ఉద్యమ తీవ్రత తెలుగుదేశం పార్టీని వణికిస్తోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉద్యమ తీవ్రత తెలుగుదేశం పార్టీని వణికిస్తోంది

ఉద్యమ తీవ్రత తెలుగుదేశం పార్టీని వణికిస్తోంది

Written By news on Wednesday, September 11, 2013 | 9/11/2013

ఏలూరు : జిల్లాలో ఉప్పెనలా ఎగిసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రత తెలుగుదేశం పార్టీని వణికిస్తోంది. ఆ భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 13 నుం చి జిల్లాలో నిర్వహించ తలపెట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్రను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. సమైక్యవాదులతో ఛీకొట్టించుకునే కంటే యాత్రను మానుకుం టేనే మంచిదని నిర్ణయించుకున్న ఆయన కృష్ణాజిల్లా నుంచి వెనుదిరుగుతున్నారు. జిల్లా అంతటా ఉద్యమం ఉధృతంగా సాగుతుండటంతో బస్సుయాత్రకు ఇక్కడి నేతలు భరోసా ఇవ్వలేకపోతున్నారు. దీంతో చంద్రబాబు బస్సుయాత్ర నిలిచిపోయింది. 
 
 రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చడానికి కారణమై కూడా ఆ విషయాన్ని పక్కనపెట్టి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడుకు ఇప్పటికే పలు జిల్లాల్లో నిరసనలు ఎదురయ్యాయి. రెండురోజుల క్రితం కృష్ణా జిల్లా నూజివీడులో సమైక్యవాదులు బాబును గట్టిగా నిలదీశారు. పశ్చిమగోదావరిలో అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయని జిల్లా నేతలు ఇప్పటికే పలుసార్లు ఆయనకు చెప్పారు. దీంతో జిల్లాలో బస్సుయాత్ర నిర్వహించే సాహసం చేయలేక బాబు వెనుదిరుగుతున్నారు.
 
 మొదటి నుంచి ఛీత్కారాలే...
 విభజన నిర్ణయం వెలువడినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ తీరుపై సమైక్యవాదులు అగ్గిమీద గుగ్గిలమవుతూనే ఉన్నారు. రాష్ట్రం విడిపోతుం దని ఇక్కడి ప్రజలు మదనపడుతుంటే.. వారి మనోభావాలకు వ్యతిరేకంగా కొత్త రాజధాని నిర్మాణానికి రూ.నాలుగు లక్షల కోట్లు ఖర్చవుతాయని చెప్పుకొచ్చిన చంద్రబాబు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఉద్యమం తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో అన్నివర్గాలు రోడ్లపైకి వస్తున్నా చంద్రబాబు నోరుమెదపకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిం చారు. రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ చంద్ర బాబు ప్రకటనలు చేస్తున్న సమయంలోనే జిల్లాలో తెలుగు తమ్ముళ్లు దాంతో తమకు సంబంధం లేనట్టుగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటూ కొత్త నాటకాలకు తెరలేపారు. 
 
 ఈ క్రమంలోనే సమైక్యవాదులు పలుచోట్ల బాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆందోళనల్లో పాల్గొంటున్న టీడీపీ నేతలను నిలదీశారు. ఏలూరులో మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణను ఎన్జీవోలు నిరాహార దీక్ష వేదిక నుంచి కిందకు దింపివేశారు. ఎన్జీవోల ఆగ్రహాన్ని తట్టుకోలేక మరో నేత బడేటి బుజ్జి అప్పటికప్పుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే జిల్లాలో బాబు బస్సు యాత్ర చేస్తే అడ్డుకుంటామని ఎన్జీవోలు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పట్టిం చుకోకుండా కప్పదాటు వైఖరి అవలంభిస్తున్న బాబుపై జనం విరుచుకుపడుతూనే ఉన్నారు.
 
 చేతులెత్తేసిన జిల్లా నేతలు
 అయినా ఇవేమీ పట్టించుకోకుండా జిల్లాలో చంద్రబాబు బస్సుయాత్ర చేస్తానంటూ పట్టుబట్టారు. ఆ పార్టీ జిల్లా నేతలు అందుకు అంగీకరించలేదు. ఇక్కడ ఉద్యమం తీవ్రంగా ఉందని, ప్రజలు తరిమికొడితే అభాసుపాలవ్వాల్సి వస్తుందని చెప్పారు. అయినా యాత్ర చేసి తీరతానని అధినేత చెప్పడంతో కొద్దిరోజుల క్రితం ఏలూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాట్ల కోసం సమావేశం నిర్వహించారు. పార్టీ కీలకనేత మాగంటి బాబు సహా మరికొందరు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. కీలక నేతలు వద్దంటున్నా ఈనెల 13 నుంచి బాబు జిల్లా యాత్రకు టీడీపీ కేంద్ర కార్యాలయం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నేతలంతా సమావేశమై మరోసారి ఏర్పాట్లపై చర్చించారు. ఇక్కడి నేతలు వెనకడుగు వేయడం, జిల్లాలో ఉద్యమం సాగుతున్న తీరు, ఉద్యమంలో టీడీపీ నేతలకు ఎదురవుతున్న అవమానాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తన యూత్రను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. జిల్లా నేతలు సమావేశంలో ఉండగానే ఆ సమాచారం అందడంతో ఊపిరిపీల్చుకుని ఇంటిముఖం పట్టారు. 
 
Share this article :

0 comments: