కృష్ణాడెల్టాకు తీవ్ర అన్యాయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కృష్ణాడెల్టాకు తీవ్ర అన్యాయం

కృష్ణాడెల్టాకు తీవ్ర అన్యాయం

Written By news on Wednesday, September 4, 2013 | 9/04/2013

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారయింది కృష్ణాడెల్టా ఆయకట్టు రైతు పరిస్థితి. డెల్టాలో  వ్యవసాయం 60శాతం సాగునీటి ద్వారానూ, 40శాతం వర్షాధారంగానూ జరుగుతుంది.   జిల్లాలో వరిసాగుకు సకాలంలో నీరు అందకపోవటంతో సెప్టెంబరులోనూ వరినాట్లు వేస్తున్నారు. ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు నిండే వరకు కృష్ణాడెల్టాకు నీరు విడుదల చేయలేదు. ఈ ప్రాజెక్టులు నిండాక ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి, కాలువలకు ఒకేసారి నీటిని విడుదల చేయాల్సి వచ్చింది.  
 
   ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా పోతున్న నీటిలో దాదాపు 50 టీఎంసీలను మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో సముద్రం పాలు చేయాల్సి వచ్చింది. నీటిపారుదలశాఖ మంత్రి తెలంగాణా ప్రాంతానికి చెందిన వారు కావటంతో పాటు ఈశాఖలో పనిచేస్తున్న 38 మంది ఉన్నతాధికారుల్లో 28 మంది తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే కావటంతో డెల్టాకు నీరు విడుదల చేయకుండా తొక్కిపట్టారనే వాదన వినిపిస్తోంది. కృష్ణాడెల్టాకు ప్రథమ వినియోగ హక్కుగా ఉన్న కృష్ణా జలాలను దిగువకు వదలకుండా కక్షపూరిత ధోరణితో వ్యవహరించడంతో డెల్టాకు సాగునీటి విడుదలలో 20 రోజులు ఆలస్యంగా జరిగిందనే వాదన వినిపిస్తోంది.
 
 కృష్ణాడెల్టాలో ఏడాదికి రెండు పంటలు పండిస్తారని చెప్పేవారు సముద్రతీర ప్రాంతంలోని మండలాల్లో ప్రస్తుతం నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని రైతులు చెబుతున్నారు. సెప్టెంబరులోనూ వరినాట్లు వేస్తుండటంతో డిసెంబరు నెలాఖరు నాటికి వరికోతలు పూర్తవుతాయని రైతులు చెబుతున్నారు. రెండో పంటకు నీరిస్తారో లేదో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. రెండో పంటకు నీరు ఇవ్వకుంటే మినుము సాగు చేయాల్సి ఉంటుంది. డిసెంబరు నెలాఖరులో మినుములు విత్తితే ఈ ప్రభావం రెండో పంటపైనా పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 కాలువల సామర్థ్యం
 తక్కువయినందునే...
 ఈ ఏడాది ఖరీఫ్‌లోనే మలి వేసవిని తలపిస్తూ  ఉష్ణాగ్రతలు నమోదవుతుండటంతో సాగునీటి వినియోగం అన్ని ప్రాంతాల్లో అధికమైంది. ఒక రోజు పొలానికి  పూర్తి స్థాయిలో నీరు పెట్టినా తెల్లారేసరికి  ఆ నీరు ఇంకిపోవడంతో మళ్లీ అదే పొలానికి నీటిని పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎగువ ప్రాంత రైతులు సాగునీటి వినియోగాన్ని పెంచడంతో దిగువకు చుక్కనీరు రాని దుస్థితి నెలకొంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న జలాశయాల్లోకి నీరు వచ్చి చేరుతున్నా  కృష్ణాడెల్టాకు సాగునీటి విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకోవడానికి పాలకులు 20 రోజులపాటు జాప్యం చేయడంతో ఈ ప్రభావం వరిసాగుపై  ప్రధానంగా పడుతోంది.    ప్రకాశం బ్యారేజీకి పుష్కలంగా నీరు వచ్చినా  ఆ నీటిని  పూర్తి స్థాయిలో పొలాలకు వదలక పోవడానికి కాలువలు  కుంచించుకుపోవడమేననే వాదన వినిపిస్తోంది. ప్రకాశం బ్యారేజీనుంచి  అన్ని కాలువలకు కలిపి రోజులకు 10,300 క్యూసెకుల నీటిని విడుదలచేస్తే సరిపోతుందని, అయితే కాలువల  సామర్థ్యం తక్కువగా ఉండటంతో నీటి విడుదలను తగ్గించాల్సి వస్తుందని  అధికారులు చెబుతున్నారు.
 
 గత ఏడాది వర్షాధారంగానే నీటి విడుదల...
 గత ఏడాది నాగార్జునసాగర్‌నుంచి నీటిని సకాలంలో విడుదల చేయకున్నా వర్షాలు సక్రమంగా కురవడంతో  ప్రకాశం  బ్యారేజీకి ఎగువన ఉన్న  ఉపనదులు, వాగుల ద్వారా వచ్చిన నీటిని పొదుపుగా  కాలువలకు వదిలారు. ఈ ఏడాది పరిస్థితి  అందుకు విరుద్ధంగా ఉంది. 2012 జూన్, జూలై, ఆగస్టు నెలలల్లో సాధారణ వర్షపాతం 521.2 మిలీమీటర్లు కాగా 729.8 మిలీమీటర్లుగా నమోదైంది. 2013 జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణ వర్షపాతం 521.2 మిల్లీమీటర్లు కాగా 575.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 154 మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా నమోదైంది. ఖరీఫ్  సీజన్‌లో దాదాపు 6.37 లక్షల  ఎకరాల్లో  వరిసాగుకు నీటి విడుదల అరకొరగానే మారింది. గత ఏడాది ఆగస్టు20వ తేదీ నాటికి జిల్లాలో వరినాట్లు పూర్తికాగా ఈ ఏడాది సెప్టెంబరు 3వ తేదీ నాటికి 5.87 లక్షల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పూర్తయ్యాయి. ఇంకా 50వేల ఎకరాల్లో నాట్లు పూర్తి చేయాల్సి ఉంది.
 
 50 టీఎంసీల  నీరు సముద్రం పాలు...
 కృష్ణా డెల్టాకు ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌కు సుమారుగా 80 టీఎంసీల నీరు ఇస్తే సరిపోతుంది. అయితే అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి దాదాపు 50 టీఎంసీలకు పైగా  నీటిని ఈ ఖరీఫ్‌సీజన్‌లో సముద్రంలోకి వదిలివేశారు.  కాలువ శివారున ఉన్న బందరు, కోడూరు, నాగాయలంక, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాల్లో  ఇంకా  వరినాట్లు పూర్తి కాలేదు.   కాలువల సామర్థ్యం సరిపడినంతగా లేకపోవడంతో  ఇదివరకెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్  ఆగస్టులోనే వారాబందీ పద్ధతిలో సాగునీటిని విడుదల చేస్తున్నారు.   కృష్ణాడెల్టా పాకిస్తాన్‌లో ఉన్నట్లుగా భావించి పాలకులు కత్తికట్టి నీటి విడుదలలో జాప్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Share this article :

0 comments: