ఆత్మగౌరవ యాత్రను అర్ధంతరంగా ఆపేసింది అందుకే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆత్మగౌరవ యాత్రను అర్ధంతరంగా ఆపేసింది అందుకే

ఆత్మగౌరవ యాత్రను అర్ధంతరంగా ఆపేసింది అందుకే

Written By news on Friday, September 13, 2013 | 9/13/2013

జగన్ బెయిల్‌ను అడ్డుకునేందుకే..విస్తరించు & ప్లే క్లిక్ చేయండి
* చంద్రబాబు ఢిల్లీ యాత్రపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
* ఆత్మగౌరవ యాత్రను అర్ధంతరంగా ఆపేసింది అందుకే
* గతంలో చిదంబరం వద్దకు బృందాన్ని పంపి ఈడీని ఉసిగొల్పారు
* కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కువల్లే జగన్‌పై కేసులు..
* కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షిస్తున్నది చంద్రబాబే
 
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఆత్మగౌరవ యాత్రను రద్దుచేసుకుని మరీ ఢిల్లీకి వెళుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన అంశాలపై మాట్లాడటానికే తాను ఢిల్లీ వెళ్లి ప్రధాని, రాష్ట్రపతిని కలుస్తున్నట్లు చంద్రబాబు పైకి చెబుతున్నా... లోపల చేయబోతున్నది మాత్రం జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలేనని దుయ్యబట్టారు. జగన్ ప్రభంజనంలో తాను, తన పార్టీ కొట్టుకుపోతామనే భయంతోనే చంద్రబాబు అడ్డగోలు విమర్శలు చేస్తున్నాడని చెప్పారు.

ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జగన్ కేసులో చార్జిషీటు వేసే గడువు ఈ నెల 9వ తేదీతో ముగిసింది కనుక తనకున్న హక్కు మేరకు జగన్ బెయిల్ పిటిషన్ వేసుకున్న తరుణంలో... బెయిల్‌ను అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు ఢిల్లీకి పయనమవుతున్నారనేది పచ్చినిజమని మండిపడ్డారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినపుడల్లా ఏదో ఒక కొత్త నాటకం ఆడి బెయిల్ రాకుండా కోర్టులను ప్రభావితం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. గతంలో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులతో నాటకాలాడించిన చంద్రబాబు ఇప్పుడు తానే స్వయంగా అందుకు ఉపక్రమిస్తున్నారని విమర్శించారు. గత ఏడాది డిసెంబర్‌లో బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినపుడు కూడా తమ పార్టీ నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని ఆర్థిక మంత్రి పి.చిదంబరం వద్దకు పంపి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్) చేత ఆస్తుల జప్తునకు ఆదేశాలు ఇప్పించారని గుర్తుచేశారు. అసలు చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రను అర్ధంతరంగా ఇపుడు ఎందుకు ముగించారో, ఎందుకు ఢిల్లీ వెళుతున్నారో ప్రజలకు జవాబు చెప్పాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌తో కుమ్మక్కయింది బాబే
వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైందని ప్రతి విషయంలోనూ ఆరోపించే చంద్రబాబు వాస్తవానికి ఆయనే అధికార పార్టీతో మిలాఖత్ అయ్యారని ఉమ్మారెడ్డి నిప్పులు చెరిగారు. తనలో 30 శాతం కాంగ్రెస్ రక్తం ఉందన్న చంద్రబాబు ఎన్ని సందర్భాల్లో ఆ పార్టీతో కుమ్మక్కయ్యారనేది ప్రజలకు తెలుసునన్నారు. మాజీమంత్రి శంకర్రావు జగన్‌పై కేసు వేస్తే అందులో ఎర్రన్నాయుడును చంద్రబాబే ఇంప్లీడ్ చేయించారని, కాంగ్రెస్, టీడీపీ కలిసి ఆడిన నాటకం వల్లే జగన్‌పై కేసులు వచ్చాయని చెప్పారు.

ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌తో కుమ్మక్కై తమ ఓట్లన్నీ ఆ పార్టీకి మళ్లిస్తే టీడీపీ అభ్యర్థుల డిపాజిట్లు పోలేదా అని ఆయన ప్రశ్నించారు. చిత్తూరు, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను పోటీ చేయించకుండా కాంగ్రెస్‌కు సహకరించి వారితో కుమ్మక్కు కాలేదా? అని ప్రశ్నించారు. శాసనసభనుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కూడా పార్టీ నేత ప్రతిభా భారతిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. చంద్రబాబు తన పాదయాత్రలో ‘కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు.. దిగి పోవాలి..’ అని విమర్శించి అవిశ్వాస తీర్మానం పెట్టలేదన్న విషయాన్ని మరిచిపోయారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పెట్టిన  అవిశ్వాస తీర్మానంపై చరిత్రలో లేని విధంగా తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. గైర్హాజరు కావడం అంటే ప్రభుత్వాన్ని రక్షించ డమే కదా అని ప్రశ్నించారు. ఆరోజు చంద్రబాబు కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టి ఉంటే రాష్ట్రానికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఉమ్మారెడ్డి చెప్పారు.

విభజన పాపం చంద్రబాబుదే
యూపీఏ ప్రభుత్వం అడగ్గానే రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన ఘనత చంద్రబాబుదని ఉమ్మారెడ్డి విమర్శించారు. సీడబ్ల్యూసీ విభజన నిర్ణయాన్ని వెల్లడించిన ఒక్క రోజులోనే నాలుగైదు లక్షల కోట్ల రూపాయలిస్తే కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకుంటామని తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఘనత కూడా ఆయనదేనని ఎద్దేవా చేశారు. బాబు తన బస్సు యాత్రలో ఏ రోజైనా సమైక్యాంధ్ర జిందాబాద్ అన్నారా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారా? విభజన చేయాలంటూ తానిచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటానని చెప్పారా? తన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించారా? అసలు ఆయన ఎందుకు ఆత్మ గౌరవయాత్రను చేశారు? యాత్ర ద్వారా ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

నిన్నటివరకూ తనది రెండు కళ్ల సిద్ధాంతమని చెప్పిన బాబు ఇపుడు ఒక కాలు కృష్ణా, మరోకాలు మూసీ నదిలో పెట్టి రెండు కాళ్ల విధానాన్ని అనుసరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, అంతర్జాతీయ వేదికల్లో పాల్గొన్న వ్యక్తిగా చంద్రబాబు బస్సుయాత్రలో మాట్లాడిన మాటల ఆయన స్థాయికి తగినట్టే ఉన్నాయా? అని మండిపడ్డారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు పశువులని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై అభ్యంతరం తెలుపుతూ... కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారిన చంద్రబాబు ఇతరులను విమర్శించడం సరికాదన్నారు.

ఇటలీకి ఇడుపులపాయకూ లింకు ఉందని అసంబద్ధమైన ఆరోపణలు చేశారని, వాస్తవానికి అలాంటి లింకు చిదంబరానికి, చంద్రబాబుకూ మధ్యే ఉందని చెప్పారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు ఎవరూ లేకుండా ఢిల్లీలో అర్ధరాత్రి వేళ ఒక ఎంపీని వెంట బెట్టుకుని చిదంబరంతో మాట్లాడి వచ్చారని తెలిపారు. దిగ్విజయ్‌కూడా బాబు తనకు మంచి స్నేహితుడన్నారని గుర్తుచేశారు. తనను చూసి షర్మిల పాదయాత్ర, బస్సు యాత్ర చేస్తోందనే  బాబు వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని, ఆ మాటకొస్తే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని చూసే కదా మీరు పాదయాత్ర సంకల్పించింది అని ఆయన ప్రశ్నించారు.
Share this article :

0 comments: