జననేత జగన్ ఆహ్వానిస్తే వైఎస్‌ఆర్‌సీపీలోకి.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జననేత జగన్ ఆహ్వానిస్తే వైఎస్‌ఆర్‌సీపీలోకి..

జననేత జగన్ ఆహ్వానిస్తే వైఎస్‌ఆర్‌సీపీలోకి..

Written By news on Tuesday, September 3, 2013 | 9/03/2013

కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి గుడ్‌బై
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్ కుటుంబానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పంపించినట్లు తెలిపారు.
 
 కర్నూలులో సోమవారం రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర సమైక్యత కోసం చివరి వరకు పోరాడి, ప్రజలకు స్వర్ణయుగాన్ని చూపిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాలుగో వర్థంతి రోజున, ఆయన ఆశయాల కోసం పోరాడుతున్న వైఎస్ జగన్, విజయమ్మ, భారతి, షర్మిలకు సంఘీభావంగా తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తన మద్దతు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకేనని, భవిష్యత్ కార్యాచరణను రెండు రోజుల్లో వెల్లడిస్తానని చెప్పారు. పదేళ్ల పాటు రాజశేఖర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యేగా పనిచేసే అదృష్టం తనకు దక్కిందని, ఆయన జీవించి ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర భగ్గుమంటున్నా, 34 రోజులుగా లక్షలాది మంది ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా.. సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల్లో చలనం లేదని మండిపడ్డారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉండలేనని రెండు రోజుల కిందే సీఎం కిరణ్‌కు స్పష్టం చేశానని చెప్పారు. విభజన నిర్ణయంపై ఆందోళనతో ఉన్న సీమాంధ్ర ప్రజల పక్షాన వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ నిలిచారని.. కుట్రలతో జైల్లో నిర్బంధించినా, జైలులోనే నిరాహార దీక్ష చేపట్టారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
 
 హైదరాబాద్ నగరం అందరి సమష్టి కృషి అని.. దేశానికి ఆరోగ్య రాజధానిగా, సాఫ్ట్‌వేర్ హబ్‌గా ఉన్న ఆ నగరాన్ని ఒక్క తెలంగాణకే పరిమితం చేస్తే సీమాంధ్ర దశాబ్దాల వెనక్కి వెళుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారా? అని ప్రశ్నించగా.. తానెప్పుడూ వైఎస్‌ఆర్ మనిషినేనని, రెండేళ్లుగా పార్టీతో సంబంధం లేకుండా పనిచేస్తున్నానని, జననేత జగన్ ఆహ్వానిస్తే తప్పకుండా వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళతానని చెప్పారు.
Share this article :

0 comments: