అందరూ రాజీనామాలు చేసుంటే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అందరూ రాజీనామాలు చేసుంటే..

అందరూ రాజీనామాలు చేసుంటే..

Written By news on Wednesday, September 4, 2013 | 9/04/2013

గబ్బిలాల్లా వేలాడుతున్నారు
  • ఇంత జరుగుతున్నా కాంగ్రెస్, టీడీపీ నేతలకు పదవులే ముఖ్యం: షర్మిల
  •  ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ అడ్డగోలు విభజనకు పూనుకొంది
  •  అసలు విభజనకు మూల కారణం చంద్రబాబే..
  •  బ్లాంక్ చెక్కులా ఆయన ఇచ్చిన లేఖ వల్లే ఇంతదాకా వచ్చింది
  •  బాబు వెంటనే ఆ లేఖను వెనక్కు తీసుకోవాలి
  •  ఆయన, ఆయన పార్టీ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాలి
  •  వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యగళం వినిపిస్తున్నాయి
‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అన్నదమ్ముల్లా ఉన్న తెలుగువారి మధ్య కాంగ్రెస్ పార్టీ విభజన పేరుతో చిచ్చు పెట్టిందని, రాష్ట్రం అగ్నిగుండంలా రగులుతుంటే అందులో చలి కాచుకుంటోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ‘‘వైఎస్ బతికి ఉన్నపుడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రం ఆయన మరణించిన నాలుగేళ్లకే తలకిందులైపోయింది.. కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.. వైఎస్ పెట్టిన ప్రతి పథకాన్నీఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. ఒక్క పెన్షన్‌గాని, ఒక్క రేషన్‌కార్డుగానీ ఇవ్వకుండా ఈ నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ వారు రాక్షసుల్లా పాలిస్తున్నారు.
 
 చేసిన పాపాలు చాలవని చెప్పి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుంటున్నారు’’ అని నిప్పులు చెరిగారు. ఇంత అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్, టీడీపీ నాయకులు తమకు ఓట్లేసిన ప్రజలకంటే పదవులే ఎక్కువని భావిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇంకా గబ్బిలంలా పదవి పట్టుకుని వేలాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర, రాష్ట్ర మంత్రులంతా ఢిల్లీ దర్బారుకు వంగి వంగి సలాములు చేస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కోట్లాది మంది ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు’’ అని విమర్శించారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన  ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేయకుండా నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యగళం వినిపిస్తున్నాయని గుర్తుచేశారు.
 
 రాష్ట్రానికి న్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీకి చేతకాలేదు కాబట్టి.. సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర రెండోరోజు మంగళవారం చిత్తూరు జిల్లాలో సాగింది. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, చిత్తూరులలో జరిగిన బహిరంగ సభల్లో అశేష జనవాహినిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. షర్మిల ప్రసంగాలకు అడుగడుగునా జనం నుంచి మంచి స్పందన లభించింది. యాత్ర సాగిన మార్గమంతా ఆమెకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు.. జై జగన్, జయహో వైఎస్‌ఆర్ అంటూ నినదించారు. నాలుగు సభల్లో షర్మిల చేసిన ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..
 
 సీమాంధ్రను ఎడారి చేస్తారా?

 కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం, టీఆర్‌ఎస్‌ను తనలో కలుపుకొని కేంద్ర రాజకీయాల్లో బలపడడం కోసం ఈ రోజు గొడ్డలితో నరికినట్లు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలనుకుంటోంది. ఇప్పటికే ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మనకు నీళ్లు వదలని పరిస్థితి చూస్తున్నాం. మళ్లీ మధ్యలో మరో రాష్ట్రం వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు నీళ్లెలా వస్తాయి? ఇప్పటివరకు అన్నదమ్ముల్లా బతికిన కృష్ణా ఆయకట్టు రైతులంతా తన్నుకోవాల్సిన పరిస్థితి రాదా? రాయలసీమ ప్రాంతంలో అయితే ఒక్క పంటకైనా నీళ్లు వస్తాయా? ఒక్క పూటైనా ఇక్కడి ప్రజలకు అన్నం దొరుకుతుందా? అపుడు గడప గడపకూ ఆత్మహత్యలు జరిగి గ్రామాలన్నీ శ్మశానాలుగా మారవా? పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తామని అంటున్నారు.. మరి ఆ ప్రాజెక్టును ఎలా నింపుతారో మాత్రం చెప్పడం లేదు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ ఉప్పు నీళ్లు తప్ప మంచినీరెక్కడిది? కృష్ణా, గోదావరి జలాలను అడ్డుకుంటే సీమాంధ్ర ప్రాంతం మహా ఎడారిగా మారదా?
 
 కాంగ్రెస్ సమాధానం చెప్పాలి..
 ఒకప్పుడు మద్రాసు నుంచి పొమ్మన్నారు. పది కాదు, ఇరవై కాదు, అరవై ఏళ్లుగా అందరూ కలిసి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌పై ఇప్పుడు మీకు హక్కులు లేవంటున్నారు. ఈ రోజు చదువుకున్న ప్రతి విద్యార్థీ ఉద్యోగం కోసం చూసేది హైదరాబాద్ వైపే! హైదరాబాద్‌పై హక్కు లేదంటే వారంతా ఎక్కడికి వెళ్లాలి? వారిపై ఆశలు పెట్టుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలి? నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు ఇస్తే కొత్త రాజధాని కట్టుకోవచ్చని చంద్రబాబు అంటున్నారు... రాజధాని క ట్టుకోవడానికే నిధులన్నీ ఖర్చు చేస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేయాలి? ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పెన్షన్, సబ్సిడీ బియ్యం పథకాల అమలుకు నిధులెక్కడి నుంచి వస్తాయి? సీమాంధ్ర ప్రజలు ఎలా బతకాలి? అసలు వారు బతక కూడదనేది మీ ఉద్దేశమా? ఆత్మహత్యలు చేసుకోవాలనేది మీ ఉద్దేశమా? ఈ ప్రశ్నలన్నింటికీ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి.
 
 అసలు కారణం చంద్రబాబే..
 ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని నిర్ణయం తీసుకుందంటే దానికి ప్రధాన కారణం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే. ఏ షరతులూ లేకుండానే తెలంగాణ ఇచ్చేసుకోండి అని ఆయన బ్లాంక్ చెక్‌లా లేఖ రాసిచ్చేశారు. ఆ లేఖ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇంత సాహసం చేసింది. ఇప్పటికైనా చంద్రబాబు తాను రాజీనామా చేసి, తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించే ఆలోచన చేయడం లేదు. అసలు రాష్ట్ర విభజనకు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని యాత్ర చేస్తున్నారు? తెలంగాణకు అనుకూలంగా మీరు లేఖ ఎందుకిచ్చారని ప్రజలు నిలదీస్తే చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు? చేసిందంతా తాను చేసి.. ఇప్పుడు రాష్ట్ర విభజనకు వై.ఎస్.రాజశేఖరరెడ్డే కారణమని చంద్రబాబు అంటున్నారు. అసలు బాబుకు మనస్సాక్షి ఉందా? ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొని తన ఎంపీలు, ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి, లేఖ వెనక్కి తీసుకోవాలి.
 పోరాడుతూనే ఉంటాం: విభజన చేస్తే ఒక తండ్రిలాగా అందరికీ న్యాయం చేయాలని మేం చెప్పాం. ‘అందరినీ పిలవండి, చర్చలు జరపండి’ అన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమన్న సంగతి కూడా మర్చిపోయి నిరంకుశంగా నిర్ణయం తీసుకుంది. న్యాయం చే యడం చేతకాకపోతే ఆ అధికారం ఎందుకు తీసుకుందీ కాంగ్రెస్ పార్టీ? మీరు న్యాయం చేయలేరు, అసలు మీకు న్యాయం చేసే ఉద్దేశమే లేదనేది స్పష్టంగా తేలిపోయింది. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం.. అప్పటి దాకా జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాడుతూనే ఉంటుందని హామీ ఇస్తున్నాం.
 
 బోనులో ఉన్నా జగన్ సింహమే..: విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్మూ, ధైర్యం కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండింటికీ లేవు. అందుకే కుట్రలు పన్ని జగనన్నను జైల్లో పెట్టారు. కానీ ఒక్కటే చెబుతున్నా...బోనులో ఉన్నా సింహం సింహమే(షర్మిల ఈ మాటలంటున్నపుడు సభా ప్రాంగణమంతా హర్షధ్వానాలతో మార్మోగింది). దేవుడి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. దేవుడి దయ వల్ల జగన్ తప్పక బయటకు వస్తారు. రాజన్న రాజ్యం వస్తుంది. ఆరోజు వచ్చే వరకూ జగనన్నకు మీరంతా మద్దతు నివ్వాలని ప్రార్థిస్తున్నాను.’’
 
 అడుగడుగునా జన నీరాజనం
 సాక్షి, తిరుపతి : షర్మిల బస్సు యూత్రకు చిత్తూరు జిల్లాలో అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. వివిధ ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా నిలబడి మరీ షర్మిల మాట్లాడాల్సిందేనని జనం పట్టుబట్టారు. మంగళవారం తిరుపతిలో ఉదయం 9.30 గంటలకు బయలు దేరిన ఆమె 10.30 గంటలకు చిత్తూరు చేరుకోవాల్సి ఉంది. అడుగడుగునా అభిమానులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలకడంతో మధ్యాహ్నం 1.20 గంటలకు చేరుకున్నారు. చంద్రగిరిలో పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు జై జగన్ నినాదాలతో ఘన స్వాగతం పలికారు. నేండ్రగుంట వద్ద వేంకటే శ్వర స్వామి ఆలయం పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆమెను ఆశీర్వదించారు. చిత్తూరు రైల్వే గేటు వద్ద వందలాది మంది ఎదురేగి స్వాగతం పలికారు. పుంగనూరులో పాఠశాల విద్యార్థులు బారులు తీరి సాదరంగా ఆహ్వానించారు. పలుచోట్ల మేడలపై నుంచి పూల వర్షం కురిపించారు. మార్గ మధ్యంలో పలు చోట్ల సమైక్య వాదులు, జేఏసీ నాయకులు షర్మిలకు అభినందనలు తెలిపారు.
 
 నేడు ‘అనంత’లో షర్మిల సమైక్య శంఖారావం
 సాక్షి ప్రతినిధి, అనంతపురం: షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర బుధవారం అనంతపురం జిల్లాలో కొనసాగుతుందని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ వెల్లడించారు.
 
 అందరూ రాజీనామాలు చేసుంటే..
 ‘‘ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ ఒక వైపు, స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు మరో వైపు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరుగుతోందని హఠాత్తుగా సంకేతాలు వెలువడుతున్నపుడే అందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామాలు చేశారు. విభజన నిర్ణయం మార్చుకునేలా చేయడానికి కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో ఎంత మంది టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు? అందరూ రాజీనామాలు చేసి ఉంటే విభజన ప్రక్రియ నిలిచి ఉండేది కదా!’’
 
 ఆ కొరడాతో బాబును కొట్టి ఉంటే..
 పార్లమెంటు ప్రాంగణంలో టీడీపీ ఎంపీ తనను తాను కొరడాతో శిక్షించుకునే బదులుగా అదే కొరడాతో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కొట్టి ఉంటే తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని ఉండే వారని షర్మిల అన్నారు. విభజనలో కాంగ్రెస్‌కు ఎంత బాధ్యత ఉందో చంద్రబాబుకు కూడా అంతే బాధ్యత ఉందని ఆమె దుయ్యబట్టారు. వీరిద్దరి కుమ్మక్కు వల్లనే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని చెప్పారు. పలమనేరులో ఒక చోట చిత్తూరు ఎంపీ శివప్రసాద్ బొమ్మతో కూడిన బ్యానర్ కట్టి ఉండటాన్ని షర్మిల చూపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. షర్మిల వ్యాఖ్యలను ప్రజలు ఈలలు, చప్పట్లతో స్వాగతించారు. వాస్తవానికి పలమనేరు సభ షర్మిల యాత్ర షెడ్యూల్‌లో లేదు. అయితే షర్మిల అటుగా వస్తున్నారని తెలిసి అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో వారినుద్దేశించి ఆమె ప్రసంగించారు. సమైక్య ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న జేఏసీ నేతలను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. పుంగనూరు సైతం షెడ్యూల్‌లో లేనప్పటికీ ఇలాగే ప్రజలు పెద్ద ఎత్తున చేరడంతో ఆమె వారినుద్దేశించి కాసేపు మాట్లాడారు. మంగళవారం షర్మిల యాత్రలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎ.వి. ప్రవీణ్ కుమార్‌రెడ్డి, ఎన్.అమరనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు నారాయణస్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు పి.వి.గాయత్రి, చిత్తూరు, మదనపల్లె కోఆర్డినేటర్లు ఎ.ఎస్.మనోహర్, షమీమా అస్లం సహా పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: