రాజీనామాలు ఆమోదించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజీనామాలు ఆమోదించండి

రాజీనామాలు ఆమోదించండి

Written By news on Thursday, September 26, 2013 | 9/26/2013

నేడు స్పీకర్‌ను కలసి కోరనున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తాము తమ పదవులకు చేసిన రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం ఉదయం 11 గంటలకు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలవనున్నారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం ఆయన క్యాంపు కార్యాలయం లో రాజకీయ వ్యవహారాల కమిటీ, అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పలు దఫాలుగా సమావేశాలు జరిగాయి.
 
 రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రజా సమస్యలు వంటి అంశాలపై ఈ భేటీల్లో సుదీర్ఘంగా చర్చించారు.  56 రోజులుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం తీరుతెన్నులపై విపులంగా చర్చించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామాల అంశం చర్చకు వచ్చినపుడు.. రాజీనామాలను ఆమోదించుకోవటానికి గురువారం మరోసారి స్పీకర్‌ను కలవాలని నిర్ణయించారు. రాష్ట్రాన్ని విభజించాలని జూలై 30వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణ యం తీసుకోవటానికి ముందు 25వ తేదీనే ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా తమ పదవులకు రాజీనామాలు చేస్తూ స్పీకర్‌కు లేఖలు పంపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అవి పెండింగ్‌లో ఉన్నాయి.
 
 కాంగ్రెస్, టీడీపీల ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలి...
 అలాగే విభజన విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరులు, రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపైనా జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో చర్చ జరిగింది. రాజీనామాలంటూ ఆ రెండు పార్టీల నేతలు డ్రామాలాడటం తప్ప అందుకు సిద్ధపడటం లేదని, ఈ రెండు పార్టీల ప్రజా ప్రతినిధులు సైతం రాజీనామాలకు సిద్ధపడితే విభజన ప్రక్రియ నిలిచిపోతుందని సమావేశాల్లో అభిప్రాయం వ్యక్తమైంది. అయితే కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు ముందుకు రావడం లేదని నేతలు పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల ద్వంద్వ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉందని సమావేశం భావించింది. కాంగ్రెస్ నేతలు రోజుకో రకమైన మాటలతో పరిస్థితిని మరింత అయోమయంలో పడేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది.
 
 బాబు ఏ వైఖరీ సూటిగా చెప్పలేదు: తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇటీవలి కాలంలో ఢిల్లీలో పర్యటించిన అంశం చర్చకు రాగా.. ఢిల్లీలో ఆయన విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అన్న విషయంలో ఒక్క మాట మాట్లాడలేదని, సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర సందర్భంలో కూడా ఎక్కడా విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? ఏదో ఒక వైఖరి సూటిగా చెప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ పోయారని సమావేశంలో నేతలు గుర్తుచేశారు.
 
 ప్రజా సమస్యలను వదిలేశారు: సీమాంధ్రలో గడిచిన 56 రోజులుగా ఉద్యమం తీవ్ర రూపంలో కొనసాగుతున్నా ఈ నేతలకు చీమకుట్టినట్టయినా లేదనీ.. ఇదే అదనుగా ప్రభుత్వం ప్రజల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని సమావేశం అభిప్రాయపడింది. ప్రభుత్వం ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేసిందని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? అసలు ప్రభుత్వమేనేది ఒకటుందా? అన్న అనుమానాలు ఉన్నాయని సమావేశంలో చర్చకు వచ్చింది. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ లేవని, ఇలాంటి సమయంలో ప్రజల పక్షాన నిలబడి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ఉద్యమంలో పార్టీ నేతలు భాగస్వాములవుతూ మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని సమావేశాలు నిర్ణయించాయి.
 
 ఢిల్లీలో ఉద్యోగుల ధర్నాకు విజయమ్మ...
 షరతులతో కూడిన బెయిల్ కారణంగా తాను హైదరాబాద్ వీడివెళ్లటానికి అవకాశం లేదని, అందుకే సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి స్వయంగా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను హాజరుకావాలని కోరానని ఈ సందర్భంగా జగన్ వివరించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల చేసే ఉద్యమంగానీ, ఇతరత్రా నిరసనల కార్యక్రమాలకు పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూనే విభజన ప్రక్రియను నిలిపివేయాలంటే ఉద్యోగ సంఘాలు మరింత చొరవ తీసుకుని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల సంతకాలతో కేంద్రానికి లేఖ రాయాలని, దానివల్ల మంచి ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. తద్వారా రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరులు కూడా బయటపడుతాయని, వారు చేస్తున్న డ్రామాలకు బ్రేక్ పడుతుందన్నారు. ఇదిలావుంటే.. పార్టీ సంస్థాగత అంశాలపైన కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.
Share this article :

0 comments: