అసలు ఇది ప్రజాస్వామ్యమేనా..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసలు ఇది ప్రజాస్వామ్యమేనా..?

అసలు ఇది ప్రజాస్వామ్యమేనా..?

Written By news on Saturday, September 21, 2013 | 9/21/2013

కాంగ్రెస్, టీడీపీలకు జనఘోష పట్టదా? : విజయమ్మ
ఇంత జరుగుతున్నా చలనం రాదా?: విజయమ్మ ఆవేదన
 సమైక్య రాష్ట్రం కోసం కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలి
 చంద్రబాబు తన లేఖను వెనక్కు తీసుకోవాలి.. టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి
 రాష్ట్రం రావణ కాష్టంగా రగలటానికి కారణం కచ్చితంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ సీపీ రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కోరింది
 పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు... నేనూ, జగన్ నిరాహార దీక్షలు చేశాం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ముఖ్యమంత్రితో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దానిని వెనక్కి తీసుకోవాలని, ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు రోడ్డెక్కి రోజుల తరబడి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో ఎందుకు చలనం రావటం లేదని విజయమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టేందుకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 
 దాంతో వారంతా పోలీసుస్టేషన్ వద్దే ధర్నా చేపట్టారు. ఈ విషయం తెలిసి పార్టీ ప్రజాప్రతినిధులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్తున్న మంత్రులకు చేతనైతే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమైక్యత కోసం తమ పార్టీ ప్రజాప్రతినిధులు చేపట్టిన నిరసన కార్యక్రమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన ధోరణిని ఆమె తప్పుబట్టారు.
 
 అసలు ఇది ప్రజాస్వామ్యమేనా..?
 ‘‘నిరసన తెలపటం రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు గర్హనీయం. అసలు ఇది ప్రజాస్వామ్యమేనా..?’’ అని విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘రాష్ట్రాన్ని విభజిస్తూ నోట్ తయారైందన్న నేపథ్యంలో మా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన దీక్ష చేపట్టదలచారు. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్‌లకు నివాళి అర్పించి.. అసెంబ్లీకి వెళ్లి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపాలనుకున్నారు. కానీ, పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అరెస్ట్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించటం బాధాకరం. ఇటీవలే జగన్‌బాబు దీక్ష సందర్భంగా ఆసుపత్రిలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులమైన మమ్మల్ని కూడా లోపలికి అనుమతించకపోవటంతో నిరసన తెలిపిన కార్యకర్తలందరినీ చావబాదారు. పోలీస్‌స్టేషన్ తీసుకెళ్లి ఇష్టానుసారం కొట్టారు. ప్రభుత్వం ఇంతలా ఎందుకు వ్యవహరిస్తోందో అర్థంకావట్లేదు’’ అని ఆమె నిరసన తెలిపారు.
 
 గంటసేపు సీడబ్ల్యూసీలో చర్చించి నిర్ణయమా?
 ‘‘రాష్ట్రం ఈ రోజు రావణకాష్టంలా మండుతోంది. అన్నదమ్ముల మధ్య అంతరాలు పెంచుతున్నారు. ఈ పరిస్థితికి కారణం కచ్చితంగా కాంగ్రెస్, టీడీపీలే. కాంగ్రెస్ పార్టీ ఏఒక్కరితో చర్చించకుండా, ప్రజలతో సంబంధం లేకుండా సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష అధినేతగా ఉన్న చంద్రబాబు ఎలాంటి షరతులు లేకుండా విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. దాంతో కాంగ్రెస్ పార్టీ కేవలం గంట సేపు సీడబ్ల్యూసీలో చర్చించి రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకుంది’’ అని ఆమె ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవికి, ఇతర ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు కట్టబెట్టటం, ల్యాంకో రాజగోపాల్‌కు పనులు అప్పగించడం.. వంటి పక్కా ప్రణాళికలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల నోళ్లను ఆ పార్టీ అధినాయకత్వం మూయించిందన్నారు.
 
 వారి నాటకాలు బయటపడుతున్నాయి...
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు రాష్ట్ర విభజన నిర్ణయం ముందే తెలిసి కూడా... వారి స్వలాభం కోసం ఒక ప్రాంతాన్ని తాకట్టు పెట్టారని విజయమ్మ మండిపడ్డారు. విభజన ప్రకటన జరిగిన పది రోజుల తర్వాత కాంగ్రెస్ నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించి, ప్రజలు అడగాల్సిన ప్రశ్నలను వారే ఎదురు ప్రశ్నించారని.. దీనిని చూస్తే వారి నాటకాలేమిటో స్పష్టంగా బయటపడుతున్నాయని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. ఈ రోజు కేంద్ర, రాష్ట్ర మంత్రులు సమైక్యం అనటమే తప్ప పదవులకు మాత్రం రాజీనామా చేయటంలేదని ఎండగట్టారు. గతంలో ఒక సారి రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పుడు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే నిర్ణయం వెనక్కుపోయిన విషయాన్ని విజయమ్మ గుర్తుచేశారు. అదే విధంగా ఈసారి కూడా పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేస్తే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశం కచ్చితంగా ఉంటుందన్నారు.
 
 చంద్రబాబు తన రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రాన్ని రెండు చీల్చటానికి సహకరించారని విజయమ్మ దుయ్యబట్టారు. కేంద్రం విభజన ప్రకటన వెలువరిచిన మరుసటి రోజున ప్రెస్ మీట్ పెట్టి బాబు విభజన నిర్ణయాన్ని స్వాగతించారని ఆమె గుర్తుచేశారు. కొత్త రాజధాని కోసం నాలుగైదు లక్షల కోట్లు కావాలని ఆయన అడగటం సిగ్గుచేటన్నారు. ఈ రోజు ఉద్యమం ఇంతపెద్ద ఎత్తున జరుగుతున్నా, ఉద్యోగ సంఘాలు 50 రోజులుగా రోడ్లపై ఉద్యమిస్తున్నా, చంద్రబాబు మాత్రం తన లేఖ వెనక్కి తీసుకోవటలేదని ధ్వజమెత్తారు.
 
 మూకుమ్మడి రాజీనామాలతోనే కేంద్రంపై ఒత్తిడి...
 ‘‘వైఎస్సార్‌సీపీ మాత్రం మొదటి నుంచి ఒకటే మాట చెబుతోంది. విభజనపై మీడియాలో వార్తలు వెలువడుతుండటంలో.. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ పలుమార్లు లేఖలు రాశాం. ఏ నిర్ణయం తీసుకున్నా ఒక తండ్రిలా తీసుకోవాలని కోరాం. అలాంటి పరిస్థితి లేదని తెలిసి కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు. ఆంటోని కమిటీ ద్వారా కూడా రాష్ట్రానికి ప్రయోజనం ఉండదని భావించి నేను, జగన్‌బాబు పదవులకు రాజీనామా చేశాం. జగన్ జైల్లో ఉన్నా వారం రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. గుంటూరు వేదికగా నేను కూడా దీక్ష చేశా.
 
 అన్యాయాన్ని నిరసిస్తూ షర్మిలమ్మ ‘సమైక్య శంఖారావం’ పేరిట బస్సుయాత్ర చేసింది. మా పార్టీ నేతలందరితో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించాం. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సమైక్యంగా ఉంచాలని సూచించాం’’ అని విజయమ్మ వివరించారు. ‘‘ఇంత చేసినా కేంద్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో చలనం రావటం లేదు. అందుకే టీడీపీ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు, రాష్ట్రంలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి విభజన నిర్ణయం వెనక్కుతీసుకునే అవకాశం ఉంటుంది’’ అని ఆమె పేర్కొన్నారు.
Share this article :

0 comments: