షర్మిల ‘సమైక్య శంఖారావానికి’ జన ఉప్పెన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల ‘సమైక్య శంఖారావానికి’ జన ఉప్పెన

షర్మిల ‘సమైక్య శంఖారావానికి’ జన ఉప్పెన

Written By news on Thursday, September 12, 2013 | 9/12/2013

మహానేత రాజన్న తనయ చేపట్టిన మహోద్యమం.. జననేత జగనన్న సోదరి చేస్తున్న సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం.... మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రపంచ రికార్డుసృష్టించిన షర్మిల సమైక్య శంఖారావానికి జిల్లా ప్రజానీకం జేజేలు పలికింది. సమైక్యతకే జై అంటూ చేయెత్తి జైకొట్టింది. అడుగడుగునా నీరాజనాలు పలికింది. ఉత్తుంగ తరంగంలా కదిలి వచ్చిన జనవాహిని సమైక్య యజ్ఞంలో మేము సైతం అంటూ నినదించింది. బుధవారం వినుకొండ, రేపల్లెలో మాత్రమే షర్మిల సభలు జరిగినా జిల్లా అంతా ఇక్కడే ఉందా అన్నట్టు జనసందోహం అబ్బురపరిచింది. కిక్కిరిసిన ప్రజాసంద్రంలో సమైక్య నినాదం ప్రతిధ్వనించింది. సింహనాదమై గర్జించింది.
 
 సాక్షి, గుంటూరు : జిల్లాలో ‘సమైక్య శంఖారావం’ హోరెత్తింది. ప్రజాభిప్రాయానికి పట్టం గడుతూ మహానేత తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పూరించిన శంఖారావానికి జిల్లా ప్రజలు గళం కలిపారు. తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆమె ఎలుగెత్తి చాటుతున్న సమైక్య నినాదంతో ప్రతి ఒక్కరూ కదం తొక్కుతూ.. పదం కలిపారు.  కాంగ్రెస్, టీడీపీ స్వార్థ రాజకీయం కోసం సీమాంధ్రను వల్లకాడుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న తీరును షర్మిల ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం అనే పదాన్ని మరిచి వ్యవహరిస్తున్న వైనాన్ని సూటిగా ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయం చేసే దమ్ము, ధైర్యం కాంగ్రెస్, టీడీపీలకు లేవని నిప్పులు చెరిగారు. చంద్రబాబు, బొత్స, చిరంజీవిల విషయంలో సీబీఐ వ్యవహరించిన తీరును తూర్పారబట్టారు.
 
 పదవుల మత్తులో మునిగి తేలుతున్న కాంగ్రెస్ నాయకులకు మళ్ళీ తమ పదవులే ముఖ్యమని నిరూపించుకున్నారని షర్మిల ధ్వజమెత్తారు. పట్ట పగలు సీమాంధ్రుల గొంతు కోసి ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు రోడ్లపై తిరుగుతున్నారని, రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఎవరిని అడిగి లేఖ ఇచ్చారు? నీ అబ్బ సొత్తని ఇచ్చావా? అంటూ చంద్రబాబుని నిలదీశారు. ఆత్మగౌరవ యాత్ర అంటూ రోడ్లపై పడి మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబుని సీమాంధ్ర నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కోట్ల మందికి అన్యాయం జరుగుతుంటే జగనన్న చేతులు కట్టుకుని కూర్చోరని, వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. మహానేత దివంగత వైఎస్సార్ పథకాల్ని గుర్తుకు తెస్తూ.. సమైక్య నినాదాన్ని గట్టిగా వినిపిస్తూ.. షర్మిల జిల్లాలో చేపట్టిన బస్సు యాత్రకు జనం పోటెత్తారు. 
 
 అడుగడుగునా బ్రహ్మరథం...
 ప్రకాశం జిల్లా మార్కాపురంలో సమైక్య శంఖారావం బస్సు యాత్ర ముగించుకుని బుధవారం జిల్లాలో అడుగుపెట్టిన షర్మిలకు వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద ఘన స్వాగతం లభించింది. దారి పొడవునా ఆమెకు జనం బ్రహ్మరథం పట్టారు. అందరికీ అభివాదం చేస్తూ మహానేత వై.ఎస్. విగ్రహాలకు పూలమాలలు వేస్తూ షర్మిల బస్సు యాత్రను కొనసాగించారు. 
 
 వినుకొండ పట్టణానికి చేరే ముందు గుండ్లకమ్మ అడ్డరోడ్ నుంచి భారీ ర్యాలీతో వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్య వాదులు షర్మిలను తోడ్కొని వచ్చారు. వినుకొండ పట్టణంలో మధ్యాహ్నం 12.30 గంటలకు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జరిగిన బహిరంగ సభ జన సంద్రమైంది. సభ ముగిసిన తరువాత షర్మిల బస్సు యాత్రకు పల్లెలన్నీ కదిలాయి.
 
 శావల్యాపురం, సంతమాగులూరు, పుట్టావారిపాలెం అడ్డరోడ్, పెట్లూరివారిపాలెం, కోటప్పకొండ వరకు దార్లన్నీ జన సందోహంతో నిండిపోయాయి. షర్మిలను చూసేందుకు జనం బారులు తీరారు. మద్దిరాల, పురుషోత్తమపట్నంలో విద్యార్థులు, ముస్లింలు షర్మిలను కలిసేందుకు ఉత్సాహం చూపారు. షర్మిల యాత్ర చిలకలూరిపేట, యడ్లపాడు, బుడంపాడు, నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పల్లెకోన మీదుగా రేపల్లె చేరుకునే సరికి రాత్రి 8.10 గంటలైంది.
 
 ప్రకటించిన షెడ్యూల్ కంటే నాలుగు గంటలు ఆలస్యమైనా జనాభిమానం చెక్కు చెదరలేదు. రాష్ట్ర ప్రజలకు వైఎస్ చేసిన మేలును తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ.. త్వరలోనే జగనన్న రాజన్న రాజ్యం వైపు నడిపిస్తారని భరోసా ఇచ్చారు. ఉదయించే సూర్యుణ్ణి ఎవరూ ఆపలేరని, బోనులో ఉన్నా సింహం సింహమేనంటూ ధైర్యం కల్పించారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలు పొగొట్టుకున్న వారికి వినుకొండలో రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. 
 
 రాజకీయ విశ్లేషకుల్ని ఆకట్టుకున్న షర్మిల ప్రసంగం
 వినుకొండ, రేపల్లెలో షర్మిల చేసిన ప్రసంగం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆకట్టుకుంది. రాష్ట్ర విభజన, తదనంతర పరిణామాలు, విభజనకు కారకులైన చంద్రబాబు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన తీరు రాజకీయ నేతల్ని ఆలోచింపజేసింది. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో  చంద్రబాబు, కాంగ్రెస్ నేతలపై చేసిన విమర్శలతో కూడిన చణుకులు పేలాయి. చంద్రబాబు వ్యవహారం ఇంటికి నిప్పు పెట్టి మంట మంట అని అరిచిన విధంగా ఉందని, దున్నపోతా.. దున్నపోతా.. ఎందుకు దున్నలేదంటే పగలు ఎండ.. రాత్రి చీకటి అని చెప్పినట్లుందని సామెతలు చెబుతూ షర్మిల ఎద్దేవా చేశారు. హత్య చేసి ఆ శవంపై పడి వెక్కి వెక్కి ఏడ్చినట్లుందని దుయ్యబట్టారు.
 
 చంద్రబాబు బ్లాంక్ చెక్ ఇవ్వడంతోనే కాంగ్రెస్ తెలుగు ప్రజల్ని విడగొట్టేందుకు ధైర్యం చేసిందన్నారు. ఇలాంటి నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు అనాలా? దుర్మార్గుడనాలా? అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఐఎంజీ అవినీతిపై నిజాయితీగా హెడ్ కానిస్టేబుల్‌తో విచారణ చేయించినా జైల్లో ఉండేవారన్నారు. రేపల్లెలో జరిగిన భారీ బహిరంగ సభలో సబితమ్మకు ఓ న్యాయం.. మోపిదేవికి మరో న్యాయం అంటూ అనడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. మోపిదేవిని బలి పశువుని చేశారని, కుట్రలు పన్ని అమాయకులతో ఆడుకునే దుర్మార్గ కాంగ్రెస్, టీడీపీ నాయకుల పతనం తప్పదని షర్మిల ఉద్ఘాటించారు. సమైక్య వాణిని బలంగా వినిపించిన షర్మిల చివరకు జై సమైక్యాంధ్ర అంటూ సభల్ని ముగించారు.
 
 ‘‘హఠాత్తుగా రాష్ట్రాన్ని చీలుస్తున్నామని కేంద్రం సంకేతాలు పంపగానే వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షుడు జగన్‌తో పాటు గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాజీనామాలు చేశారు. వీరితో పాటు మోపిదేవి అన్న రాజీనామా చేశారు. తెలుగు వారి ఓట్లు దండుకుని తెలుగు ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దారుణమైన నిర్ణయంతో సీమాంధ్ర మొత్తం మహా ఎడారిగా మారనుంది. కోట్ల మంది గుండెలు రగిలిపోతున్నా సీఎం కిరణ్ దిష్టి బొమ్మలా నిల్చున్నారు. సీఎంగా పదవీ ప్రమాణం చేసేటప్పుడు సోనియా గాంధీకి విధేయంగా ఉంటానని ప్రమాణం చేశారా? ప్రజల హక్కుల్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేశారా? ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. కోట్ల మంది ప్రజల్ని క్షమాపణ కోరి కిరణ్, చంద్రబాబులిద్దరూ రాజీనామా చేసి వారి ఎమ్మెల్యేలు, ఎంపీలచే రాజీనామా చేయించండి. ఈ విభజన ప్రక్రియ ఎలా ఆగదో చూద్దాం.’’        
 - షర్మిల
Share this article :

0 comments: