అధిష్టానాన్ని ఒత్తిడి చేయకుండా డ్రామాలెందుకు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధిష్టానాన్ని ఒత్తిడి చేయకుండా డ్రామాలెందుకు?

అధిష్టానాన్ని ఒత్తిడి చేయకుండా డ్రామాలెందుకు?

Written By news on Wednesday, September 11, 2013 | 9/11/2013

టీడీపీకి మైసూరారెడ్డి డిమాండ్
కాంగ్రెస్ నేతలు పదవులకు రాజీనామా చేయాలి
అధిష్టానాన్ని ఒత్తిడి చేయకుండా డ్రామాలెందుకు?
దాడులు అమానుషం, తీవ్రంగా ఖండిస్తున్నాం

 
 
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్టయితే రాష్ట్రాన్ని విభజించాలని, ఆ పార్టీ ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్నప్పుడే ఆ పార్టీ తన చిత్తశుద్ధిని చాటుకున్నట్టవుతుందని చెప్పారు. రాష్ట్ర విభజనపై టీడీపీ ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకుంటుందా? లేక అదే విధానానికి కట్టుబడి ఉంటుందా? ఏదో ఒకటి ప్రజలకు తెలియజేసి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. అలాగే కాంగ్రెస్ మంత్రులు, ఇతర నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసి విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా తమ అధిష్టానవర్గంపై ఒత్తిడి తెచ్చి తమ విజ్ఞతను చాటుకోవాలని సూచించారు.
 
  ఏపీఎన్జీవోలు నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో పాల్గొని తిరిగి వెళుతున్న సందర్భంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన దాడిలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, కాకినాడకు చెందిన కట్టా సత్యనారాయణ గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మైసూరారెడ్డితోపాటు పార్టీ నేతలు బి.గురునాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మేరుగ నాగార్జున మంగళవారం ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైసూరారెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడారు.  
 
  విభజనపై నీ అభిప్రాయం చెప్పు బాబూ...
 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడికో వెళ్లి సింహగర్జనలు చేసే బదులు విభజనపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు కేంద్రం వద్ద ఒక రకంగా చెప్పి, ప్రజల్లోకి వెళ్లి మరోరకంగా మాట్లాడటం రెండు నాల్కల ధోరణి అవుతుందే తప్ప మరొకటి కాదని విమర్శించారు. బాబు తన లేఖను వెనక్కి తీసుకోకుండా, కాంగ్రెస్ మంత్రులు అధిష్టానంపై ఒత్తిడి చేయకుండా ఉంటే... వాళ్లు కుమ్మక్కయి డ్రామాలు ఆడుతున్నారనేది స్పష్టం అవుతుందని చెప్పారు. ఈ రెండు పార్టీలూ ఇలాగే వ్యవహరిస్తే ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు మరింత రగిలి దుష్పరిణామాలకు దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనలకు మూలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు.
 
 ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా సమావేశాలు జరుపుకుని తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని, కానీ ఇలాంటి దాడులనేవి అమానుషమని, ఈ దాడిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఒంటెత్తు పోకడలతో ఏకపక్షంగా సీట్ల కోసం, ఓట్ల కోసం నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయన్నారు. ఇప్పటివరకూ ఓ రకంగా మాట్లాడుతూ వచ్చిన మంత్రులు, ఇపుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజీనామాలు చేసి అధిష్టానంపై ఒత్తిడి తేకుండా అసెంబ్లీలో తీర్మానం వచ్చినపుడు ఓడించడానికే సభ్యులుగా కొనసాగుతామని మంత్రులు చెప్పడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్-3 ప్రకారం భారత రాష్ట్రపతి కోరే తీర్మానం కేవలం శాసనసభ వైఖరి తెలుసుకోవడానికేనని, ఉత్తరప్రదేశ్ మాదిరిగా అసెంబ్లీ తీర్మానం పెట్టి కేంద్రానికి తమ అభిప్రాయం తెలియజేయడానికి ఇపుడున్న అడ్డంకులు ఏమీ లేవని మైసూరా స్పష్టం చేశారు.
 
  ఎల్బీ స్టేడియం సభలో పోలీసు కానిస్టేబుల్‌పై దౌర్జన్యం జరిగిందనే విషయాన్ని ప్రస్తావించగా... శాంతి భద్రతలు పరిరక్షించే విధుల్లో ఉన్న వ్యక్తి ఆ విధంగా నినాదాలు చేయడం సబబేనా? అని ప్రశ్నించారు. అది ఆయన విజ్ఞతకు, ఆయనకు మద్దతునిస్తున్న వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నామన్నారు. సభ సందర్భంగా ఉద్యోగులు రెచ్చగొట్టారనే ఆరోపణలపై ప్రశ్నించగా... ఎవరు ఎవరిని రెచ్చగొట్టారు? ఒకరు సభ జరుపుకునేటపుడు మరొకరు అంతరాయాలు కలిగించడం సరికాదు కదా? అని ఆయన బదులిచ్చారు.
Share this article :

0 comments: