గడువు ముగిసింది... బెయిలివ్వండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గడువు ముగిసింది... బెయిలివ్వండి

గడువు ముగిసింది... బెయిలివ్వండి

Written By news on Thursday, September 12, 2013 | 9/12/2013

గడువు ముగిసింది... బెయిలివ్వండి
* అన్యాయంగా 15 నెలలకుపైగా జైల్లో ఉంచారు
* ఈ నెల 8లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ‘సుప్రీం’ ఆదేశించింది
* దర్యాప్తు పూర్తిచేసి సీబీఐ చార్జిషీట్లను కూడా దాఖలు చేసింది
* సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారమే బెయిల్ అభ్యర్థిస్తున్నా
* నా వాదన స్వేచ్ఛగా వినిపించాలంటే నేను బయట ఉండాలి
* సీబీఐ ప్రత్యేక కోర్టులో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్
* కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశం
*  విచారణ నేటికి వాయిదా
 
సాక్షి, హైదరాబాద్: ‘‘సీబీఐ విచారణను నేను ఏ విధంగానూ ప్రభావితం చేయకపోయినా ‘సాక్షి’ పెట్టుబడుల వ్యవహారంలో 15 నెలలకు పైగా నన్ను జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి నాకు బెయిల్ మంజూరు చేయండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి బుధవారం సీబీఐ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఆయన తరఫున న్యాయవాది జి.అశోక్‌రెడ్డి ఈ మేరకు సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను అరెస్టు చేసి ఇప్పటికే 15 నెలలు దాటిందని, దర్యాప్తును అడ్డుకోకపోయినా, అందుకు ఎలాం టి ప్రయత్నం చేయకపోయినా అన్యాయంగా జైలులో ఉంచారని జగన్ తన పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

‘రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీకి నేను అధ్యక్షుడిని. రాష్ట్రంలో ప్రబల మైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్న ఏకైక పార్టీ మాదేనని జాతీయ మీడియా సంస్థలు జరిపిన అనేక సర్వేల్లో తేలింది. ఈ క్రమంలోనే రాష్ట్రాన్ని విభజిస్తూ అధికార పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. విభజనపై ప్రజలు కోపోద్రిక్తులవుతున్నారు. విభజనను మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రజలతో కలిసి వారి ఆకాంక్షల మేరకు పోరాడాల్సిన బాధ్యత నాపై ఉంది. వివాదాస్పద నిర్ణయం నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను నివారించడానికి, శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడానికి జరిగే ప్రయత్నాల్లో నేను కీలకపాత్ర పోషించగలను. ఈ అంశాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయండి’ అని జగన్ తన పిటిషన్‌లో కోరారు.

కోర్టుకు హాజరయ్యే ముందు అరెస్టు చేశారు
‘నా కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి 2011 ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌ఐఆర్ (ఆర్‌సీ నంబర్ 19-ఎ) నమోదు చేసింది. దాదాపు తొమ్మిది నెలల పాటు... విచారణలో అధిక భాగం పూర్తయి, మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత గత ఏడాది మే 27న అరెస్టుకు సరైన కారణాలు చూపకుండానే నన్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. సీబీఐ అన్యాయంగా అరెస్టు చేస్తుందనే అనుమానంతో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాను. నన్ను అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ తన కౌంటర్‌లో పేర్కొనలేదు. కనీసం నన్ను విచారించకుండానే సీబీఐ అప్పటికే మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది.

సీబీఐ దాఖలు చేసిన మొదటి చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు గత ఏడాది ఏప్రిల్ 7న విచారణకు స్వీకరించింది. మే 28న నన్ను వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. మొదటి చార్జిషీట్‌లో (సీసీ-8) కోర్టు జారీచేసిన సమన్లను అందుకున్న తరువాత కోర్టు ఎదుట హాజరుకావటానికి నాకు నాలుగు రోజులే గడువుంది. అలాంటి సమయంలో సీబీఐ మే 25న విచారణకు రమ్మని నాకు 22న సమాచారమిచ్చింది. పార్లమెంట్ సభ్యుడిగా, ఓ ప్రధాన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నా... చట్టాలపై ఉన్న గౌరవంతో నేను సీబీఐ విచారణకు హాజరయ్యాను. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాను.

ఇక తెల్లవారితే కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. కోర్టు ఎదుట హాజరయితే, ఇక కేసు మొత్తం న్యాయస్థానం పరిధిలోకి వస్తుంది. తగిన పూచీకత్తు సమర్పించి బెయిల్‌పై వచ్చే వీలుంటుంది. వాటన్నిటినీ దెబ్బ తీయటానికి... కేవలం కోర్టు ఎదుట హాజరవటానికి కొన్ని గంటల ముందు సీబీఐ నన్ను అరెస్టు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉండి ప్రస్తుత ప్రభుత్వంలో అత్యంత శక్తిమంతమైన పదవుల్లో ఉన్నవారంతా బయటే ఉన్నారు. అలాంటప్పుడు నన్ను అరెస్టు చేయాల్సిన అవసరమే లేదు. నన్ను అరెస్టు చేయడాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా తప్పుపట్టింది. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలోనే ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందంటూ హైకోర్టు కూడా సీబీఐ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సీబీఐ తీరు వివక్షపూరితమే కాదు. చట్ట విరుద్ధం కూడా’ అని జగన్‌మోహన్‌రెడ్డి తన పిటిషన్‌లో వివరించారు.

దర్యాప్తును ఎప్పుడూ అడ్డుకోలేదు....
‘ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నేను దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. నేను బెదిరించినట్లు ఏ ఒక్క సాక్షి కూడా ఇప్పటి వరకూ ఆరోపించలేదు. సాక్షులను ప్రభావితం చేస్తానని సీబీఐ కూడా ఎక్కడా, ఎప్పుడూ ఆరోపించలేదు. అయినా దాదాపు పదిహేను నెలలకుపైగా నన్ను జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు. ఇది నా హక్కులను హరించడమే. ఇదే కేసులో ఉన్న ఇతర నిందితులంతా బయటే ఉన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్న న్యాయసూత్రాలకు విరుద్ధంగా నన్ను మాత్రం అరెస్టు చేసి 15 నెలలుగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు.

కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను, సాక్ష్యాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. అందుకని ఈ దర్యాప్తును అడ్డుకోవడం, సాక్ష్యాలను తారుమారు చేయటం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. సీసీ నంబర్ 8 చార్జిషీట్‌తోపాటు ఈ కేసు మొత్తానికి నా రిమాండ్ వర్తిస్తుందని, 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయకపోతే బెయిల్‌కు అర్హుడినని గత ఏడాది హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. బెయిల్ అనేది నిబంధన... కేసు రుజువయ్యే వరకూ నిందితులందరినీ నిరపరాధులుగానే భావించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో స్పష్టం చేసింది.

పారదర్శకమైన తుది విచారణలో భాగంగా నా వాదనను స్వేచ్ఛగా వినిపించుకోవాలంటే బెయిల్ మంజూరు చేయండి. నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది మే 9న తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయండి. తుది విచారణకు అందుబాటులో ఉంటా. న్యాయస్థానం ఎటువంటి షరతులు విధించినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని జగన్‌మోహన్‌రెడ్డి తన పిటిషన్‌లో కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక కోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీచేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Share this article :

0 comments: