్మానం అమలుకాకుంటే తెలంగాణలో పరిస్థితులు చేయిదాటిపోతాయని, ఇరుప్రాంతాల నేతలం ఒకదగ్గర కూర్చొని తీర్మానం అమలుకు వీలుగా ఒక నిర్ణయానికి రావడం మంచిదన్న అభిప్రాయానికి ఆ నేతలు వచ్చారు. ఇందుకు ఇరుప్రాంతాలనుంచి పదేసిమంది నేతలు భేటీలో పాల్గొని తీర్మానం అమలు ద్వారా తలెత్తే సమస్యలను విశ్లేషించి వాటిని అధిగమించే  మార్గాలను అధిష్టానానికి సూచించాలని నిర్ణయించారు. వీటిని విశాఖలో ప్రారంభించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించగా... రాజధాని హైదరాబాద్ అయినందున ఇక్కడినుంచి ప్రారంభించి విశాఖ, తిరుపతి, విజయవాడల్లో ఆ తర్వాత నిర్వహిస్తే బాగుంటుందని పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు. విభజన తప్ప మరేదీ తాము అంగీకరించబోమనే నేతలను దీనికి దూరంగా ఉంచాలని భావిస్తున్నారు.
 
 రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నది తమ మొదటి డిమాండే అయినా సీడబ్ల్యూసీ తీర్మానం నుంచి వెనక్కు వెళ్లే పరిస్థితి లేదు కనుక విభజన అనివార్యమైతే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపి రాయలతెలంగాణను ప్రకటించేలా ఈ సమావేశాల్లో తెలంగాణ నేతలను ఒప్పించాలన్న వ్యూహంతో రాయలసీమ నేతలు ఉన్నారు. ముఖ్యంగా విభజనతో రాయలసీమ ఎక్కువగా నష్టపోతుంది కనుక తమ ప్రాంత సమస్యలపైనే దృష్టి సారించాల్సిన అవసరముందని ఏరాసు చెబుతున్నారు. తీర్మానం అమలు కావాలంటే రాయలతెలంగాణప్రతిపాదనను అంగీకరించాలని జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇరుప్రాంతాల నేతల సంయుక్త భేటీల వెనుక అసలు లక్ష్యం కూడా ఇదేనని చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమను చీల్చడం ద్వారా రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను ముఖ్యంగా వైఎస్సార్సీపీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయవచ్చన్న వ్యూహాన్ని రచించాలన్నది ఈ సమావేశాల అసలు ఉద్దేశంగా స్పష్టమవుతోంది.

http://www.sakshi.com/news/andhra-pradesh/seemandhra-congress-leaders-mingle-with-telangana-leaders-66216
Share this article :

0 comments: