వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రజల పక్షాన నిలబడుతుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రజల పక్షాన నిలబడుతుంది

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రజల పక్షాన నిలబడుతుంది

Written By news on Monday, September 2, 2013 | 9/02/2013

తిరుపతి, 2 సెప్టెంబర్ 2013:వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సమైక్య శంఖారావం పూరించారు. అన్నదమ్ముల మధ్య అగ్గి పెట్టి కాంగ్రెస్‌ పార్టీ చలి కాచుకుంటోందని ఆమె నిప్పులు చెరిగారు. తెలుగువారి భిక్షతో కేంద్రంలో, రాష్ట్రంలో గద్డెనెక్కి, ఇప్పుడు తెలుగు వారి మధ్యనే చిచ్చు పెట్టిందని దుయ్యబట్టారు. కడుపునకు కావాల్సింది ఇంత అన్నమా లేక సీమాంధ్రుల రక్తమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే ఇప్పటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆమె అన్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో నిర్వహించే 'సమైక్య శంఖారావం' బస్సు యాత్రను తిరుపతిలో శ్రీమతి షర్మిల సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి లీలామహల్‌ సెంటర్‌లో సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. 'చిత్తూరు జిల్లా ప్రజలకు, తిరుపతి నగర వాసులకు మీ రాజన్న బిడ్డ, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది' అంటూ శ్రీమతి షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

రాజశేఖరరెడ్డిగారి హయాంలో అన్నపూర్ణగా మారిన మన రాష్ట్రం ఆయన వెళ్ళిపోయిన ఈ నాలుగేళ్ళలో కుక్కలు చింపిన విస్తరిలా తయారైపోయిందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. గత నాలుగేళ్ళుగా ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమానికి పాడె కట్టిందని, అభివృద్ధిని అటకెక్కించిందని నిప్పులు చెరిగారు. తెలుగువారి పైనే వేటు వేసింది కాంగ్రెస్‌ పార్టీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగువారినే వెన్నుపోటు పొడిచిందన్నారు. మేం ఇచ్చిన అధికారంతో మా కళ్ళే పొడుస్తారా? మా బ్రతుకులనే బుగ్గిపాలు చేస్తారా? అని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. విభజన పేరుతో కాంగ్రెస్‌ పార్టీ తెలుగువారికి వెన్నుపోటు పొడిచిందని దుయ్యబట్టారు. విభజన పేరుతో సీమాంధ్రను వల్లకాడు చేస్తారా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. ఒక తండ్రిలా అందరికీ సమన్యాయం చేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ చెబుతూనే ఉందని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు.

ఉప ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో పనిచేసింది మీరు కాదా చంద్రబాబుగారూ అని శ్రీమతి షర్మిల నిలదీశారు. ప్రతి ఎన్నికల్లోనూ స్వార్థాన్నే చూసుకున్న చంద్రబాబును ప్రతిపక్ష నాయకుడనాలా? లేక దుర్మార్గుడనాలా? అని ప్రశ్నించారు. ప్రజల తరపు మాట్లాడకపోగా హైదరాబాద్ను నాలుగు లక్షల కోట్లకు అమ్మకానికి పెట్టింది మీరు కాదా? అని బాబును ‌నిలదీశారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని కాపాడిన మీకు గౌరవం ఎక్కడుంది? తెలంగాణను మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని కేంద్రానికి లేఖ రాసింది మీరు కాదా?  ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కాంగ్రెస్‌తో పాలు నీళ్ళులా కలిసిపోయారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనకు బ్లాంక్‌ చెక్కులా లేఖ రాసి ఇచ్చారని విమర్శించారు. ఆ లేఖను చంద్రబాబు ఇప్పటికి వెనక్కి తీసుకోని వైనాన్ని వెల్లడించారు. సీమాంధ్రకు ఇంత అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు ఉలకరు పలకరేమిటని ప్రశ్నించారు. మీరు రాజీనామా చేసి, మీ వారి చేత ఎందుకు రాజీనామా చేయించలేదు? కోట్ల మందికి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మాట్లాడరు? అని శ్రీమతి షర్మిల చంద్రబాబును ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని సీమాంధ్రలో అడుగు పెట్టాలనుకున్నారని నిలదీశారు. 

హైదరాబాద్‌లోని సీమాంధ్రుల ఆస్తులను లాక్కుంటామని టిఆర్ఎస్‌ అన్నది నిజమా? కాదా? అని శ్రీమతి షర్మిల అన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న సీమాంధ్రుల విగ్రహాలు టిఆర్ఎస్‌ కూల్చింది వాస్తవమా? కాదా? అన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు మాట్లాడడంలేదన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మడంలేదంటే కారణం విశ్వసనీయత లేకపోవడమే అని శ్రీమతి షర్మిల అన్నారు.

సీమాంధ్రులకు అన్యాయం జరగకూడదనే జగనన్న ఏడు రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేశారని శ్రీమతి షర్మిల తెలిపారు. న్యాయం చేయలేరని తేలిపోయింది కాబట్టే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నది జగనన్న మాట అన్నారు. మహానేత వైయస్ఆర్‌ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆయన పథకాలకు తూట్లు పెట్టిందని దుయ్యబట్టారు.

రాష్ట్రంలోని తొమ్మిది కోట్ల మంది ప్రజలలో 6 కోట్ల సీమాంధ్రులు విభజనను వ్యతిరేకిస్తున్నారని శ్రీమతి షర్మిల తెలిపారు. సిపిఎం, ఎంఐఎం, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఎప్పుడూ విభజనకు అనుకూలంగా లేవని తెలిపారు. ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ ‌నాయకులు మాత్రం పదవులు పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రజల పక్షాన నిలబడుతుంది : శ్రీమతి విజయమ్మ

అంతకు ముందు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ప్రారంభోపన్యాసం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ప్రజల పక్షాన ని‌లబడి పోరాడుతోందని తెలిపారు.  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే రాష్ట్రంలో ప్రస్తుత‌ పరిస్థితి దాపురించేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓట్లు, సీట్లు కోసమే కాంగ్రెస్‌ పార్టీ విభ‌జించాలని నిర్ణయం తీసుకుందని విమర్శించారు.

మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి‌ 4వ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయన సమాధికి శ్రీమతి షర్మిల నివాళులు అర్పించిన అనంతరం సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి లీలామహల్ సెంటర్ వద్ద జరిగిన భారీ బహిరంగసభలో సమైక్య శంఖారావాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వం వహించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, పార్టీ సీఈసీ సభ్యురాలు రోజా తదితర నాయకులు ఈ బహిరంగసభలో పాల్గొన్నారు.

శ్రీమతి షర్మిల బహిరంగసభకు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. సభా ప్రాంతానికి తరలివచ్చిన అశేష జనవాహినితో లీలామహల్‌ సెంటర్‌ సంద్రంలా మారిపోయింది. శ్రీమతి షర్మిలకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. కాగా, శ్రీమతి షర్మిల ప్రసంగంగ ప్రారంభమైన కొద్దిసేపటికే సభా ప్రాంతం అంతా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అక్కడికి మరి కొంత దూరంలో మాత్రం విద్యుత్‌ సరఫరా యధావిధిగా ఉండడం గమనార్హం.
Share this article :

0 comments: